Memu Kapulam Web Series Review :
రివ్యూ : ‘మేము కాప్‌లం’ వెబ్ సిరీస్ .. లైట్ హార్టెడ్ క్రైమ్ కామెడీ సిరీస్
నటీనటులు : నాగబాబు, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమల, సిరి పార్వతి, రీతూ చౌదరి, చరణ్ లక్కరాజు, కిరీటీ దామరాజు తదితరులు..
దర్శకత్వం : ప్రదీప్ మద్దాలి
బ్యానర్ : రా ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : బీవీఎస్ రవి
సినిమాటోగ్రఫీ : కిషోర్ బోయిడపు
ఎడిటర్ : మైకేల్ డి సెల్వ
మ్యూజిక్ – : సాకేత్ కోమండూరి
విడుదల తేదీ : 22-/05/2026
స్ట్రీమింగ్ : జీ 5
సీజన్స్ : 6 ఎపిసోడ్స్
Memu Kapulam Web Series Review :
‘మేము కాప్‌లం’ వెబ్ సిరీస్ : రివ్యూ
ఎమ్మెల్సీ అయిన తర్వాత నాగబాబు కొణిదెల ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ ‘మేము కాప్‌లం’. ఇటీవల జాఫర్, గెటప్ శ్రీను క్యాస్ట్ ఇష్యూతో గొడవపడిన వీడియో ఈ సిరీస్ కోసమే అని తెలిసిన తర్వాత అందరి దృష్టిని ఆకర్షించిందీ ఈ వెబ్ సిరీస్ . రైటర్‌గా మంచి పేరు తెచ్చుకున్న బీవీఎస్ రవి నిర్మాణంలో ‘వికటకవి’ ఫేమ్ ప్రదీప్ మద్దాలి రూపొందించిన సిరీస్‌లో అసలు ఏముంది? ఆడియెన్స్‌ను ఏ విధంగా అలరిస్తుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
మహదేవపట్నంలో గజపతిరాజు (నాగబాబు) మాటే శాసనం. అతడి పెంపుడు పందెం కోడి ‘సలార్ రాజు’ ఊరిలో ఓ సెలబ్రిటీలా పేరు తెచ్చుకుని, వరుస విజయాలతో సంక్రాంతి కోడి పందాల్లో అజేయంగా నిలుస్తుంటుంది. అయితే సంక్రాంతి వేడుకలకు ముందు జరిగిన ఓ పార్టీలో ఆ కోడి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో ఊరంతా కలకలం రేగుతుంది. ఈ కేసును చేధించే బాధ్యత అమాయకత్వం, కామెడీ టైమింగ్‌తో పేరుగాంచిన ఎస్ఐ రవి సొటారి (రవితేజ నన్నిమల), కానిస్టేబుల్ మోహన్ సొటారి (గెటప్ శ్రీను)లపై పడుతుంది. మొదట ఇది సాధారణ కోడి మిస్సింగ్ కేసులా కనిపించినా, దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ ఊరిలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. గజపతిరాజు రాజకీయ ప్రత్యర్థులు, అక్రమ వ్యాపారాలు, గంజాయి ముఠాలు, చేతబడి ప్రచారాలు, యువతను భయపెడుతున్న అనుమానాస్పద ఘటనలు అన్నీ ఈ కేసుతో ముడిపడి ఉన్నాయని రవి, మోహన్ గుర్తిస్తారు. మరోవైపు సంఘవి (సిరి పార్వతి), ఆకాష్ రెడ్డి (చరణ్ లక్కరాజు) ప్రేమకథ, రిపోర్టర్ మీనాక్షి (రీతూ చౌదరి) చేస్తున్న ఇన్వెస్టిగేషన్, గిరి (కిరీటి దామరాజు) పాత్ర కథకు మరింత ఆసక్తిని తీసుకొస్తాయి. కామెడీ, గ్రామీణ రాజకీయాలు, సస్పెన్స్, క్రైమ్ అంశాలను కలిపి తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ చివరికి ‘సలార్ రాజు’ మిస్సింగ్ వెనుక ఉన్న అసలు మిస్టరీని ఎలా బయటపెట్టిందన్నదే ప్రధాన కథాంశం.
ఎవరెలా చేశారంటే ..
ఈ వెబ్ సిరీస్‌కు ప్రధాన బలం నటీనటులే అని చెప్పొచ్చు. గజపతిరాజుగా నాగబాబు హుందాతనంతో కూడిన నటన కనబరిచారు. ఊరిలో తన మాటే చట్టం అన్నట్టుగా కనిపించే ఆ పాత్రకు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగా సరిపోయింది. ఓవర్ డ్రామా లేకుండా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో క్యారెక్టర్‌కు వెయిట్ తీసుకొచ్చారు. ముఖ్యంగా పోలీస్ పాత్రల్లో కనిపించిన రవితేజ నన్నిమల, గెటప్ శ్రీను తమదైన కామెడీ టైమింగ్‌తో ప్రతి ఎపిసోడ్‌ను ఎంటర్టైనింగ్గా మార్చేశారు. కేసును ఛేదించాలనే ఉత్సాహంలో వేసే ప్రతి ప్లాన్ చివరికి వారినే ఇబ్బందుల్లో పడేయడం, ఆ పరిస్థితుల్లో ఇద్దరి మధ్య వచ్చే సంభాషణలు సహజమైన హాస్యాన్ని పండించాయి. అమాయకత్వం, అతిమంచితనం కలిసిన ఎస్ఐ రవి పాత్రలో రవితేజ నన్నిమల మంచి ఈజ్‌తో నటించగా, గెటప్ శ్రీను తన సెటైరికల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌తో సిరీస్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. వీరిద్దరి కాంబినేషన్ సీన్లు కథలో కామెడీ ట్రాక్‌ను నిలబెట్టాయి. మరోవైపు సిరి పార్వతి తన క్యూట్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, చరణ్ లక్కరాజుతో వచ్చే సన్నివేశాల్లో సహజమైన కెమిస్ట్రీ కనిపించింది. రీతూ చౌదరి పాత్ర కథలో ట్విస్ట్‌లు ఇచ్చేలా ఉన్నప్పటికీ, విలనిజం పరంగా మాత్రం మరింత బలంగా డిజైన్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. అయినప్పటికీ రిపోర్టర్ పాత్రలో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఓకే అనిపిస్తుంది. కిరీటి దామరాజు తన పాత్రలో మంచి ఇంటెన్సిటీ చూపించగా, కథలో వచ్చే మలుపుల్లో అతడి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. అలాగే అనంత్ ప్రభు, కమల్, శ్రీధర్ రెడ్డి సహా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిలో సహజంగా నటించి కథను ముందుకు తీసుకెళ్లారు.
టెక్నికల్ విషయానికొస్తే..
టెక్నికల్‌గా ఈ వెబ్ సిరీస్ మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కిన ప్రయత్నంగా కనిపిస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథకు కావాల్సిన వినోదం, సస్పెన్స్ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు ప్రదీప్ మద్దాలి.. ఈ సిరీస్‌ను ముందుకు తీసుకెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కామెడీ ట్రాక్, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ మధ్య కన్ఫ్యూజన్ లేకుండా కథను నడిపించే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని ఎపిసోడ్స్‌లో సన్నివేశాలు కొద్దిగా సాగదీతగా అనిపించినప్పటికీ, మొత్తం మీద ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కథ, డైలాగ్స్ అందించిన శోభన్ చిట్టిప్రొలు గ్రామీణ నేటివిటీకి తగ్గట్టుగా మాటలు రాసారు. పోలీస్ క్యారెక్టర్స్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ నేచురల్‌గా అనిపిస్తాయి. అలాగే చాణక్య వర్మ, గోపాలకృష్ణ విద్మహేతో కలిసి రూపొందించిన స్క్రీన్‌ప్లేలో సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను దాచిపెడుతూ కథను ముందుకు నడిపించారు. సినిమాటోగ్రాఫర్ కిషోర్ బోయిడపు కోనసీమ అందాలను చాలా నేచురల్‌గా చూపించారు. రియల్ విలేజ్ లొకేషన్స్‌ను ఉపయోగించడం వల్ల విజువల్స్‌కు నిజమైన గ్రామీణ ఫీల్ వచ్చింది. ఫ్రేమ్స్‌లో ఆర్టిఫిషియల్నెస్ కనిపించకుండా సహజత్వాన్ని మెయింటైన్ చేయడం ప్లస్ అయింది. ఇక సాకేత్ కోమండూరి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు తగ్గట్టుగా ఉంది. అవసరమైన చోట మాత్రమే బీజీఎమ్ వినిపించేలా చూసి, ఓవర్‌డోస్ కాకుండా జాగ్రత్తపడ్డారు. నిర్మాణ విలువల పరంగా కూడా సిరీస్ రిచ్‌గా కనిపిస్తుంది. నిర్మాత బీవీఎస్ రవి ఖర్చులో ఎక్కడా రాజీ పడనట్టుగా అనిపిస్తుంది. వెబ్ సిరీస్ అయినప్పటికీ విజువల్ క్వాలిటీ, లొకేషన్స్, టెక్నికాలటీ పరంగా చిన్న సినిమాకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో మేకింగ్ కనిపిస్తుంది.
Memu Kapulam Web Series Review :
సిరీస్ ఎలా ఉందంటే..
ఈ వెబ్ సిరీస్‌ను పూర్తిగా చూస్తే ఇది ఒక పక్క గ్రామీణ నేపథ్యంలో సాగే క్రైమ్ కామెడీ, మరోపక్క కోనసీమ కల్చర్‌ను చూపించే ఎంటర్టైనర్గా కనిపిస్తుంది. సంక్రాంతి, కోడి పందాలు, ఊరి రాజకీయాలు, లోకల్ ఈగోస్, పోలీసుల అమాయకపు ఇన్వెస్టిగేషన్.. ఈ అన్ని అంశాలను కలిపి దర్శకుడు కథను సరదాగా చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కోడి పందాల్ని కేవలం వినోదంగా కాకుండా, కొందరు తమ గౌరవం, ప్రతిష్టకు చిహ్నంగా ఎలా తీసుకుంటారో చూపించిన తీరు కథకు నేటివిటీ ఫీల్ తీసుకొచ్చింది. సిరీస్ మొదటి ఎపిసోడ్ నుంచే గజపతిరాజుంగ, అతడి పందెం కోడి ‘సలార్ రాజు’ చుట్టూ కథ తిరుగుతుంది. ఆ కోడి మిస్సింగ్ అవ్వడంతో కథ అసలు ట్రాక్‌లోకి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి ఎస్ఐ రవి, కానిస్టేబుల్ మోహన్ చేసే ఇన్వెస్టిగేషన్ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా వీరిద్దరి అతి తెలివితో వేసే ప్లాన్స్ తిరగబడి వారే ఇబ్బందుల్లో పడే సన్నివేశాలు మంచి కామెడీని పండిస్తాయి. సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో చేసే హడావిడి, కేసును సీరియస్‌గా తీసుకున్నట్టే తీసుకుని చివరకు కామెడీగా మార్చేయడం బాగా వర్కవుట్ అయ్యింది. అయితే ఇది పూర్తిగా కామెడీ మీదే నడవదు. కోడి మిస్సింగ్ వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? గంజాయి దందా ఎలా కనెక్ట్ అయింది? చేతబడుల ప్రచారం వెనుక నిజం ఏమిటి? వంటి అంశాలతో సస్పెన్స్‌ను కూడా మెయింటైన్ చేశారు. దర్శకుడు ప్రతి ఎపిసోడ్లో ఒక్కో వ్యక్తిపై అనుమానం వచ్చేలా రాసుకోవడం వల్ల అసలు నిందితుడు ఎవరో చివరి వరకు అంచనా వేయడం కష్టమవుతుంది. ట్విస్ట్ కొద్దిగా సిల్లీగా అనిపించినా, ఊహించలేని విధంగా ఉండటం మాత్రం ప్లస్ పాయింట్.
సిరీస్‌లో కోనసీమ బ్యాక్‌డ్రాప్ బాగా ఉపయోగపడింది. గ్రామీణ వాతావరణం, కోడి పందాల హడావిడి, ఊరి పెద్దల మధ్య ఈగోలు కథకు రియాలిస్టిక్ ఫీల్ తీసుకొచ్చాయి. గజపతిరాజు తన కోళ్లకు ‘బాహుబలి రాజు’, ‘సలార్ రాజు’, ‘కల్కి రాజు’ వంటి పేర్లు పెట్టడం వంటి చిన్న చిన్న అంశాలు వినోదాన్ని పెంచాయి. అలాగే రవి పాత్రను మొదట అందరూ కామెడీగా తీసుకున్నా, చివరికి అదే వ్యక్తి ఊరిని కాపాడే స్థాయికి ఎదగడం ఎమోషనల్ కనెక్ట్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా చివరి ఎపిసోడ్లో రవి మోహన్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌లో కథ కొన్నిసార్లు ముందుకు కదలకుండా ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని కామెడీ ట్రాక్స్, ముఖ్యంగా ‘అబ్బా’ టీమ్‌తో వచ్చే సన్నివేశాలు నవ్వించాలనే ఉద్దేశంతో పెట్టినా అంతగా ప్రభావం చూపలేదు. అలాగే సంఘవి ఆకాష్ ప్రేమకథ, తర్వాత మోహన్‌తో వచ్చే ట్రాక్‌ను ఇంకాస్త బలంగా రాసి ఉంటే బాగుండేది. కొన్ని పాత్రలకు సరైన ముగింపు ఇవ్వకపోవడం కూడా కొంత అసంతృప్తిని మిగులుస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
నాగబాబు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్
రవితేజ నన్నిమల, గెటప్ శ్రీను కామెడీ ట్రాక్
కోనసీమ బ్యాక్‌డ్రాప్, గ్రామీణ నేటివిటీ
కోడి పందాల కాన్సెప్ట్‌ను ఎంటర్టైనింగ్గా చూపించడం
సస్పెన్స్‌ను చివరి వరకు మెయింటైన్ చేయడం
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
కొన్ని ఎపిసోడ్స్ సాగదీతలా అనిపించడం
రిపీటెడ్ ఫీలింగ్ ఇచ్చే ఇన్వెస్టిగేషన్ ట్రాక్
కొన్ని పాత్రలకు సరైన ముగింపు లేకపోవడం
ట్విస్ట్ ఆసక్తికరంగా ఉన్నా కొద్దిగా సిల్లీగా అనిపించడం
ఫైనల్‌గా : కోనసీమ నేటివిటీ, కోడి పందాల బ్యాక్‌డ్రాప్, రవి మోహన్ కామెడీతో సాగిపోయే లైట్ హార్టెడ్ క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్. అక్కడక్కడా ల్యాగ్, రిపీటెడ్ సీన్లు ఉన్నా సస్పెన్స్, గ్రామీణ వాతావరణం, కామెడీ ట్రాక్‌లతో ఒకసారి సరదాగా చూసేయొచ్చు.
రేటింగ్ : 2.75/5