రివ్యూ : జెట్లీ
నటీనటులు :- సత్య, వెన్నెల కిషోర్, రియా సింఘా, అజయ్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు
దర్శకత్వం : రితేష్ రానా
నిర్మాత : చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు
సినిమాటోగ్రఫీ : సురేష్ సారంగం
ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్
మ్యూజిక్ -: కాల భైరవ
విడుదల తేదీ : మే 1, 2026
నిడివి : 121 నిమిషాలు
‘మత్తు వదలరా’ చిత్రంతో సక్సెస్ అందుకున్న మూవీ టీమ్ మరోసారి అదే టీమ్ స్పిరిట్‌తో ‘జెట్లీ’ చిత్రాన్ని రూపొందించారు. సత్య లీడ్ రోల్లో రితేష్ రానా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించారు. ప్రేక్షకులను నవ్వించడమే టార్గెట్‌గా మే 1న విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది, నవ్వులు పూయించిందా, లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ విషయానికొస్తే..
15 వేల కోట్ల స్కామ్ చేసి దేశం దాటి పారిపోయిన అజయ్‌ను స్పెషల్ ఆఫీసర్ రియా పట్టుకుని ఇండియాకు తీసుకువస్తుంది. అదే ఫ్లైట్‌లో మెమరీ లాస్‌తో బాధపడుతున్న జెట్లీ (సత్య) ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి మొదలయ్యే గందరగోళం, ఆ డబ్బు గమ్యం, ప్రయాణంలో జరిగే విచిత్ర సంఘటనలే కథ.
ఎవరెలా చేశారంటే..
కమెడియన్‌గా తనదైన శైలిలో నవ్వులు పంచే సత్య.. ఈ చిత్రంలో లీడ్ రోల్ చేసినా కామెడీ పండలేదు. దానికి కారణం తన క్యారెక్టర్ అని చెప్పాలి. పర్టిక్యూలర్ క్యారెక్టర్ కాకుండా చివరివరకు ప్రేక్షకుడిని గందరగోళానికి గురిచేసేలా తన పాత్ర ఉంటుంది. ఒకానొక సమయంలో విసుగు కూడా వస్తుంది. తనదైన మేనరిజంతో పంచ్ డైలాగులు చెప్పినా వర్కవుట్ అవ్వలేదు. అలాగే వెన్నెల కిషోర్ పాత్రను కూడా కన్ఫ్యూజన్గా క్రియేట్ చేశాడు దర్శకుడు. సినిమా సుడోకును చేతిలో పట్టుకుని సినిమా పేర్లను రాసుకుంటూ కామెడీ చేయాలనుకుంటాడు కానీ.. అది జబర్దస్త్ జోకులు కన్నా అద్వానంగా ఉంటాయి. దీంతో తన పాత్ర కూడా తేలిపోయింది. ఇక ప్రజాపతి అనే పాత్రలో అజయ్‌దే కీలక పాత్ర. తన కోసమే, తన చుట్టూనే కథ తిరుగుతుంది. ఫేమస్ బిజినెస్ మేన్‌గా తను నటించిన తీరు పర్వాలేదనిపిస్తుంది. రియా సింఘా ఏజెంట్ పాత్ర పోషించినా తనదైన గ్లామర్‌తోనే కాకుండా యాక్షన్ లుక్‌లోనూ ఆకట్టుకుంది. అలాగే వైవా హర్ష పైలట్ పాత్రలో, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు తమ పరిధిమేర నటించారు.
ఎలా ఉందంటే..
సినిమా మొత్తం ఒక ఫ్లైట్ సెట్లో సాగుతుంది. రెండు గంటల్లో దాదాపు పావుగంట మినహా మిగతా కథ అంతా గాల్లోనే జరుగుతుంది. అయినా అదేదో బస్సులో ఫైట్స్ చేసుకున్నట్టు ఏరోప్లెయిన్లో పదేపదే ఫైట్స్ చేసుకోవం కామెడీగా అనిపిస్తుంది. నవ్వులు పూయించాలని చేసే ప్రయత్నంలో బలహీనమైన కంటెంట్‌ను సెలెక్ట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఓకే అనిపించినా స్క్రీన్‌ప్లే మాత్రం పట్టాలు తప్పింది. దర్శకుడు రితేష్ రానా గతంలో చూపించిన క్రేజీ కామెడీ టచ్ ఇక్కడ పూర్తిగా వర్కౌట్ కాలేదు. కథలో బలం లేకపోవడంతో ఆ నవ్వులు కూడా ఎక్కువసేపు నిలబడవు. లాజిక్ అనే మాట ఈ సినిమాలో ఎక్కడో మిస్ అయిపోయింది. పాత్రలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. మొదటి భాగం వరకు ఓకే అనిపించిన నేరేషన్, రెండో భాగానికి వచ్చేసరికి పూర్తిగా కుంగిపోతుంది. అదే సీన్స్‌ని లాగుతూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్‌లో కత్తెర పడాల్సిన చోట వదిలేయడంతో సినిమా నెమ్మదిగా సాగుతుంది. క్లైమాక్స్ విషయంలో అయితే సినిమా పూర్తిగా చేతులెత్తేసింది. ఇంతసేపు సృష్టించిన హంగామాకు సరిపోయే ముగింపు ఇవ్వలేకపోవడంతో ఎందుకు ఇదంతా అనిపిస్తుంది.
బలాలు:
విజువల్స్
బ్యాక్‌గ్రౌండ్ స్కోరు
బలహీనతలు:
కథ, కథనం
లాజిక్ లేకుండా నడిచే సన్నివేశాలు
లాగ్ అయిన సెకండాఫ్
నిరాశపరిచే క్లైమాక్స్
చివరిగా:
“జెట్లీ” సినిమా నవ్వుల పేరుతో మొదలై, గందరగోళంగా ముగిసే ప్రయాణంలా అనిపిస్తుంది. జెన్‌జీ ఆడియెన్స్‌కు నచ్చినా.. కథ, లాజిక్ ఆశిస్తే మాత్రం ఇది పూర్తిగా నిరాశపరుస్తుంది. జండుబామ్ కంపల్సరీ అనిపిస్తుంది.
రేటింగ్: ⭐ 1.5/5







