Summer Holidays Movie Best Children’s Movie
పిల్లల నవ్వులు, అమ్మమ్మ ఇంటి సందడి, వేసవి సెలవుల అల్లరిని తెరపై మళ్లీ చూపించేందుకు సిద్ధమవుతోంది “సమ్మర్ హాలిడేస్” చిత్రం. నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై టీమ్‌ను అభినందించారు. దర్శకుడు శ్రీకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ‘90స్’ ఫేమ్ మాస్టర్ రోహన్, ‘35 చిన్న కథ కాదు’ ఫేమ్ మాస్టర్ అరుణ్, ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫేమ్ ఖుషి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ విడుదల తర్వాత చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, “ఇటీవల ఇంత ఎనర్జీతో జరిగిన సినిమా ఈవెంట్ చూడలేదు. తెలుగు ప్రేక్షకులు మంచి చిల్డ్రన్ ఫిలింస్ కోసం ఎదురు చూస్తున్నారు. ‘సమ్మర్ హాలిడేస్’ ఆ లోటు తీర్చే సినిమా అవుతుందని అనిపిస్తోంది. పిల్లలు, ఫ్యామిలీస్ కలిసి థియేటర్స్‌కి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా ఇది కావాలి” అన్నారు.
నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ, “చిన్నప్పుడు ‘లిటిల్ సోల్జర్స్’లాంటి సినిమాలు చూసి ఎంత ఎంజాయ్ చేశామో ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు అలాంటి ఫీలింగ్ కొత్త తరం పిల్లలకు ఇవ్వాలనిపించింది. కొందరు ‘పిల్లల సినిమాలు ఎవరు చూస్తారు?’ అన్నారు. కానీ మంచి కథ ఉంటే కుటుంబం మొత్తం థియేటర్‌కు వస్తుందని నమ్మాను. ఈ సినిమా ఆ నమ్మకంతోనే చేశాం” అన్నారు. అలాగే చిన్న సినిమాలు, కంటెంట్ బేస్డ్ మూవీస్‌కు మద్దతు అవసరమని చెబుతూ, “ఇలాంటి సినిమాలు హిట్ అయితే మరిన్ని నిర్మాతలు ఈ జానర్లోకి వస్తారు” అని పేర్కొన్నారు.
డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ, “ఇది కేవలం పిల్లల సినిమా కాదు.. ప్రతి ఒక్కరినీ వారి చిన్ననాటికి తీసుకెళ్లే ఎమోషనల్ జర్నీ. ధీరజ్ గారి నమ్మకం వల్లే ఈ కథను ఇంత అందంగా తెరకెక్కించగలిగాం” అన్నారు.
డైరెక్టర్ సాయి రాజేశ్ తన స్పీచ్‌లో ప్రస్తుత సినిమా పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ రోజుల్లో ఏ కంటెంట్ ఆడియెన్స్‌ను చేరుకుంటుందో చెప్పలేని పరిస్థితి. అలాంటి సమయంలో కేవలం కథను నమ్మి చిల్డ్రన్ ఫిలిం చేయడం ధైర్యం. ధీరజ్లాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి అవసరం” అన్నారు.
డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ, “ఇప్పుడు పిల్లలకు చూపించేందుకు తెలుగులో సినిమాలే రావడం లేదు. మా చిన్నప్పుడు ఏడాదికి కనీసం ఒక మంచి పిల్లల సినిమా ఉండేది. చాలా రోజుల తర్వాత ఆ స్పేస్‌లో వస్తున్న సినిమా ఇది” అన్నారు.
Summer Holidays Movie Best Children’s Movie
చైల్డ్ ఆర్టిస్టులు రోహన్, అరుణ్, ఖుషి తమ అనుభవాలు పంచుకుంటూ సినిమా అందరికీ నచ్చుతుందని సక్సెస్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నామన్నారు. రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి కూడా చిత్రంలోని పాత్రలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తాయని తెలిపారు.
సింజిత్ యెర్రమల్లి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కిట్టు విస్సుప్రగడ సాహిత్యం అందించారు. మొత్తం ఐదు పాటలు ఉండనున్నాయని మ్యూజిక్ టీమ్ వెల్లడించింది. చిన్ననాటి జ్ఞాపకాల్ని మళ్లీ గుర్తుచేసే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న “సమ్మర్ హాలిడేస్” త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.