Vadde Naveen Transfer Trimurthulu Trailer
టాలీవుడ్లో ఒకప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో వడ్డే నవీన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా, నిర్మాతగా రూపొందించిన ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రం జూన్ 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వి.వి. వినాయక్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వడ్డే నవీన్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన, “నవీన్ గారి సినిమాకు నేను అసిస్టెంట్, కో-డైరెక్టర్‌గా పని చేసిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. అదే సమయంలో నా ‘ఆది’ సినిమాకు కూడా బీజం పడింది. ఆయన నన్నెప్పుడూ ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు” అని అన్నారు. అలాగే నవీన్ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, “ఆయన చేసిన సినిమాల్లో చాలా వరకు తన మనసుకు నచ్చి చేసినవి కావు. సినిమాల విషయంలో ఆయన ఎప్పుడూ పూర్తి సంతృప్తిగా ఉండేవారు కాదు. ఇకపై మాత్రం తనకు నచ్చిన కథలనే ఎంపిక చేసుకుని చేయాలని కోరుకుంటున్నాను.ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ” అని అన్నారు.
Vadde Naveen Transfer Trimurthulu Trailer
హీరో, నిర్మాత వడ్డే నవీన్ మాట్లాడుతూ చిత్రంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. “వినాయక్ గారు అప్పటిలాగే ఇప్పటికీ వినయంగానే ఉంటారు. ఆయన ఎదుగుదల నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. మా ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉంది” అన్నారు. సినిమా గురించి మాట్లాడుతూ, “గత పదేళ్లలో టెక్నికల్‌గా ఇండస్ట్రీ ఎంతో మారిపోయింది. ఆ మార్పులను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇందులో కోర్ట్ డ్రామా, సస్పెన్స్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి” అని చెప్పారు.
రిలీజ్ సందర్భంగా ఎదురయ్యే పోటీపై స్పందిస్తూ, “ఏ శుక్రవారం అయినా ఒక్క సినిమా మాత్రమే విడుదలవడం జరగదు. మాకు ఎవ్వరితోనూ పోటీ లేదు. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. మేము కంటెంట్‌పైనే నమ్మకం పెట్టుకున్నాం” అని స్పష్టం చేశారు. అలాగే, “సహజత్వానికి దగ్గరగా ఉండేలా సినిమాను తీర్చిదిద్దాం. ఇందులోని కథ, కంటెంట్ బలంగా ఉంటాయి. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని చెప్పారు.
దర్శకుడు కమల్ తేజ నార్ల రూపొందించిన ఈ చిత్రంలో రాశీ సింగ్ కథానాయికగా నటించగా, శిల్పా తులస్కర్, రఘుబాబు, శివన్నారాయణ, దేవి ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించగా, తాజాగా వచ్చిన ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
కోర్ట్ డ్రామా, సస్పెన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ కలయికగా తెరకెక్కిన ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ జూన్ 19న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.