ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి కన్నుమూతతో దక్షిణాది సినీ పరిశ్రమలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు వందకు చేరువైన చిత్రాలను నిర్మించిన ఈ లెజెండరీ ప్రొడ్యూసర్ మంగళవారం రాజస్థాన్‌లోని ఉదయపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలిసిన వెంటనే టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి.
ఆర్.బి. చౌదరి అసలు పేరు రతన్‌లాల్ భగత్రామ్ చౌదరి. రాజస్థానీ కుటుంబానికి చెందిన ఆయన మొదట ఉక్కు, ఎగుమతులు, నగల వ్యాపారాల్లో రాణించి, తరువాత సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 1988లో మలయాళ చిత్రం ‘ఆడిపాపం’తో నిర్మాతగా ప్రయాణం ప్రారంభించిన ఆయన, 1990లో తమిళ చిత్రం ‘పుదు వసంతం’తో పెద్ద విజయాన్ని అందుకుని వరుసగా తమిళ చిత్రాలను నిర్మించారు.
తమిళ స్టార్ హీరో విజయ్ కెరీర్లో కీలకమైన ‘పూవే ఉనక్కగా’, ‘తుళ్ళధ మనముం తళ్ళుం’, ‘తిరుపాచ్చి’ వంటి చిత్రాలు చౌదరి నిర్మాణంలో భారీ విజయాలను సాధించాయి. 1994లో శరత్ కుమార్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కెప్టెన్’ సినిమాతో ఆయన టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు.
అనంతరం ‘సుస్వాగతం’, ‘సూర్యవంశం’, ‘రాజా’, ‘నువ్వు వస్తావని’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘సంక్రాంతి’, ‘అన్నవరం’, ‘రచ్చ’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించారు. కథలో బలం ఉంటే కొత్తవారితో కూడా విజయం సాధించవచ్చని నిరూపించిన నిర్మాతగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో కొత్త దర్శకులు, నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ‘స్టార్ మేకర్’గా ఆయన పేరు నిలిచిపోయింది.
ప్రస్తుతం విశాల్ హీరోగా రూపొందుతున్న ‘మకుటం’ చిత్రం ఆయన నిర్మాణంలోనే తెరకెక్కుతోంది. ఇది సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న 99వ చిత్రం కావడం విశేషం. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే ఆ సినిమా యూనిట్ షూటింగ్ సెట్లోనే నివాళులు అర్పించింది.
వ్యక్తిగత జీవితంలోనూ ఆయన ఆదర్శప్రాయుడిగా నిలిచారు. ఆయనకు నలుగురు సంతానం. వారిలో కుమారులు జీవా, జితన్ రమేష్ ఇద్దరూ హీరోలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా జీవాకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది.
ఆయన మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమ ఒక శకానికి వీడ్కోలు పలికినట్టైంది. ఆయన నిర్మించిన చిత్రాలు, ఆయన సృష్టించిన సినీ వారసత్వం ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తాయని సినీ ప్రముఖులు భావోద్వేగంగా గుర్తుచేసుకుంటున్నారు.





