Raghava Lawrence as Mahaveer Karna
మహాభారతంలో కర్ణుడి పాత్రకు ఉన్న ప్రత్యేకతే వేరు. వీరత్వం, దానగుణం, ఆత్మగౌరవం, విధేయత, త్యాగం.. ఇలా ఎన్నో భావోద్వేగాలతో కనిపించే కర్ణుడి జీవితకథ ఎప్పుడూ ఆసక్తికరమే. ఇప్పుడు ఆ మహావీరుడి కథను మరింత గ్రాండ్‌గా వెండితెరపైకి తీసుకొస్తున్నారు. రాఘవ లారెన్స్ హీరోగా ‘మహావీర్ కర్ణ’ టైటిల్‌తో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.
Raghava Lawrence as Mahaveer Karna
పెన్ మూవీస్ అధినేత జయంతిలాల్ గడా సమర్పణలో.. ఆర్వీ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్ అసోసియేషన్‌లో ఈ చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా కోసం సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు టీమ్ తెలియజేసింది.
‘కర్ణ’లో కథ ఎంత ముఖ్యమో.. ఆ కథను తెరపై చూపించే విజువల్ వరల్డ్ కూడా అంతే కీలకంగా ఉండనుంది. మహాభారత కాలం నాటి రాజ్యాలు, యుద్ధభూములు, కోటలు, భారీ సెట్స్‌తో పాటు అత్యాధునిక వీఎఫ్ఎక్స్ను ఉపయోగించి కర్ణుడి ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.
ఇప్పటివరకు భారతీయ తెరపై పురాణగాథలను చూసిన విధానానికి భిన్నంగా.. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, వరల్డ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ సినిమాను రూపొందిస్తున్నారట. నిజమైన సెట్స్ వైభవానికి డిజిటల్ టెక్నాలజీని జోడించడం ద్వారా ప్రేక్షకులను నేరుగా కర్ణుడి కాలంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
రాఘవ లారెన్స్ ఇప్పటివరకు విభిన్న తరహా పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. అయితే ‘కర్ణ’లో ఆయన కనిపించబోయే అవతార్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నట్లు ఈ ఫస్ట్ లుక్ ఆధారంగా తెలుస్తోంది. మహా యోధుడిగా, భావోద్వేగాలతో కూడిన పాత్రలో ఆయనను చూపించేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కేవలం యుద్ధవీరుడిగా కాకుండా.. కర్ణుడి జీవితంలోని అంతర్మథనం, గౌరవం, నమ్మకం, విధేయత, త్యాగం వంటి అంశాలను కూడా కథలో ప్రధానంగా చూపించనున్నారు. దీంతో భారీ యాక్షన్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా ఈ సినిమాకు కీలకంగా మారనుంది.
కర్ణుడి జీవితాన్ని కేవలం యుద్ధాలు, వీరత్వం కోణంలోనే కాకుండా.. అతడి వ్యక్తిగత పోరాటాన్ని కూడా కథలో భాగం చేయనున్నట్లు తెలుస్తోంది. తన ఉనికిని నిరూపించుకోవడానికి అతడు చేసిన పోరాటం, ఎదుర్కొన్న అవమానాలు, నిలబెట్టుకున్న స్నేహం, చేసిన త్యాగాలు.. ఇలా కర్ణుడి జీవితంలోని పలు కోణాలను తెరపై ఆవిష్కరించనున్నారు. అందుకే ‘కర్ణ’ను కేవలం భారీ బడ్జెట్ సినిమా కాకుండా.. ఒక మహావీరుడి భావోద్వేగ ప్రయాణంగా కూడా మేకర్స్ పరిచయం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం దశలవారీగా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ప్రతి ప్రకటనను ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘కర్ణ’కు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న కొద్దీ సినిమా స్కేల్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ‘కర్ణ’ ప్రపంచవ్యాప్తంగా 2027లో ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.