Abbas Back in Tollywood
ఒకప్పుడు లవర్ బాయ్‌గా అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అబ్బాస్ గుర్తున్నాడా? ‘ప్రేమదేశం’ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరో.. కొంతకాలం వెండితెరకు దూరంగా ఉండి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు పెంచారు. అది కూడా ఒక భాషకు పరిమితం కాకుండా తెలుగు, తమిళ సినిమాలతో బిజీ అవుతున్నారు.
Abbas Back in Tollywood
1990వ దశకంలో అబ్బాస్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉండేది. ముఖ్యంగా ‘ప్రేమదేశం’ సినిమాతో ఆయనకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. తెలుగులో ‘రాజా’తో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే 2015 తర్వాత సినిమాలకు దూరమై విదేశాల్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకున్నారు. దీంతో అబ్బాస్ మళ్లీ సినిమాల్లోకి వస్తారని చాలామంది ఊహించలేదు.
కానీ 2026లో తమిళ చిత్రం ‘హ్యాపీ రాజ్’తో రీ ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు వరుస అవకాశాలతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఆసక్తికరంగా మలుచుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్లో మూడు సినిమాలతో ఆయన సందడి చేయబోతుండటం విశేషం.
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘రౌడీ జనార్దన’, అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘జనవరి 12 విడుదల’ చిత్రాల్లో అబ్బాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీటితో పాటు ‘నీరో’ అనే మరో సినిమాలోనూ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా గ్లింప్స్ విడుదల కార్యక్రమానికి హాజరై తన రీ ఎంట్రీపై మరింత ఆసక్తిని పెంచారు.
ముఖ్యంగా అనిల్ రావిపూడి సినిమాలో అబ్బాస్‌ను ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. తన సినిమాల్లో విభిన్నమైన నటీనటులకు అవకాశమిస్తూ, కథకు తగ్గట్టుగా క్యాస్టింగ్‌ను ప్లాన్ చేసే అనిల్.. ఈసారి ఒకప్పటి యూత్ ఐకాన్‌ను కీలక పాత్రలో తీసుకున్నారు. దీంతో సంక్రాంతి సినిమాపై అబ్బాస్ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఒకప్పుడు హీరోగా అలరించిన అబ్బాస్ ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్‌తో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. వరుసగా మూడు తెలుగు సినిమాల్లో కనిపించబోతుండటంతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌కు టాలీవుడ్లో మంచి ఆరంభమే దక్కినట్లు కనిపిస్తోంది.