Comrade Kalyan Trailer: Comedy Meets Revolution
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీ విష్ణు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు జానకిరామ్ మారెల్లా దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
Comrade Kalyan Trailer: Comedy Meets Revolution
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఇది కేవలం కామెడీ సినిమా కాదని.. వినోదం వెనుక బలమైన కథ, భావోద్వేగం, విప్లవ నేపథ్యం ఉన్నట్లు అర్థమవుతోంది.
1992లో ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో కథ సాగుతుంది. గ్రామంలో ఓ లోకల్ థియేటర్‌ను నడుపుతూ హ్యాపీగా తన జీవితాన్ని గడిపే వ్యక్తిగా శ్రీ విష్ణు కనిపిస్తారు. సినిమా, సరదా, కామెడీతో అతని లైఫ్ సాగుతుండగా.. ఒడిశాకు చెందిన ఓ అమ్మాయి అతని జీవితంలోకి వస్తుంది. ఆమెతో ప్రేమలో పడే కళ్యాణ్‌కు భాషా సమస్య కొత్త చిక్కులు తెస్తుంది.
ఇదంతా ఒక వైపు జరుగుతుండగానే కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. కళ్యాణ్ కోసం పోలీసులు వేట మొదలుపెడతారు. అతను మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ అని తెలియడంతో ఇప్పటివరకు కనిపించిన కళ్యాణ్ పాత్రకు పూర్తిగా మరో కోణం బయటపడుతుంది. జైలులో ఉన్న తమ నక్సలైట్ సహచరులను బయటకు తీసుకురావడానికి కళ్యాణ్, అతని గ్యాంగ్ ఓ కీలక రాజకీయ నాయకుడిని కిడ్నాప్ చేయడం ట్రైలర్లో ఆసక్తిని పెంచే అంశంగా నిలిచింది. అసలు కళ్యాణ్ నక్సలైట్‌గా ఎందుకు మారాడు? అతని గతం ఏంటి? అన్న ప్రశ్నలను ట్రైలర్ ఆసక్తికరంగా వదిలింది.
ట్రైలర్లో శ్రీ విష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఆకట్టుకున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ, పదాలను నములుతూ మాట్లాడే ప్రత్యేకమైన శైలి నవ్వులు పూయిస్తుంది. ఒకవైపు అమాయకంగా కనిపించే కళ్యాణ్గా మెప్పిస్తూనే.. మరోవైపు నక్సలైట్‌గా సీరియస్ షేడ్స్‌ను కూడా చూపించారు.
మహిమా నంబియార్ ఒడిశా అమ్మాయి పాత్రలో ఫ్రెష్‌గా కనిపించింది. శ్రీ విష్ణు, -మహిమా నంబియార్ మధ్య కెమిస్ట్రీ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక కళ్యాణ్ తల్లి పాత్రలో రాధికా శరత్‌కుమార్ కనిపించారు. బాలకృష్ణకు వీరాభిమానిగా ఆమె పాత్రలో కామెడీకి మరో లేయర్ యాడ్ అయినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సత్య, సుదర్శన్, బ్రహ్మాజీ తదితరులు కూడా తమ కామెడీతో నవ్వించబోతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు కేరళ పోలీస్ ఆఫీసర్‌గా షైన్ టామ్ చాకో ఇంటెన్స్‌గా కనిపించారు. ఉపేంద్ర లిమాయే కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
సాయి శ్రీరామ్ కెమెరా పనితనం ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని సహజమైన లొకేషన్స్‌ను అందంగా చూపించింది. పచ్చని ప్రకృతి, గ్రామీణ వాతావరణం 1992 నాటి నేపథ్యాన్ని సహజంగా రీక్రియేట్ చేసినట్లు అనిపిస్తోంది. విజయ్ బల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం కామెడీ సన్నివేశాలకు సరదా ఫీల్‌ను తీసుకురావడంతో పాటు నక్సలైట్ ఎపిసోడ్స్‌లో టెన్షన్‌ను పెంచింది. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ ట్రైలర్‌ను మంచి పేస్‌తో ముందుకు తీసుకెళ్లింది.