Jayanth And The Jingopen First Look Unveiled
టీచర్స్ డే సందర్భంగా ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ సినిమా ఫస్ట్ లుక్‌ను ఘనంగా విడుదల చేశారు. నమో జయం ప్రొడక్షన్స్ పతాకంపై నేషనల్ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జయంత్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి తాత పాత్రలో, సత్యం రాజేష్ స్కూల్ టీచర్ పాత్రలో కనిపించనున్నారు. దివ్య ప్రవీణ్ బొలిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Jayanth And The Jingopen First Look Unveiled
టీచర్స్ డేను పురస్కరించుకుని జాతీయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయురాలు మారం పవిత్ర చేతుల మీదుగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించడం విశేషం. విద్యా వ్యవస్థ, పాఠశాలల్లో పిల్లలు ఎదుర్కొనే అంశాలను కుటుంబ భావోద్వేగాలతో మేళవిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
ఈ సందర్భంగా జయంత్ మాట్లాడుతూ, “ఇది చాలా కొత్త తరహా కథతో రూపొందుతున్న సినిమా. విద్యార్థులు ప్రతిరోజూ స్కూల్లో ఎదుర్కొనే కొన్ని సమస్యలతో పాటు మన విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలను కూడా ఇందులో చర్చించాం” అని తెలిపారు.
దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ, “ఈ సినిమాను తెరకెక్కించడం నాకు ఎంతో గర్వంగా ఉంది. నా గత చిత్రం ‘లతా భగవాన్ ఖరే’ దేశవ్యాప్తంగా 32 అవార్డులను సొంతం చేసుకోవడంతో పాటు ఫిలింఫేర్, నేషనల్ అవార్డులను కూడా అందుకుంది. ఇప్పుడు జయంత్‌ను ప్రధాన పాత్రలో తీసుకుని తెరకెక్కించిన ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఫిలిప్ అండ్ ది మంకీ పెన్’కు తెలుగు రీమేక్. అక్కడ ఈ చిత్రం 111 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు ఈ కథకు ప్రధాన బలం. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాను” అన్నారు.
సత్యం రాజేష్ మాట్లాడుతూ, “టీచర్స్ డే రోజున, నేను ఉపాధ్యాయుడిగా నటించిన సినిమా ఫస్ట్ లుక్‌ను జాతీయ అవార్డు అందుకున్న టీచర్ మారం పవిత్ర గారి చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.
నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ, “నా దృష్టిలో పాఠశాల ఒక దేవాలయం అయితే, ఉపాధ్యాయులు దేవుళ్లతో సమానం. అందుకే ఈ ప్రత్యేకమైన రోజున మా సినిమా ప్రమోషన్స్‌ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రం మా ఇద్దరికీ ఎంతో ప్రత్యేకమైనది, గర్వకారణం కూడా” అని పేర్కొన్నారు.
ఈ చిత్రానికి మోహిత్ కులకర్ణి సంగీతం అందిస్తున్నారు. నందమూరి హరి తారక రామారావు ఎడిటర్‌గా, ఆండ్రూబాబు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ప్రవీణ్ బొలిశెట్టి ట్యూన్స్, లిరిక్స్, మాటలు అందించగా, నాని ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆశిష్ గాంధీ, కాశీ విశ్వనాథ్, తనికెళ్ల భరణి, మానస రాధాకృష్ణన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.