‘Rudravanam PS’ will achieve success : Harish Shankar
క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేందుకు ‘రుద్రవనం పీఎస్’ సిద్ధమవుతోంది. నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సరికొత్త వెబ్ సిరీస్‌పై బ్లాక్‌బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికే ఈ సిరీస్ కంటెంట్ చూశానని, ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని వెల్లడించారు. జీ5లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం ఘనంగా జరిగింది.
‘Rudravanam PS’ will achieve success : Harish Shankar
ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్లపై రమేష్ పుప్పాల, సూర్యకాంతి నిర్మించగా, శశిధర్ మున్నంగి దర్శకత్వం వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ శంకర్.. నిర్మాత రమేష్ పుప్పాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘మిరపకాయ్’ సినిమా సమయంలో రమేష్ తనను ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. రాజా రవీంద్ర సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని, వివేక్ కూచిభొట్ల తన కుటుంబ సభ్యుడి లాంటి వారని చెప్పారు. ఈ సిరీస్‌తో దర్శకుడు శశిధర్ మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.
హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. జీ5తో తనకు పన్నెండేళ్ల అనుబంధం ఉందని, ‘పసుపు కుంకుమ’, ‘పరువు’, ‘వికటకవి’ తర్వాత ఇప్పుడు ‘రుద్రవనం పీఎస్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని తెలిపారు. తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పారు. దర్శకుడు శశిధర్, అష్కర్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని, ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారని పేర్కొన్నారు.
దర్శకుడు శశిధర్ మున్నంగి మాట్లాడుతూ.. ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగేలా ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను రూపొందించామని, తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాతలు రమేష్ పుప్పాల, సూర్యకాంతి కూడా సిరీస్‌పై నమ్మకం వ్యక్తం చేస్తూ ప్రేక్షకుల ఆదరణ కోరారు. వివేక్ కూచిభొట్ల, రాజా రవీంద్ర, శ్రావణి రెడ్డి, సుగాలి సిలోని తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.