ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి సూపర్ స్టార్‌డమ్ తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. శనివారం (మే 9) విజయ్ పుట్టినరోజు సందర్భంగా తన గురించి ఒక ప్రత్యేక కథనం.
స్టార్‌డమ్‌ను సాధారణంగా బాక్సాఫీస్ నంబర్లతో కొలుస్తారు. ఒక సినిమా హిట్ అయితే క్రేజ్ పెరుగుతుంది, ఫలితం ఆశించినట్టుగా లేకపోతే తగ్గుతుంది. కానీ విజయ్ దేవరకొండ ప్రయాణం ఆ సాంప్రదాయానికి అతీతం. విజయాలు వచ్చినా, ఎదురుదెబ్బలు తగిలినా ఆయన చుట్టూ ఉన్న ఆసక్తి, చర్చ, ప్రేక్షకుల్లోని ఆకర్షణ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. అదే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టిన అసలు శక్తి. కొందరి కెరీర్లు సినిమాల హిట్‌తో నిర్మితమవుతాయి. కొందరివి వ్యక్తిత్వంతో నిలబడతాయి. విజయ్ విషయంలో ఈ రెండూ కలిసి పనిచేశాయి. తెరపై కనిపించే తీవ్రత, తెర బయట కనిపించే నేరుగా మాట్లాడే ధోరణి, తనదైన ఆత్మవిశ్వాసం ఈ మూడూ కలిసి ఆయనను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేశాయి.
పెళ్లి చూపులు చిత్రం ఆయనకు బలమైన పునాది వేసింది. కానీ ‘అర్జున్ రెడ్డి’తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా విజయ్‌ను కేవలం హీరోగా కాకుండా కంప్లీట్ స్టార్‌ను చేసింది. ఆ చిత్రంలో ఆయన నటించిన తీరు యూత్‌ను బాగా అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన ప్రయాణం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.
‘ట్యాక్సీవాలా’ సినిమా ఆయన కమర్షియల్ పవర్‌ను ప్రూవ్ చేసింది. ‘గీత గోవిందం’ తో తనలోని ఫ్యామిలీ యాంగిల్‌ను చూపించారు. అర్బన్ యూత్ మాత్రమే కాదు, కుటుంబ ప్రేక్షకుల్లోనూ తనకు బలమైన స్థానం ఉందని ఆ చిత్రంతో నిరూపించారు. తర్వాత పూరి జగన్నాథ్ దర్శకనిర్మాణంలో విజయ్ హీరోగా నటించిన ‘లైగర్’ భారీ అంచనాల మధ్య విడుదలైనా ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. అయినా తన నటనకు మాత్రం మంచి పేరొచ్చింది. అలాగే ఖుషి, ద ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో తిరిగి ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు. విజయ్‌పై దర్శకులు, నిర్మాతలు పెట్టే నమ్మకానికి కారణం కేవలం మార్కెట్ కాదు. ఒక పాత్రను పూర్తిగా ఓన్ చేసుకునే తీరు, స్క్రిప్ట్ దశ నుంచే సినిమా ప్రపంచంలోకి ప్రవేశించే అంకితభావం, ఆ పాత్రకు తన శరీరం, స్వరం, భావోద్వేగం అన్నీ అంకితం చేసే పని తత్వం. ఇవే ఆయనతో కొత్త కథలు ఊహించడానికి కారణం. తెరపై ఆయన కనిపించినప్పుడు పాత్రకు ఒక అదనపు పల్స్ వస్తుందని దర్శకులు నమ్ముతారు.
స్టార్‌గా విజయ్ ప్రభావం సినిమాలకే పరిమితం కాలేదు. కరోనా సమయంలో ఆయన ప్రారంభించిన దేవరకొండ ఫౌండేషన్ (Deverakonda Foundation) ద్వారా అనేక కుటుంబాలకు అవసరమైన సహాయం అందింది. యువతకు ఉపాధి అవకాశాల కోసం చేపట్టిన కార్యక్రమాలు, అభిమానులతో నిరంతర సంబంధం, వారిని వ్యక్తిగతంగా గుర్తించి ఆనందపరిచే ప్రయత్నాలు ఇవన్నీ తనకు మరోస్థాయిలో నిలబెట్టాయి. అభిమానులతో విజయ్‌కు ఉన్న బంధం ప్రత్యేకం. తన ప్రయాణంలో తోడుగా నిలిచిన మనుషులపై చూపే గౌరవం. అందుకే ఆయన గురించి సోషల్ మీడియాలో చిన్న సంఘటన కనిపించినా స్పందిస్తారు. అభిమానులను కలుస్తారు. వాళ్ల ఆనందాన్ని తన విజయానికి భాగంగా భావిస్తారు. ఈ నేరుగా కలిసే స్వభావమే ఆయన చుట్టూ ఉన్న కమ్యూనిటీని మరింత బలపరిచింది.
నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా ఆయన అదే దూకుడు చూపించారు. రౌడీ వేర్ (Rowdy Wear) ద్వారా తన ఇమేజ్‌ను బ్రాండ్‌గా మలిచారు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి, ఒక్కో మెట్టు ఎక్కుతూ కొద్ది సంవత్సరాల్లోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును నిర్మించుకోవడం సాధారణ విషయం కాదు. ఇది కేవలం స్టార్‌డమ్ కాదు. ఇది నమ్మకం, నిరంతర శ్రమకు నిదర్శనం.
ఇప్పుడు విజయ్ కెరీర్ ఒక కీలక దశలో ఉంది. ఆయన లైనప్‌ను చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ సినిమాల్లో నటిస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ‘రణబాలి’ మేకర్స్ విజయ్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ ఇంటెన్స్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. ‘ట్యాక్సీ వాలా’ తర్వాత రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఇందులో విజయ్ సరసన ఆయన భార్య రష్మిక మందన్న జోడీగా నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. పీరియాడిల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెత్‌తో నిర్మిస్తోంది.
మరోసారి పింక్‌విల్లాతెలుగు.కామ్ తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.





