Jai Ho Ramanuja Song Launch Grandly Held
భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించుకున్న శ్రీ రామానుజాచార్యుల జీవిత విశేషాలు, ఆయన సమాజానికి అందించిన సమానత్వ సందేశాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నంగా రూపొందుతున్న చిత్రం ‘జయహో రామానుజ’. లయన్ డా. సాయి వెంకట్ హీరోగా నటించడంతో పాటు స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు.
Jai Ho Ramanuja Song Launch Grandly Held
అమెరికన్ నటి జో శర్మ హీరోయిన్గా నటిస్తుండగా, సుమన్, ప్రవళ్లికతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా సాంగ్ లాంఛ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ, సామాజిక ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని ‘జయహో రామానుజ’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మాత, నటి ప్రవళ్లిక మాట్లాడుతూ.. ‘జయహో రామానుజ’ వంటి గొప్ప చిత్రంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి వంటి విభిన్న పాత్రల్లో నటించే అవకాశం దక్కిందని తెలిపారు. సమ సమాజం కోసం కృషి చేసిన రామానుజాచార్యుల మహోన్నత జీవితం గురించి నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు. ఈ సినిమా ప్రయాణం తనకు ఎంతో నేర్పిందని, అరుదైన ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరించాలని కోరారు.
టీఎఫ్‌పీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. రామానుజాచార్యుల గొప్పతనాన్ని భావితరాలకు పరిచయం చేసే ప్రయత్నం అభినందనీయమన్నారు. కమర్షియల్ సినిమాలు చేసి విజయాలు, ఆదాయం పొందే అవకాశం ఉన్నప్పటికీ, సమాజానికి సందేశం ఇచ్చే అంశాన్ని ఎంచుకోవడం ద్వారా సాయి వెంకట్ ప్రత్యేకత చాటుకున్నారని పేర్కొన్నారు. మనుషులందరూ సమానమే అనే రామానుజాచార్యుల సిద్ధాంతాన్ని సినిమా రూపంలో తీసుకురావడం ప్రశంసనీయమని అన్నారు.
చిత్ర నటుడు, దర్శకుడు లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ.. రామానుజాచార్యులు కుల, మత భేదాలకు అతీతంగా మానవ సమానత్వాన్ని చాటిన మహనీయుడని అన్నారు. ఈ సినిమా నిర్మాణ సమయంలో తన జీవితంలో ఎన్నో అద్భుతమైన అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. టీటీడీకి రూ.20 లక్షల విరాళం అందించే అవకాశం రావడం కూడా ఆ మహనీయుడి ఆశీస్సులేనని భావిస్తున్నానన్నారు.

సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలను తీసుకురావాలనే ఉద్దేశంతో విడుదల కొంత ఆలస్యమైందని సాయి వెంకట్ వెల్లడించారు. ఒకప్పుడు సమాజంలో నెలకొన్న వివక్షను ప్రశ్నిస్తూ, అందరికీ ఆధ్యాత్మిక సమానత్వాన్ని అందించేందుకు రామానుజాచార్యులు చేసిన పోరాటం అసాధారణమని చెప్పారు. అందరికీ ‘ఓం నమో నారాయణ’ మంత్రాన్ని అందించి సమానత్వ భావనను వ్యాప్తి చేసిన ఆయన జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అక్టోబర్ 25న సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. శతాబ్దాల క్రితమే సమాజంలో సమానత్వం కోసం గొప్ప సందేశం ఇచ్చిన రామానుజాచార్యుల జీవితాన్ని సినిమాగా మలచడం గొప్ప ప్రయత్నమని అన్నారు. ఇలాంటి మహనీయుడి కథను ప్రేక్షకులకు చేరువ చేయడం ద్వారా సాయి వెంకట్ ఒక ప్రత్యేకమైన ప్రయత్నం చేశారని ప్రశంసించారు. ఈ చిత్రం ఆయనకు మంచి గుర్తింపుతో పాటు ఘన విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. కొన్ని పాత్రలు కొందరు నటులకు మాత్రమే ప్రత్యేక గుర్తింపును తెస్తాయని అన్నారు. రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ ఎలా గుర్తుకొస్తారో, భక్తి పాత్రలు అంటే విజయచందర్ ఎలా గుర్తుకొస్తారో.. భవిష్యత్తులో వెండితెరపై రామానుజాచార్యులు అంటే సాయి వెంకట్ గుర్తుకు రావాలని ఆకాంక్షించారు. ఈ సినిమాలో సాయి వెంకట్ ఏకంగా పదకొండు విభిన్న పాత్రల్లో నటించడం విశేషమని చెప్పారు. అన్ని భారతీయ భాషల్లో విడుదలవుతున్నందున ఇది నిజమైన పాన్ ఇండియా చిత్రమని పేర్కొన్నారు.
నిర్మాత మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. సాయి వెంకట్‌ను పోస్టర్లో రామానుజాచార్యుల రూపంలో చూసినప్పుడు సహజంగానే భక్తి భావన కలిగిందన్నారు. ఆ పాత్రలో ఆయన ఎంతో సహజంగా కనిపిస్తున్నారని, ఈ సినిమా సాయి వెంకట్ కెరీర్లో ప్రత్యేక చిత్రంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట బోర్డు సభ్యుడు డా. లక్ష్మీనారాయణ, ఓబీసీ కన్వీనర్ మల్లేష్, అన్నపూర్ణ, ప్రొఫెసర్ కిరణ్, శ్రీనివాస్, నిర్మాత మోహన్ గౌడ్, నటుడు రాంకీ, సత్యనారాయణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.