తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రభావం కొత్తది కాదు. కానీ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ (Vijay) అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన హిస్టారికల్ విక్టరీ మాత్రం రాజకీయ వర్గాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సినిమాల్లో మాస్ ఇమేజ్‌తో ఆకట్టుకున్న విజయ్, ఇప్పుడు ప్రజా నాయకుడిగా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం ప్రత్యేకతగా నిలిచింది.
ఎన్నికల ప్రచారంలో విజయ్ తీసుకున్న స్ట్రాటజీ ఈ విజయానికి కీలకంగా మారింది. యువత, మధ్యతరగతి, సామాన్య ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని, స్పష్టమైన అజెండాతో ప్రజల్లోకి వెళ్లడం ఆయనకు పెద్ద ప్లస్ అయింది. విద్య, ఉపాధి, అవినీతి నిర్మూలన వంటి అంశాలపై ఇచ్చిన హామీలు ఓటర్లను ప్రభావితం చేశాయి. ప్రత్యేకంగా యువ ఓటర్లలో విజయ్‌కు ఉన్న క్రేజ్ ఓట్లుగా మారింది. సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం, గ్రౌండ్ లెవెల్‌లో ఫ్యాన్ బేస్‌ను రాజకీయ మద్దతుగా మార్చుకోవడం ఆయన విజయానికి బలంగా నిలిచింది. ఆయనకు ఉన్న ఫ్యాన్స్ అసలు బూత్ స్థాయి వరకు పనిచేసి ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇక తమిళనాడు రాజకీయాల్లో పెద్దపార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికీ, విజయ్ తనదైన స్టైల్‌లో ప్రత్యామ్నాయంగా ఎదగడం విశేషం.తన గుర్తు అయిన విజిల్‌తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. సంప్రదాయ రాజకీయ నాయకులతో పోటీ పడుతూ ప్రజల్లో కొత్త ఆశను రేకెత్తించడం ఆయనకు సాధ్యమైంది. ఇది భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చే సూచనగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ హిస్టారికల్ విక్టరీతో విజయ్ ఇక కేవలం సినీ హీరో మాత్రమే కాదు.. జన నాయకుడిగా కూడా తన స్థానం ఏర్పరచుకున్నాడు. ఆయన రాజకీయ ప్రయాణం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ విజయంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పడంలో సందేహం లేదు.
విజయ్ (Vijay) సాధించిన ఈ విజయం ఒక వ్యక్తిగత గెలుపు మాత్రమే కాదు. యువ శక్తి, కొత్త ఆలోచనలకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా కూడా భావించవచ్చు. రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే పాలనపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
అతి తక్కుల కాలంలోనే ఘన విజయం
Vijay టీవీకే (Tamilaga Vettri Kazhagam) పార్టీని 2024 ఫిబ్రవరి 2 న ప్రకటించగా, అతి తక్కువ కాలంలోనే ఘన విజయం సాధించడం భారతీయ రాజకీయాల్లో అరుదైన ఘట్టంగా చర్చకు వస్తోంది. సినీ క్రేజ్‌ను రాజకీయ మద్దతుగా మార్చుకోవడం సులభం కాదు. కానీ విజయ్ ఆ కష్టమైన మార్గాన్ని చాలా వేగంగా దాటినట్లు కనిపిస్తోంది.
ఎంజీఆర్, ఎన్టీఆర్ తరహాలో..
ఇలాంటి సందర్భాల్లో చరిత్ర మనకు కొన్ని ఉదాహరణలు గుర్తుకు తెస్తుంది. తమిళనాడులోనే M. G. Ramachandran (ఎంజీఆర్) తన అపారమైన ప్రజాదరణను రాజకీయ శక్తిగా మార్చి అఖండ విజయాలు సాధించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో N. T. Rama Rao (ఎన్టీఆర్) తెలుగుదేశం పార్టీని స్థాపించిన కొద్ది కాలంలోనే అధికారంలోకి వచ్చి రాజకీయ చరిత్రను మార్చేశారు. ఈ ఇద్దరూ కూడా సినీ ప్రపంచంలో నిర్మించుకున్న విశ్వాసాన్ని ప్రజా నాయకత్వంగా మార్చడంలో విజయవంతమయ్యారు. అయితే, ఎంజీఆర్, ఎన్టీఆర్‌ల కాలంతో పోలిస్తే ఇప్పటి రాజకీయ పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి. సోషల్ మీడియా ప్రభావం, రాజకీయ అవగాహన పెరగడం, బలమైన పార్టీ వ్యవస్థ ఇవన్నీ ఉన్నప్పటికీ విజయ్ ఇంత తక్కువ సమయంలోనే విజయం సాధించడం ప్రత్యేకతగా నిలుస్తోంది.
విజయ్ సాధించిన ఈ ఫలితం.. సినీ స్టార్డమ్, ప్రజా విశ్వాసం, సమకాలీన రాజకీయ వ్యూహాలు కలిసి ఎలా పని చేస్తాయో చూపించే ఉదాహరణగా నిలుస్తోంది. ఎంజీఆర్, ఎన్టీఆర్‌ల తరహాలోనే విజయ్ కూడా తన రాజకీయ ప్రయాణాన్ని ఎంత దూరం తీసుకెళ్తాడో చూడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
విజయ్ సాధించిన ఈ గ్రాండ్ విక్టరీపై ఇటు టాలీవుడ్‌తోపాటు ఇతర సినీ ఇండస్ట్రీస్ అన్ని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.




