Grand Launch on VenkyAnil5 & NkrAR2
సంక్రాంతి 2027ను లక్ష్యంగా చేసుకుని ప్రేక్షకులను అలరించేందుకు మరో క్రేజీ మల్టీస్టారర్ చిత్రం రూపుదిద్దుకుంటోంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి చేస్తున్న ఈ భారీ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. ఇందులో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
Grand Launch on VenkyAnil5 & NkrAR2
ఈ చిత్ర ప్రారంభోత్సవం గురువారం ఘనంగా ముహూర్త పూజలతో జరిగింది. చిత్ర యూనిట్‌తో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటికి స్క్రిప్ట్‌ను అందజేసి చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. తొలి సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్‌కు ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ తొలి సన్నివేశంలో వెంకటేష్, కల్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి పాల్గొన్నారు.

అనిల్ రావిపూడి శైలిలో పూర్తి స్థాయి వినోదంతో, కుటుంబ ప్రేక్షకులను అలరించే సంక్రాంతి ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. వెంకటేష్, కల్యాణ్ రామ్‌ల అరుదైన కలయిక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనేలా చేసింది.
ప్రారంభం కాకముందే ఈ సినిమాపై సినీ వర్గాల్లో మంచి చర్చ మొదలైంది. అనిల్ రావిపూడి వరుస విజయాలు, విభిన్నమైన స్టార్ కాంబినేషన్, ప్రముఖ నిర్మాణ సంస్థల భాగస్వామ్యం ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
సాంకేతికంగా కూడా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో రూపొందనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఎడిటర్‌గా తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
బ్లాక్ బస్టర్ ముహూర్తం