Maruthi Birthday Special: A Director Who Knows Audience Pulse
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న దర్శకుల్లో మారుతి ఒకరు. సినిమా అంటే కేవలం కథ చెప్పడం మాత్రమే కాదు.. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు? థియేటర్లో వాళ్లను ఎలా నవ్వించాలి? ఎలాంటి ఎమోషన్‌తో కనెక్ట్ చేయాలి? అనే విషయాలపై మంచి అవగాహన ఉన్న దర్శకుడిగా మారుతి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే కథలను తనదైన శైలిలో తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. ఈరోజు (అక్టోబర్ 8) మారుతి పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌పై ఒక ప్రత్యేక కథనం.
Maruthi Birthday Special: A Director Who Knows Audience Pulse
చిన్న సినిమాలతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మారుతి.. ఆ దశలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా నిర్మాణ రంగంలోనూ అనుభవం సంపాదించుకున్నారు. ఆ అనుభవమే కథ ఎంపిక నుంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే విధానం వరకు ఆయనకు ఎంతో ఉపయోగపడింది.
యూత్‌ఫుల్ కంటెంట్‌కు వినోదాన్ని జోడిస్తూ మంచి మెసేజ్‌ను అందించే ప్రయత్నంలో భాగంగా మారుతి తెరకెక్కించిన ‘ఈరోజుల్లో’, ‘బస్ స్టాప్’ సినిమాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. చిన్న బడ్జెట్ సినిమాలతోనూ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని ఈ చిత్రాల విజయాలు నిరూపించాయి. అదే సమయంలో మారుతి దర్శకత్వ ప్రతిభపై ఇండస్ట్రీలో ఆసక్తి పెరిగింది.
ఆ తర్వాత ఆయన రూపొందించిన ‘ప్రేమ కథా చిత్రం’ ఘన విజయం సాధించి మారుతి సక్సెస్ వెనుక గాలివాటం లేదని నిరూపించింది. అయితే దర్శకుడిగా ఆయన కెరీర్‌కు మరో కీలక మలుపు ‘భలే భలే మగాడివోయ్’. నాని హీరోగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని అప్పటివరకు మారుతి కెరీర్లో అతిపెద్ద విజయంగా నిలిచింది. ఈ సినిమాతో యూత్‌కు మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు.
ఆ తర్వాత శర్వానంద్‌తో చేసిన ‘మహానుభావుడు’, సాయిధరమ్ తేజ్‌తో తెరకెక్కించిన ‘ప్రతి రోజు పండగే’ సినిమాలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా ఈ రెండు సినిమాలు మారుతి అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు కుటుంబ విలువలు, మానవ సంబంధాలను కూడా తెరపై అందంగా చూపించే దర్శకుడు అనే ఇమేజ్ను మరింత బలపరిచాయి.
ఇక రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి చేసిన ‘ది రాజా సాబ్’ మారుతి కెరీర్లో మరో కీలక ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో, కలర్‌ఫుల్ ప్రెజెంటేషన్‌లో చూపించడంతో పాటు భారీ స్థాయిలో టెక్నికల్ వాల్యూస్ను తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటానికి మారుతి టేకింగ్ కూడా ఓ కారణంగా నిలిచింది.

దర్శకుడిగా వరుస ప్రయోగాలు చేస్తూనే.. తనకు బాగా కలిసొచ్చిన ఎంటర్టైన్మెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలపై కూడా మారుతి దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం పలువురు హీరోలతో కొత్త ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్న ఆయన.. త్వరలోనే ఓ హీరోతో సినిమాను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాజెక్ట్‌పై మూవీ లవర్స్‌లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు, తన రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నంగా ఓ యానిమేషన్ సినిమా రూపొందించే ఆలోచనలో కూడా మారుతి ఉన్నారు. అంటే దర్శకుడిగా తన పరిధిని మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నారన్నమాట.
చిన్న సినిమాల నుంచి ప్రయాణం మొదలుపెట్టి.. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్స్, ఫ్యామిలీ మూవీస్, స్టార్ హీరోల సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న మారుతి.. రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన భవిష్యత్ ప్రాజెక్టులు మరిన్ని విజయాలు అందుకోవాలని పింక్విల్లాతెలుగు.కామ్ ద్వారా ఆకాంక్షిద్దాం.