allari-naresh-rambha-urvasi-menaka-interview
అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ ముచ్చటించిన విశేషాలు.
allari-naresh-rambha-urvasi-menaka-interview
‘‘ కొంతకాలంగా నేను వరుసగా కాస్త సీరియస్ జోనర్ సినిమాలు చేశాను. అయితే ప్రేక్షకులు నా నుంచి ఎప్పటినుంచో ఒక మంచి, క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ను ఆశిస్తున్నారు. ‘కితకితలు’, ‘బెండు అప్పారావు’లాంటి సినిమాల్లో నన్ను చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకు మళ్లీ అలాంటి వినోదాన్ని ఇవ్వాలనే కోరిక నాకూ ఉంది. అలాంటి సమయంలో చంద్ర మోహన్ చింతాడ చెప్పిన ‘రంభ ఊర్వశి మేనక’ కథ నాకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది.
ఈ కథ వినగానే చాలా రోజుల తర్వాత నిజంగా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నాననే ఫీలింగ్ కలిగింది. కథ నాతో పాటు నాగార్జున గారు, సుప్రియ గారు, నిర్మాతలు రాజేష్ దండా గారు, నిమ్మకాయల ప్రసాద్ గారికి కూడా బాగా నచ్చింది. సీజీ వర్క్ కారణంగా బడ్జెట్ పరంగా పెద్ద సినిమా అయినప్పటికీ, మంచి అవుట్‌పుట్ వస్తుందనే నమ్మకంతో అందరం ఈ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాం.
సాధారణంగా సోషియో ఫాంటసీ సినిమాల్లో మనుషులు ఇంద్రలోకానికి లేదా యమలోకానికి వెళ్లడం చూస్తుంటాం. కానీ ‘రంభ ఊర్వశి మేనక’లో మాత్రం స్వర్గంలో ఉండే రంభ, ఊర్వశి, మేనక భూమిపైకి వస్తారు. అదే ఈ కథలో చాలా కొత్తగా అనిపించే అంశం.
ఈ సినిమాలో నా పాత్రకు చిన్నప్పటి నుంచి ఒక డ్రామా కంపెనీ ఉంటుంది. రంభ, ఊర్వశి, మేనకలను దేవతల్లా పూజిస్తూ ఉంటాడు. పెద్దగా కష్టపడకుండానే హీరో అయిపోవాలని కలలు కనే వ్యక్తి. దేవతలు ఒక్కసారి ఆశీర్వదిస్తే నెక్స్ట్ రాజమౌళి సినిమాలో హీరో అయిపోతాననేంత నమ్మకం అతడికి ఉంటుంది. మా కుటుంబానికి తరతరాలుగా వస్తున్న ఒక పుస్తకం ఉంటుంది. అందులో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్యాట్రన్ గీస్తే దేవతలు ప్రత్యక్షమై కోరికలు తీరుస్తారనే నమ్మకం ఉంటుంది.
అసలు ఆ ప్యాట్రన్‌ను నేను ఎలా గీశాను? రంభ, ఊర్వశి, మేనక భూమిపైకి వచ్చిన తర్వాత నా జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి? అనే అంశాల చుట్టూనే సినిమా చాలా ఆసక్తికరంగా సాగుతుంది.
నా పాత్ర కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఊరిలో అందరి దగ్గర అప్పులు చేసి ఉంటాడు. అతడిని ఎవరూ పెద్దగా నమ్మరు. అందరూ కొంచెం నెగిటివ్‌గా చూసే వ్యక్తి. అలాంటి వ్యక్తి జీవితంలో ఒక్కసారిగా ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది చాలా ఫన్నీగా, అదే సమయంలో ఆసక్తికరంగా ఉంటుంది.
ఈ సినిమాలో కామెడీ చాలా క్లీన్‌గా ఉంటుంది. ఇప్పుడు ఆడియన్స్ కామెడీని చూసే విధానం కూడా మారింది. నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా దర్శకుడు చాలా మంచి కామెడీని డిజైన్ చేశారు. ముఖ్యంగా స్వర్గం, నరకం, ఇంద్రలోకం వంటి ఫాంటసీ ప్రపంచాలను మనం సినిమాల్లో చూసి చాలా కాలమైంది. అందుకే పిల్లలు కూడా ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ఫ్యామిలీ మొత్తం కలిసి హాయిగా చూసే సినిమా ఇది.
కామెడీ కోసం బలవంతంగా సీన్లు పెట్టినట్లు కాకుండా, కథలోంచే సహజంగా హాస్యం పుడుతుంది. సినిమా మొత్తం త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నవ్వులతో పాటు ఒక మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. ప్రేక్షకులు థియేటర్ నుంచి హ్యాపీగా బయటకు వస్తారనే నమ్మకం ఉంది.
ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్ద నరేష్ గారు నా పాత్రతో కలిసి ట్రావెల్ అవుతుంటారు. మా మధ్య వచ్చే కామెడీ చాలా హిలేరియస్‌గా ఉంటుంది. వెన్నెల కిషోర్ గారు, అజయ్ గారు, తారక్ పొన్నప్పతో పాటు చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంటుంది.
ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారి పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఆయన చేసే ఫన్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇంద్రుడు కూడా ఇంగ్లీష్ మాట్లాడటం, సందర్భానుసారంగా ఇతర భాషల్లో మాట్లాడటం చాలా సరదాగా ఉంటుంది. దేవుడికి అన్ని భాషలు వస్తాయి కదా (నవ్వుతూ). సినిమాలో ఉన్న ప్రతి నటుడికి అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉంది కాబట్టి సెట్స్‌లో కూడా చాలా ఎంజాయ్ చేశాం.
ఈ సినిమా నాకు మా నాన్నగారి స్టైల్లో చేసిన సినిమా అనే ఫీలింగ్ ఇస్తుంది. ఒకప్పుడు ఆయన సినిమాల్లో కనిపించే పెద్ద స్టార్ క్యాస్ట్, ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ నాకు చాలా ప్రత్యేకం.
ట్రైలర్లో కనిపించిన ‘ఓజీ’ స్పూఫ్ కూడా మంచి వైరల్ అయింది. అయితే సినిమాలో నా క్యారెక్టర్‌కు హీరో అవ్వాలనే పిచ్చి ఉంటుంది. అతడికి తెలిసిన ప్రపంచం మొత్తం సినిమానే కాబట్టి మాట్లాడే తీరు కూడా సినిమాటిక్‌గా ఉంటుంది. ‘ఓజీ’ సీక్వెన్స్ సినిమాలో ఎందుకు వస్తుంది, దాని వెనుక ఉన్న సందర్భం ఏంటి అనేది థియేటర్లో చూస్తే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది.
ఇటీవల ఎక్కువగా డార్క్ జోన్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ప్రేక్షకులు మళ్లీ లైట్ హార్టెడ్ సినిమాలు, నవ్వించే ఎంటర్టైనర్స్ కోరుకుంటున్నారు. అందుకే ఇకపై నేను కూడా నా కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకోవాలని అనుకుంటున్నాను. రెండు కామెడీ సినిమాలు చేస్తే, మధ్యలో ఒక సీరియస్ సినిమా చేయాలనే ఆలోచన ఉంది.
దర్శకత్వం చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. నా పూర్తి దృష్టి నటనపైనే ఉంది. నటుడిగా ఇంకా మంచి సినిమాలు చేయాలి, ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలనేదే నా లక్ష్యం.
‘సుడిగాడు 2’ గురించి చాలా మంది అడుగుతున్నారు. నిజానికి నాకు కూడా ఆ సినిమా సీక్వెల్ చేయాలని ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. మొదటి ‘సుడిగాడు’లో దాదాపు 108 స్పూఫ్స్ చేశాం. అప్పుడు ఆయా దర్శకులు, నిర్మాతల అనుమతులతోనే చేశాం. ఇప్పుడు కాపీరైట్ సమస్యలు ఎక్కువయ్యాయి. రిలీజ్ సమయంలో ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే వచ్చే ఇబ్బందులు మన చేతిలో ఉండవు. అందుకే ‘సుడిగాడు 2’ చేయాలంటే అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది.
ఇప్పటి యంగ్ డైరెక్టర్స్‌లో రితేష్ రానా స్టైల్ నాకు చాలా ఇష్టం. ‘మత్తు వదలరా’ సినిమా నాకు బాగా నచ్చింది. ఆయన కథల్లో చాలా డీటైలింగ్ ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న విషయాలను కూడా చాలా ఎంటర్టైనింగ్గా చూపిస్తారు. అలాగే తరుణ్ భాస్కర్ వంటి దర్శకులతో కూడా పనిచేయాలని ఉంది.
మల్టీస్టారర్స్ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. ‘శంభో శివ శంభో’ నుంచి మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నాను. ‘మహర్షి’ తర్వాత కూడా ‘నా సామిరంగ’లో నటించాను. మంచి కథతో దర్శకులు వస్తే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాను.
ఈ సినిమాతో చేతన్ భరద్వాజ్‌తో మొదటిసారి పనిచేశాను. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఇందులో నాకు, సురభికి ఒక మంచి పాట ఉంటుంది. ఆ పాట నాకు వ్యక్తిగతంగా చాలా నచ్చింది. మిగిలిన పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలుస్తుందని నమ్ముతున్నాను.
మొత్తంగా చెప్పాలంటే ‘రంభ ఊర్వశి మేనక’ పూర్తిగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడగలిగే క్లీన్ కామెడీ సినిమా. రెండున్నర గంటలు అన్ని టెన్షన్స్ పక్కన పెట్టి హాయిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి ఈ సినిమాను చూసి నవ్వుతూ, హ్యాపీగా బయటకు వెళ్తారనే నమ్మకం నాకు ఉంది.
ప్రస్తుతం ‘ఆల్కహాల్’ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అలాగే ‘కనకదుర్గ’ సినిమా షూటింగ్ జరుగుతోంది. కానీ ఇప్పుడు మాత్రం నా పూర్తి ఫోకస్ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రంభ ఊర్వశి మేనక’పైనే ఉంది. మంచి కామెడీ ఎంటర్టైనర్ను మిస్ అవుతున్న ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా మంచి ట్రీట్ అవుతుంది.”