Chandrayaan Movie Release On November 13
వినూత్నమైన కథాంశాలు, కొత్త తరహా ప్రయత్నాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నలుగురు కుర్రాళ్లు రాకెట్ తయారు చేసి చంద్రుడిపైకి వెళ్లాలని ప్రయత్నిస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘చంద్రయాన్’. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల సమర్పణలో వస్తున్న మరో ఆసక్తికరమైన ప్రయత్నమిది. సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిలేరియస్ అడ్వెంచర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా హైదరాబాద్‌లో రాకెట్ రివీల్ పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు.
Chandrayaan Movie Release On November 13
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు సంకల్ప్ రెడ్డి మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు. సినిమా టీమ్‌కు ఇది తొలి అడుగు మాత్రమేనని, ప్రేక్షకులు చిత్రాన్ని చూసి ప్రోత్సహిస్తే మరిన్ని మంచి సినిమాలు చేసే అవకాశం వారికి లభిస్తుందని ఆయన అన్నారు.
చిత్ర సమర్పకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ..‘ ఈ సినిమా నచ్చడంతోనే ప్రెజెంటర్‌గా ముందుకు వచ్చా. టీమ్ మొత్తం ఎంతో ప్యాషన్‌తో, అంకితభావంతో పనిచేసింది. లాజిక్స్‌ను పక్కనపెట్టి నవ్వించే నాన్సెన్స్ కామెడీ ఉన్నప్పటికీ, ఇందులో ఓ నిజాయితీ కనిపిస్తుంది. హీరో శివకుమార్‌లో మంచి ప్రతిభ ఉంది. దర్శకుడు శ్రీనాథ్ ఆసక్తికరమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఇది అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని అన్నారు.
దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నలుగురు యువకులు రాకెట్ తయారు చేయాలనే ఆలోచన నుంచి మొదలయ్యే కథలో ఎన్నో సరదా సంఘటనలు ఉంటాయని వివరించారు. రాకెట్ నిర్మాణం కోసం వారు చేసే ప్రయత్నాలు, అందులో హీరో శివ పడే ఇబ్బందులు, వారి ఆలోచనల చుట్టూ తిరిగే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని తెలిపారు. థియేటర్లో అడుగుపెట్టినప్పటి నుంచి నవ్వుల సందడి మొదలవుతుందని అని అన్నారు.
హీరో శివకుమార్ ధీకొండ మాట్లాడుతూ.. తనకు హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీనాథ్, నిర్మాత ప్రవీణ్ మొలక, తనకు అండగా నిలిచిన వేణు ఊడుగులకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో కూడిన తమ బృందాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. రాకెట్ తయారు చేసే సన్నివేశాలు, అందులో తన పాత్ర ఎదుర్కొనే ఇబ్బందులు ప్రత్యేకంగా నవ్విస్తాయని చెప్పారు.
హీరోయిన్ స్వప్న ప్రియదర్శిని ఈ చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమని, నటిగా ఇదే తొలి సినిమా కావడంతో ఆనందంగా ఉందని తెలిపారు. సినిమాలోని ‘అప్సరస’ పాటకు వస్తున్న స్పందన సంతోషాన్నిస్తోందని, తన పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత ప్రవీణ్ మొలక తమ టీమ్ కష్టపడి కొత్త తరహా సినిమాను రూపొందించిందని తెలిపారు. మొదట అక్టోబర్ 30న విడుదల చేయాలని భావించినప్పటికీ, సీనియర్ హీరోలను గౌరవిస్తూ విడుదల తేదీని నవంబర్ 13కు మార్చినట్లు వెల్లడించారు.
మ్యూజిక్ డైరెక్టర్ హర్ష ప్రవీణ్, సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస బి., కొరియోగ్రాఫర్ బాబా మాస్టర్, నటుడు లోకేష్, రవి శివతేజ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. తన పాత్ర పేరు చిన్నా అయినప్పటికీ, కామెడీ మాత్రం పెద్ద స్థాయిలో ఉంటుందని లోకేష్ సరదాగా వ్యాఖ్యానించారు.