Tollywood Exhibitors vs Producers :
ఎగ్జిబిటర్లు- నిర్మాతల వివాదానికి ముగింపు దిశగా అడుగులు..
21 మంది కమిటీ ఏర్పాటు..
‘పెద్ది’ రిలీజ్‌కు క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
Tollywood Exhibitors vs Producers :
టాలీవుడ్లో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన ఎగ్జిబిటర్లు-నిర్మాతల మధ్య ‘పర్సంటేజీ విధానం’ వివాదంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో జరిగిన సంయుక్త సమావేశంలో సమస్య పరిష్కారానికి 21 మంది సభ్యులతో ప్రత్యేక ఉప కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ రెండు నెలల్లో సమగ్ర నివేదిక సమర్పించనుంది.
ఈ సమావేశానికి టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు దగ్గుబాటి సురేశ్ బాబు అధ్యక్షత వహించగా.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రధానంగా థియేటర్లలో ప్రస్తుతం అమల్లో ఉన్న రెంటల్ విధానం బదులుగా పర్సెంటేస్ సిస్టమ్ అమలు చేయాలన్న ఎగ్జిబిటర్ల డిమాండ్‌పై విస్తృతంగా చర్చించారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సురేశ్ బాబు..
“ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య జరిగిన చర్చలు చాలా పాజిటివ్‌గా సాగాయి. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఉప కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే దీనిపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటాం” అని తెలిపారు.
ఈ కమిటీకి సీనియర్ నిర్మాతలు, ఛాంబర్ ప్రతినిధులు మార్గదర్శకత్వం వహించనున్నారు. వీరిలో:
* దగ్గుబాటి సురేశ్ బాబు (ఛైర్మన్)
* అల్లు అరవింద్
* దిల్ రాజు
* డాక్టర్ కె.ఎల్. నారాయణ
* కె. అశోక్ కుమార్ (కన్వీనర్) ఉన్నారు.
అలాగే నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఏడుగురు చొప్పున సభ్యులను ఎంపిక చేశారు.
నిర్మాతల విభాగం నుంచి: సురేందర్ రెడ్డి, సుప్రియ, వై. రవిశంకర్, బాపినీడు, చెరుకూరి సుధాకర్, ఎస్కేఎన్, ప్రసన్న కుమార్.
ఎగ్జిబిటర్ల విభాగం నుంచి : ప్రతాప్ రెడ్డి, బాల్గోవింద్ రాజ్, అనుపమ్ రెడ్డి, శ్రీనివాసరావు, వీరనారాయణ బాబు, వంశీ కిషోర్ (చిన్ని), విజేందర్ రెడ్డి.
డిస్ట్రిబ్యూటర్ల విభాగం నుంచి : విష్ణుమూర్తి, వీరనాయుడు, సుధాకర్ రెడ్డి, ముత్యాల రామదాసు, నాగార్జున, ఠాగూర్ మధు, ధీరజ్ మొగిలేని.
Tollywood Exhibitors vs Producers :
A, B, C సెంటర్లకు వేర్వేరు విధానాలపైనా చర్చ జరిగింది.
ప్రస్తుతం థియేటర్ల ఆదాయ పంపకాల్లో అమల్లో ఉన్న విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎగ్జిబిటర్లు.. అన్ని కేంద్రాల్లో సమాన విధానం కాకుండా ప్రాంతాల వారీగా శాతాల పద్ధతిని అమలు చేయాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన దిల్ రాజు.. “A, B, C సెంటర్లలో ఎలా పర్సంటేజీ విధానం ఉండాలన్నది కమిటీ అధ్యయనం చేసి నిర్ణయిస్తుంది. నిర్మాతలు కూడా ఈ అంశంపై సానుకూలంగానే ఉన్నారు. ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం కొనసాగాలన్నదే అందరి అభిప్రాయం” అని చెప్పారు.
Tollywood Exhibitors vs Producers :
‘పెద్ది’ రిలీజ్‌పై స్పష్టత
ఇటీవల ఎగ్జిబిటర్ల సంఘం తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటికి దిల్ రాజు చెక్ పెట్టారు.
“జూన్ 4న విడుదల కానున్న ‘పెద్ది’ సినిమాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. పూర్తి ఆరోగ్యకరమైన వాతావరణంలో సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు” అని ఆయన స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో నెలకొన్న విభేదాలకు చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనే దిశగా ఛాంబర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.





