Slum Dog Tabu Gauri Hegde Glimpse
విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సీనియర్ నటి టబు మరోసారి ఓ పవర్ఫుల్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో టబు పోషించిన గౌరి హెగ్డే పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Slum Dog Tabu Gauri Hegde Glimpse
ఇప్పటికే టబు ఫస్ట్ లుక్‌తో సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్… తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌తో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందో స్పష్టత ఇచ్చింది. రఫ్ అండ్ గ్రిటీ లుక్‌లో టబు కనిపించిన తీరు, ఆమె బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
స్లమ్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లోని రఫ్ వాతావరణంతో ప్రారంభమయ్యే గ్లింప్స్‌లో టబు కారు దిగుతూ సిగరెట్ వెలిగించి తనదైన స్టైల్లో ఎంట్రీ ఇస్తారు. అక్కడి పరిస్థితులను తన కంట్రోల్లోకి తీసుకుంటూ స్థానిక గూండాకు వార్నింగ్ ఇవ్వడం, ఆ తర్వాత అతడిని చెంపదెబ్బ కొట్టడం ఆమె పాత్రలోని దూకుడును చూపిస్తుంది.
సాధారణ అధికారిణిగా కాకుండా.. ఎలాంటి ఒత్తిడికీ తలొగ్గని, ఎవరికీ భయపడని, అవసరమైతే నేరుగా రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దే అధికారిణిగా గౌరి హెగ్డేను దర్శకుడు పూరి జగన్నాథ్ డిజైన్ చేసినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. రోడ్డుపై గూండాలను ఎదుర్కొంటూ లాఠీతో వారిని అదుపులోకి తీసుకునే సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. చుట్టూ పోలీసులు, స్థానికులు ఉన్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన అధికారాన్ని చూపించే గౌరి హెగ్డే పాత్ర సినిమాకు కీలకంగా ఉండబోతోందనే ఆసక్తిని కలిగిస్తోంది.
‘డెవిల్ ఇన్ ది డిపార్ట్మెంట్’..
‘One Fearless Woman’, ‘Powerful Officer’, ‘Ruthless’, ‘Merciless’, ‘Devil In The Department’ వంటి పదాలతో గౌరి హెగ్డే పాత్రను పరిచయం చేసిన విధానం ఆసక్తికరంగా ఉంది. చివర్లో “గౌరి హెగ్డే, డిప్యూటీ కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్” అంటూ టబు తన పాత్రను పరిచయం చేసుకునే సన్నివేశం గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది.
ఈ పాత్రకు టబు తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేకమైన ఇంపాక్ట్ తీసుకొచ్చారు. లుక్ మాత్రమే కాకుండా యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్స్‌లో ఆమె చూపించిన కాన్ఫిడెన్స్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పూరి జగన్నాథ్ సినిమాల్లో కనిపించే స్ట్రాంగ్, యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టరైజేషన్ గౌరి హెగ్డే విషయంలోనూ కనిపిస్తోంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి తొలిసారి నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్‌తో పాటు రా ఎమోషన్స్, మిస్టరీ అంశాలతో తెరకెక్కుతోంది. గ్లింప్స్‌లో విజయ్ సేతుపతికి సంబంధించిన కొన్ని షాట్లు కూడా కనిపించాయి. దీంతో కథలో విజయ్ సేతుపతి, టబు పాత్రల మధ్య ఎలాంటి సంబంధం ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో కనిపించనున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. సంతోష్ నూజిల్లా ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ తమ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై జేబీ నారాయణరావు కొండ్రొల్లా జేబీ మోషన్ పిక్చర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.