Golden Bhagyam – Satya & Yogi Babu Crazy Combo
తెలుగు, తమిళ ప్రేక్షకులను ఒకే కామెడీ ట్రాక్‌పైకి తీసుకురావడానికి మరో క్రాస్ఓవర్ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. టాలీవుడ్లో తనదైన కామెడీ టైమింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న సత్య, కోలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న యోగిబాబు తొలిసారి ఓ ప్రత్యేకమైన సెటప్‌లో కలిసి నటిస్తున్నారు. ‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘గోల్డెన్ భాగ్యం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.
Golden Bhagyam – Satya & Yogi Babu Crazy Combo
డ్రీమ్ మూవీ మేకర్స్, నయవాయు చిత్రాలు బ్యానర్లపై నాగార్జున రెడ్డి, పవన్ బాసంశెట్టి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రెండు బ్యానర్లకు ఇదే తొలి ప్రొడక్షన్ వెంచర్ కావడం విశేషం. తాజాగా మేకర్స్ మూవీ టైటిల్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
తెలుగు, తమిళ సంస్కృతులను ఫన్‌గా కలుపుతూ గ్లింప్స్‌ను డిజైన్ చేశారు. ఓ తెలుగు వ్యక్తి, ఓ తమిళ వ్యక్తి తమకు ఇష్టమైన ఆహారాలను ఆస్వాదిస్తూ.. తమ వంటకాల గొప్పతనం గురించి చెప్పుకోవడంతో వీడియో మొదలవుతుంది. తెలుగు వ్యక్తి బిర్యానీ, కూల్‌డ్రింక్‌తో కనిపిస్తే.. తమిళ వ్యక్తి ఇడ్లీ, సాంబార్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. ఇద్దరి మధ్య తమ వంటకాలే బెస్ట్ అంటూ జరిగే సరదా వాదన నవ్వులు పూయిస్తుంది. ఇంతలో మరో వ్యక్తి ఎంట్రీ ఇచ్చి.. ఇంతకంటే పెద్ద కాంబినేషన్ ముందుందని చెప్పడంతో గ్లింప్స్ ఒక్కసారిగా కొత్త మలుపు తిరుగుతుంది. ఆ వెంటనే సత్య, యోగిబాబులను స్టైలిష్‌గా పరిచయం చేశారు. ఇద్దరూ వైట్ అండ్ వైట్ ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. తెలుగు నటుడు సత్య తమిళంలో మాట్లాడటం, తమిళ కమెడియన్ యోగిబాబు తెలుగులో మాట్లాడటం గ్లింప్స్‌లోని కామెడీకి మరింత బలాన్నిచ్చింది.
కేవలం కామెడీకి మాత్రమే పరిమితం కాకుండా ఈ కథలో ప్రేమ, క్రైమ్, యాక్షన్ అంశాలు కూడా ఉంటాయని దర్శకుడు పవన్ బాసంశెట్టి గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చారు. సత్య, యోగిబాబు పాత్రల చుట్టూ సాగే కథలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్ చివర్లో సినిమాకు ‘గోల్డెన్ భాగ్యం’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా కూడా పూర్తి వినోదాత్మకంగా ఉండబోతుందనే సంకేతాలను ఈ వీడియో ఇచ్చింది.
ఈ చిత్రంలో జయశ్రీ, అతిరాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సుదర్శన్, కిశోర్ తిరుమల, రోహిణి, తనికెళ్ల భరణి, సునీల్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాంకేతికంగా కూడా ఈ సినిమాకు మంచి టీమ్ పనిచేస్తోంది. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాటోగ్రాఫర్ బబ్లూ అజు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పవన్ సీహెచ్ సంగీతం అందిస్తుండగా.. కామేష్ ప్రొడక్షన్ డిజైన్, రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.