Maa Inti Bangaaram Pre-Release Event
సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ సెలెబ్రేషన్స్ వేడుకలో చిత్రబృందం సినిమాపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమానికి నిర్మాతలు డి. సురేష్ బాబు, మైత్రీ రవి శంకర్, స్వప్నా దత్, జాన్వీ నారంగ్, దర్శకుడు దేవా కట్టా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించిన నిర్మాత డి. సురేష్ బాబు మాట్లాడుతూ, ‘ఓ బేబీ’ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకున్నారు. రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించారని పేర్కొన్నారు.
Maa Inti Bangaaram Pre-Release Event
నటి సమంత మాట్లాడుతూ, భవిష్యత్తులో ఏడాదికి రెండు సినిమాలు అభిమానులకు అందించాలనే లక్ష్యంతో ఉన్నానని తెలిపారు. నటిగా ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదించిన తనకు, నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ కష్టాలు ఇప్పుడు మరింతగా అర్థమయ్యాయని చెప్పారు. చిత్రబృందంలోని ప్రతి విభాగం ప్రాణం పెట్టి పనిచేసిందని, రాజ్ అండ్ డీకే, నందినీ రెడ్డి తనకు ఎప్పుడూ అండగా నిలిచారని వెల్లడించారు.నాకు మా ఆయన బంగారం. ఆయన లక్‌ను నమ్ముకోలేదు. కష్టాన్నే నమ్ముకుని ఇక్కడి వరకు వచ్చారు. మూడేళ్ల తర్వాత వస్తున్నా అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ, జూన్ 19న విడుదలయ్యే ‘మా ఇంటి బంగారం’ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
నిర్మాత రాజ్ నిడిమోరు మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమలో కనిపించే ప్రేమ, అభిమానం మరెక్కడా చూడలేదన్నారు. సమంత అద్భుతమైన నటి అని ప్రశంసించిన ఆయన, ట్రైలర్‌కు వస్తున్న స్పందన చిత్రంపై మరింత నమ్మకాన్ని పెంచిందన్నారు. ప్రేక్షకులు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా చిత్రబృందం నిరంతర శ్రమతో ఈ చిత్రాన్ని రూపొందించిందన్నారు. సమంత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సినిమాను అత్యుత్తమంగా తీర్చిదిద్దామని చెప్పారు. ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని విధంగా సమంతను ఈ చిత్రంలో చూడబోతున్నారని తెలిపారు.
నిర్మాత జాన్వీ నారంగ్ మాట్లాడుతూ, నందినీ రెడ్డి దర్శకత్వ శైలి తనకు ఎంతో ఇష్టమని, ఈ సినిమా సమంత కోసమే రూపొందినట్టుగా అనిపిస్తోందన్నారు. నిర్మాత స్వప్నా దత్ మాట్లాడుతూ, ట్రైలర్ ఎంతో ఆకట్టుకుందని, ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత వై. రవి శంకర్ మాట్లాడుతూ, ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్లోనే ప్రత్యేకమైన వైబ్రేషన్ ఉందన్నారు. సమంత తమ బ్యానర్‌కు కూడా ఓ బంగారం లాంటి వ్యక్తి అని, ఆమె నటించిన ప్రతి సినిమా విజయవంతమైందని గుర్తు చేశారు. టీజర్, ట్రైలర్ చూసి ఆశ్చర్యపోయానని, చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
నిర్మాత హిమాంక్ దువ్వూరు మాట్లాడుతూ, కథా లైన్, టైటిల్ విన్నప్పుడే సినిమా ఫలితం ఊహించానన్నారు. సమంత, రాజ్ నిడిమోరుతో కలిసి ప్రారంభించిన ఈ ప్రయాణంలో అనేక మంది ప్రతిభావంతులైన టెక్నీషియన్లు, కళాకారులు భాగస్వాములయ్యారని తెలిపారు.
దర్శకుడు డీకే మాట్లాడుతూ, సమంతతో గతంలో రెండు సిరీస్‌లకు పని చేశానని, ప్రతి ప్రాజెక్ట్‌లోనూ ఆమె వంద శాతం కృషి చేస్తారని అన్నారు. ఈ చిత్ర ట్రైలర్ తనను కూడా ఉత్సాహపరిచిందని చెప్పారు.
దర్శకుడు దేవా కట్టా మాట్లాడుతూ, రాజ్, డీకేలతో చాలా కాలంగా స్నేహం ఉందని, గ్లింప్స్, టీజర్ చూసినప్పటి నుంచే ‘మా ఇంటి బంగారం’ ప్రత్యేక చిత్రమవుతుందని అర్థమైందన్నారు. నందినీ రెడ్డి మేకింగ్‌పై ప్రశంసలు కురిపించిన ఆయన, ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రీ రిలీజ్ వేడుకలో చిత్రబృందం వ్యక్తం చేసిన విశ్వాసం, ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కు లభించిన స్పందన నేపథ్యంలో ‘మా ఇంటి బంగారం’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. జూన్ 19న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.