Megastar Surprise Gift to State First Ranker Rishi
టీజీ ఈఏపీసెట్ 2026లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించిన విద్యార్థిని ఎం. రుషిని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. ఆమె చిన్ననాటి కలను నిజం చేస్తూ స్వయంగా కలుసుకుని ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందజేశారు. తన సేవా కార్యక్రమాలు, ఉదారతతో ఎప్పటికప్పుడు స్ఫూర్తిగా నిలిచే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తెలంగాణ ఈఏపీసెట్ 2026లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన హైదరాబాద్‌లోని రెజోనెన్స్ జూనియర్ కాలేజీల విద్యార్థిని ఎం. రుషిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆమె ప్రతిభను కొనియాడారు. రుషి సాధించిన ఈ అరుదైన విజయంపై ఆనందం వ్యక్తం చేసిన చిరంజీవి గారు, ఆమె కృషి, అంకితభావం, పట్టుదలను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదించారు.
Megastar Surprise Gift to State First Ranker Rishi
మెగాస్టార్ చిరంజీవిని కలవడం రుషి చిన్ననాటి కల. మంచి ర్యాంక్ సాధిస్తే ఆ కల నిజమవుతుందని ఆమె తల్లిదండ్రులు ప్రోత్సహించగా, ఇప్పుడు ఆ కలను స్వయంగా చిరంజీవి గారే నిజం చేశారు. రుషి, ఆమె కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలుసుకున్న ఆయన, ఆమె ప్రతిభకు గుర్తింపుగా ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందజేశారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యం రుషి పెట్టుకుందని తెలుసుకున్న చిరంజీవి గారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. “భవిష్యత్తులో ఏ సహాయం అవసరమైనా ఆలోచించకుండా సంప్రదించండి. నన్ను కుటుంబ సభ్యుడిలా భావించండి. అమ్మాయి తన లక్ష్యాన్ని చేరుకునేలా పూర్తి ప్రోత్సాహం ఇవ్వండి” అని రుషి తల్లిదండ్రులకు సూచించారు.
ఈ సందర్భంగా రెజోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణ చంద్రరావు నర్రా మాట్లాడుతూ, “ఎం. రుషి సాధించిన విజయం కేవలం ఒక ర్యాంక్ మాత్రమే కాదు.. ఇది చారిత్రాత్మక మైలురాయి. ముఖ్యంగా అమ్మాయిలకు ఇది గొప్ప స్ఫూర్తి. మా విద్యార్థిని ఈ అరుదైన ఘనత సాధించడాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు అభినందించడం మాకు ఎంతో గర్వకారణం” అన్నారు.
1986లో ప్రారంభమైన ఈఏఎంసెట్ పరీక్ష, ప్రస్తుతం ఈఏపీసెట్‌గా కొనసాగుతూ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలలో ఒకటిగా నిలిచింది. దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్రలో అగ్రస్థానాలు ఎక్కువగా అబ్బాయిలే సాధించిన ఈ పరీక్షలో, తెలంగాణ ఈఏపీసెట్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా ఎం. రుషి చరిత్ర సృష్టించింది.
రుషి విజయం రెజోనెన్స్ జూనియర్ కాలేజీలు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవడమే కాకుండా, లక్ష్యసాధనకు కృషి చేస్తే అమ్మాయిలు కూడా అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరనే సందేశాన్ని మరోసారి చాటిచెప్పింది.