Sri Nandu ‘Magallu Zindabad’ Title Launch
యంగ్ హీరో శ్రీ నందు, స్టార్ కమెడియన్స్ వెన్నెల కిషోర్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సరికొత్త కామెడీ ఎంటర్టైనర్ ‘మగాళ్లు జిందాబాద్’. గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రసాద్ భాస్కర్ల, చైతన్య వంగవరపు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నార ప్రవీణ్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను లాంచ్ చేశారు.
Sri Nandu ‘Magallu Zindabad’ Title Launch
‘మగాళ్లు జిందాబాద్’ అనే టైటిల్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచిన దర్శకుడు నార ప్రవీణ్.. సమాజంలో పురుషులు ఎదుర్కొనే కొన్ని సమస్యలను సెటైరికల్ కామెడీగా తెరకెక్కిస్తున్నట్టు వెల్లడించారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి శిష్యుడిగా నార ప్రవీణ్ ఈ సినిమాతో తనదైన కామెడీ టచ్‌ను చూపించబోతున్నారని చిత్రబృందం తెలిపింది.
టైటిల్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు నార ప్రవీణ్ మాట్లాడుతూ.. ‘మగాళ్లు జిందాబాద్’ ఒక సోషల్ సెటైరికల్ కామెడీ మూవీ అని తెలిపారు. సమాజంలో ఆడవారికి లభించే కంఫర్ట్, సానుభూతి, న్యాయం వంటి అంశాలు పురుషుల విషయంలో ఎలా ఉంటాయనే విషయాన్ని వినోదాత్మకంగా చూపించామని చెప్పారు. సీరియస్‌గా కాకుండా పూర్తిగా కామెడీ టోన్‌లో ఈ అంశాన్ని డీల్ చేశామని, ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించేలా సినిమా రూపొందించామని పేర్కొన్నారు.
హీరో శ్రీ నందు మాట్లాడుతూ.. ‘మగాళ్లు జిందాబాద్’ అనే టైటిల్ చాలామందిలో ఆలోచనలను రేకెత్తిస్తుందని, మరికొందరికి నవ్వు తెప్పిస్తుందని అన్నారు. అయితే ఈ టైటిల్‌ను ఆడవాళ్లను డామినేట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టలేదని స్పష్టం చేశారు. మగవాళ్లు తమ భావాలు, బాధలు, కష్టాల గురించి మాట్లాడుకోవడానికి కూడా చాలా సందర్భాల్లో ఆలోచిస్తుంటారని, అలాంటి వారి సమస్యలను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నమే ఈ సినిమా అని తెలిపారు. అప్పులు, ఈఎంఐలు వంటి బాధలు మగవాళ్లకు బాగా తెలుసని, నిజ జీవితంలో వారు ఎదుర్కొనే ఇలాంటి అంశాలను సినిమాలో కామెడీగా చూపించామని చెప్పారు. ఆడవాళ్లు ఎప్పుడూ గ్రేట్.. అందుకే ‘ఆడవాళ్లు జోహార్’ అని శ్రీ నందు వ్యాఖ్యానించారు. ఆరేళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వరకు కుటుంబ సమేతంగా కూర్చొని హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందని తెలిపారు. గతంలో తాను నటించిన కొన్ని సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లలో పెద్ద సంఖ్యలో చూడలేకపోయారని, కానీ ‘మగాళ్లు జిందాబాద్’ మాత్రం ప్రతి ఒక్కరినీ కడుపుబ్బ నవ్విస్తుందని అన్నారు.
నిర్మాత ప్రసాద్ భాస్కర్ల మాట్లాడుతూ.. శ్రీ నందుకు ఇప్పటివరకు సరైన కంటెంట్ దొరకలేదని, ‘మగాళ్లు జిందాబాద్’ ఆయనకు కమర్షియల్‌గా మంచి మైలేజ్ తీసుకొచ్చే సినిమా అవుతుందని అన్నారు. ఈ చిత్రంలో శ్రీ నందు నటనతో పాటు డాన్స్, కామెడీ టైమింగ్ ఆకట్టుకునేలా ఉంటాయని తెలిపారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష, శ్రీ నందు కలిసి పోటాపోటీగా చేసిన కామెడీ ప్రేక్షకులను అలరిస్తుందని, సినిమా నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని నిర్మాత పేర్కొన్నారు.
హీరోయిన్ లక్ష్మీ దుర్గ మాట్లాడుతూ.. తనను నమ్మి తొలి సినిమాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మగాళ్లు జిందాబాద్’ ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుందని, మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని అన్నారు.
కామెడీకి సోషల్ సెటైర్‌ను జోడిస్తూ తెరకెక్కుతున్న ‘మగాళ్లు జిందాబాద్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల, మదిన్ ఎస్.కె సంగీతం అందిస్తుండగా.. మున్నా కాసి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీ, శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్, అమ్ము కార్తీక్ ఆర్ట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.