Raviteja Irumudi Promises an Intense Emotional Ride
మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు, థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి.
Raviteja Irumudi Promises an Intense Emotional Ride
తాజాగా నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ‘మల్లెపూల పల్లకి’ పాటను విడుదల చేశారు. అయ్యప్ప భక్తుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న ఈ పాటను ‘ఇరుముడి’ కోసం జీవీ ప్రకాష్ కుమార్ కొత్త మ్యూజికల్ టచ్‌తో రూపొందించారు. పవర్ఫుల్ రిథమ్స్, గ్రాండ్ ఆర్కెస్ట్రేషన్‌తో పాటకు మరింత ఎనర్జీని జోడించారు. అయ్యప్ప స్వామి భక్తుడి గెటప్‌లో కనిపించిన రవితేజ తనదైన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, భారీ సంఖ్యలో భక్తులతో తెరకెక్కించిన విజువల్స్ పాటకు మాస్ అప్పీల్‌ను తీసుకొచ్చాయి. జీవీ ప్రకాష్ మ్యూజిక్, డప్పు శ్రీను వోకల్స్, రవితేజ ఎనర్జీ కలిసి పాటకు గూస్బంప్స్ అనిపించే అనుభూతిని అందిస్తున్నాయని చిత్రబృందం పేర్కొంది.
ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అతిథులుగా హాజరైన దర్శకులు బాబీ, బుచ్చిబాబు, రాహుల్ సాంకృత్యాన్, సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్ ఈ సినిమా రవితేజ కెరీర్లో మరో సూపర్ హిట్‌గా నిలవాలని కోరారు.
ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ ఒక మంచి ఎమోషనల్ రైడ్ అని అన్నారు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారని, ప్రతి క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుందని తెలిపారు. స్వాసిక నటన అద్భుతంగా ఉంటుందని, బేబీ నక్షత్రతో తన కాంబినేషన్ సీన్స్ ప్రేక్షకులను టచ్ చేస్తాయని చెప్పారు. ప్రియా భవానీ శంకర్ ‘కావేరి’ పాత్రలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని పేర్కొన్నారు. “బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది. అందరూ థియేటర్లలో ఒక మంచి సినిమాను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఒక డిఫరెంట్ రవితేజను చూడబోతున్నారు” అని రవితేజ అన్నారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘మల్లెపూల పల్లకి’ పాట కోసం ఎంతో శ్రమించామని, థియేటర్లో ఈ పాట ఒక తాండవంలా ఉంటుందని చెప్పారు. ‘ఇరుముడి’ తన గత సినిమాల్లా లైట్‌హార్టెడ్‌గా ఉండదని, చాలా సీరియస్‌గా, ఇంటెన్స్ ఎమోషన్స్‌తో తెరకెక్కించామని తెలిపారు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తాయని చెప్పారు.
ఈ సినిమా ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్న భక్తుడి బ్యాక్‌డ్రాప్‌లో సాగే థ్రిల్లర్‌తో పాటు ఎమోషనల్ రైడ్‌గా ఉంటుందని నిర్మాత రవిశంకర్ తెలిపారు. సినిమా అనుకున్న దానికంటే అద్భుతంగా వచ్చిందని, ఇది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ‘ఇరుముడి’ తనకు చాలా స్పెషల్ ప్రాజెక్ట్ అని చెప్పారు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు సినిమాలో పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ అవుతుందని నమ్ముతున్నానని తెలిపారు. రవితేజ తనకు పెద్ద ఫ్యాన్ అని, ఈ సినిమా ఆయన కెరీర్లో ‘విక్రమార్కుడు’ కంటే కూడా మెమొరబుల్ మూవీ అవుతుందని అన్నారు.
హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ ‘కావేరి’ లాంటి గొప్ప పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు శివ నిర్వాణకు ధన్యవాదాలు తెలిపారు. బేబీ నక్షత్రకు ఇది తెలుగులో తొలి సినిమా కాగా, రవితేజ, ప్రియా భవానీ శంకర్ తనకు ఎంతో సపోర్ట్ చేశారని నక్షత్ర పేర్కొన్నారు. మూవీ టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.