యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం కెరీర్‌లో అత్యంత బిజీ ఫేజ్‌లో ఉన్నాడు. ఒకేసారి మూడు భారీ ప్రాజెక్ట్స్ షూటింగ్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఫుల్ స్వింగ్‌లో ముందుకు సాగుతున్నాడు. సైన్స్ ఫిక్షన్ విజువల్ స్పెక్టకల్ అయిన కల్కి 2898 AD సీక్వెల్‌తో పాటు, స్పిరిట్, ఫౌజీ చిత్రాల షూటింగ్స్‌ను ఒకేసారి కొనసాగిస్తూ బిజీ షెడ్యూల్‌ను మెయింటైన్ చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ‘కల్కి2’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని శివారు ప్రాంతంలో జరుగుతోంది. ఇటీవల ప్రారంభమైన తాజా షెడ్యూల్‌లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొనగా, సోమవారం నుంచి ప్రభాస్ కూడా సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. సమ్మర్ బ్రేక్ అనంతరం ప్రారంభమైన ఈ షెడ్యూల్ మే 7 వరకు కొనసాగనుండగా, ఈ షెడ్యూల్ అంతా రాత్రి సమయాల్లో చిత్రీకరణ జరగనుంది. ఈ షెడ్యూల్‌లో మరో ప్రత్యేక ఆకర్షణగా శింబు కూడా జాయిన్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండో భాగంలో ఇంటర్వెల్ బ్లాక్‌తో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు. అయితే హీరోయిన్ విషయానికి వస్తే, దీపికా పదుకొనె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు రావడంతో, ఆమె స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రెండు సంవత్సరాల క్రితం విడుదలైన తొలి భాగం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ‘కల్కి2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు ఈనెల 7న కల్కి షెడ్యూల్ పూర్తిచేసుకుని.. మే 10 నుంచి స్పిరిట్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు ప్రభాస్. అలాగే హను రాఘవపూడి రూపొందిస్తున్న ‘ఫౌజీ’ మూవీ కూడా ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ లేని సీన్స్‌ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. అంటే ఒకేసారి మూడు చిత్రాల షూటింగ్స్‌తో ప్రభాస్ బాగా బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌గా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో, అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ మరో స్థాయికి చేరుకున్నాయి.




