Satya Dev Rao Bahadur Just A Teaser Unveiled
సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో, వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’. వెర్సటైల్ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ‘ఓ సుందరి’ పాట, అలాగే ‘ది వరల్డ్ ఆఫ్ రావు బహదూర్’ వీడియో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా చిత్ర బృందం వినూత్నంగా రూపొందించిన ‘నాట్ ఎ టీజర్’ను విడుదల చేసింది.
మూడు నిమిషాల పది సెకన్ల నిడివి గల ఈ వీడియో ప్రేక్షకులను ఒక రహస్యాలతో నిండిన మానసిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రాణాంతక లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ మరణం అంచుల వరకూ వెళ్లిన వ్యక్తి జీవన ప్రయాణం, అతని గతం-వర్తమానం మధ్య జరిగే సంఘటనలు, ప్రేమ, ఒంటరితనం, మానసిక సంఘర్షణలతో కూడిన కథను ఆసక్తికరంగా పరిచయం చేసింది. ఈ చిత్రంలో సత్యదేవ్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాస్తవం, భ్రమల మధ్య చిక్కుకుని జీవించే వ్యక్తి పాత్రలో ఆయన ప్రదర్శించిన భావోద్వేగ నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. తన కెరీర్లో ఇప్పటివరకు కనిపించని కొత్త లుక్, కొత్త మానరిజమ్స్‌తో సత్యదేవ్ మరోసారి తన నటన వైవిధ్యాన్ని చాటుకున్నారు. సత్యదేవ్ సరసన దీపా థామస్ కథానాయికగా నటించగా, వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, మాస్టర్ కిరణ్ కీలక పాత్రలు పోషించారు. సాంకేతిక విభాగంలోనూ ‘రావు బహదూర్’ అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కినట్లు ‘నాట్ ఎ టీజర్’ స్పష్టం చేస్తోంది. దర్శకుడు వెంకటేష్ మహా తన ప్రత్యేక దృక్పథంతో కథనాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లగా, ప్రొడక్షన్ డిజైనర్ రోహన్ సింగ్ సృష్టించిన ప్రపంచం దృశ్యపరంగా విశేషంగా ఆకట్టుకుంటోంది. కార్తీక్ పరమార్ సినిమాటోగ్రఫీ, స్మరణ్ సాయి అందించిన నేపథ్య సంగీతం చిత్రంలోని మిస్టరీ, ఉత్కంఠను మరింత పెంచాయి.
Satya Dev Rao Bahadur Just A Teaser Unveiled
‘నాట్ ఎ టీజర్’ లాంచ్ ఈవెంట్లో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ, “తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారు. జూలై 3న విడుదల కానున్న ‘రావు బహదూర్’ కూడా అలాంటి ప్రత్యేకమైన చిత్రం. విదేశాల్లో ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఎంత గర్వంగా చెప్పుకుంటామో, ‘రావు బహదూర్’ గురించి కూడా అదే స్థాయిలో మాట్లాడుకునే రోజు వస్తుంది. తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా ఈ సినిమా రూపొందించాం. దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రానికి తన ప్రాణం పెట్టి పనిచేశాడు. జూలై 3న సినిమా చూసి, జూలై 4న నా పుట్టినరోజుకు ప్రేక్షకులు బహుమతిగా విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.
దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ, “మహేష్ బాబు, నమ్రతా గార్లు ఈ కథను నమ్మి మద్దతు ఇవ్వకపోతే ఈ సినిమా ఇక్కడివరకు వచ్చేది కాదు. ‘రావు బహదూర్’ నా జీవితంలో ఐదున్నర సంవత్సరాల ప్రయాణం. సత్యదేవ్ ఈ పాత్ర కోసం అసాధారణమైన కృషి చేశాడు. ప్రతిరోజూ గంటల తరబడి మేకప్‌తో పని చేసి, పాత్రలో పూర్తిగా లీనమయ్యాడు. తెలుగు సినిమాలో ఇది ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాను” అని తెలిపారు.
హీరోయిన్ దీపా థామస్ మాట్లాడుతూ, “మహేష్ బాబు గారి బ్యానర్ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కావడం గౌరవంగా భావిస్తున్నాను. సత్యదేవ్ గారు అద్భుతమైన నటుడు. ఈ సినిమాలో ఆయన నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. జూలై 3న థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత శరత్ చంద్ర మాట్లాడుతూ, “ఈ చిత్రం ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సినిమా ముగిసిన తర్వాత కూడా దాని ప్రభావం ప్రేక్షకుల మనసుల్లో ఉంటుంది” అని పేర్కొన్నారు.
నిర్మాత అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ, “సత్యదేవ్ కెరీర్లోనే కాదు, ఈ ఏడాది అత్యుత్తమ నటనలలో ఒకటిగా ఆయన పెర్ఫార్మెన్స్ నిలుస్తుంది. వెంకటేష్ మహా కథను అద్భుతమైన స్థాయిలో తెరపై ఆవిష్కరించారు. జూలై 3 ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినీ అనుభవాన్ని అందించబోతోంది” అన్నారు.
నిర్మాత గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, “ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. సత్యదేవ్ ఈ పాత్రలో తన విశ్వరూపాన్ని చూపించారు. తెలుగు ప్రేక్షకులు ఇంతవరకు చూడని కొత్త తరహా అనుభూతిని ‘రావు బహదూర్’ అందిస్తుంది” అని తెలిపారు.
విభిన్నమైన విజువల్ లాంగ్వేజ్, ఆసక్తికరమైన కథనం, అద్భుతమైన నటన, సాంకేతిక నైపుణ్యాల సమ్మేళనంగా రూపొందిన ‘రావు బహదూర్’పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.