Ram Charan at the Delhi press meet for Peddi
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేశాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ డ్రామాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇండియా వైడ్‌గా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. గురువారం ఢిల్లీలో గ్రాండ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
Ram Charan at the Delhi press meet for Peddi
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ సినిమా వెనుక ఉన్న భావోద్వేగాన్ని పంచుకున్నారు. “ఈ సినిమాకోసం గత రెండున్నరేళ్లుగా ఎంతో నిజాయితీగా, అంకితభావంతో పనిచేశాం. దర్శకుడు బుచ్చిబాబు గారి విజన్, నిర్మాత సతీష్ గారి నమ్మకం, ఏఆర్ రెహమాన్ గారి సంగీతం, అద్భుతమైన నటీనటుల సహకారం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి” అని తెలిపారు.
‘పెద్ది’ కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపే కథ అని రామ్ చరణ్ పేర్కొన్నారు. “ఇది మట్టి వాసన ఉన్న కథ. గ్రామాల నుంచి వచ్చిన యువత తమ గుర్తింపుకోసం ఎలా పోరాడతారో చూపించే సినిమా. ముఖ్యంగా పిల్లలు, యువత ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలి. వాళ్లలో కొత్త ఆలోచన, ఆత్మవిశ్వాసం కలిగించే కథ ఇది” అన్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీని కూడా ఆయన ప్రస్తావించారు. “పెద్ది గురించి అడిగినప్పుడు గ్రామాలకు సాధికారతను అందించే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కిందని చెప్పాను. అప్పుడు మోదీ గారు చెప్పిన ఓ నిజజీవిత సంఘటన నాకు ఎంతో స్పూర్తినిచ్చింది. వెస్ట్ బెంగాల్‌లోని ఓ చిన్న గ్రామం నుంచి భారత ఫుట్‌బాల్ జట్టుకు వెళ్లిన ఒక్క ఆటగాడు, ఆ గ్రామ యువతలో స్పోర్ట్స్‌పై విపరీతమైన మార్పు తీసుకొచ్చాడని ఆయన చెప్పారు. అదే భావోద్వేగం ‘పెద్ది’లో కూడా ఉంటుంది” అని వివరించారు.
హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడుతూ, “ఇది చాలా రూటెడ్ ఫిల్మ్. ఇండియన్ భావోద్వేగాలతో తెరకెక్కిన సినిమా. బుచ్చిబాబు గారు నా పాత్రను ఎంతో అందంగా డిజైన్ చేశారు. రామ్ చరణ్ గారితో పనిచేయడం అద్భుతమైన అనుభవం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను” అని తెలిపారు.
సీనియర్ నటుడు బోమన్ ఇరానీ మాట్లాడుతూ రామ్ చరణ్ అంకితభావాన్ని ప్రశంసించారు. “ప్రేక్షకులను అలరించడానికి ఆయన ఎంత కష్టపడతారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. బుచ్చిబాబు గారి కథ చెప్పే తీరు నాకు వెంటనే నచ్చింది. అందుకే ఈ చిత్రంలో భాగమయ్యాను” అన్నారు.
Ram Charan at the Delhi press meet for Peddi
తొలి తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న దివ్యేందు శర్మ మాట్లాడుతూ, “ఇలాంటి భారీ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. నా పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. రామ్ చరణ్ గారి ‘పెద్ది’ పాత్ర ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండిపోతుంది” అని చెప్పారు.
నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ, “ఇది భావోద్వేగం, వినోదం, గ్రాండ్ విజువల్స్ కలగలిపిన చిత్రం. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారు. కుటుంబ సమేతంగా చూసే మంచి సినిమా ఇది” అన్నారు.