KJQ Movie Review in Telugu
చిత్రం : KJQ కేజేక్యూ
రేటింగ్ : 2.25/5
నటీనటులు : దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా, మురళీధర్ గౌడ్, అంకుర్ వికాల్, పృథ్వీరాజ్, జాకీ, సురేఖ వాణి తదితరులు..
బ్యానర్ : ఎస్ఎల్వీ సినిమాస్
నిర్మాతలు : సుధాకర్ చెరుకూరి
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : కేకే
సంగీత దర్శకుడు : పూర్ణచంద్ర తేజస్వీ
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ): నగేష్ బ్యానెల్
ఎడిటర్ : శ్రవణ్ కటికనేని
విడుదల తేదీ: 7 ఆగస్టు 2026
KJQ Movie Review in Telugu
దర్శకుడు కేకే (కిరణ్ కుమార్) తెరకెక్కించిన చివరి చిత్రం ‘KJQ (కింగ్ జాకీ క్వీన్)’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు ఈ సినిమా విడుదలకు ముందే కన్నుమూయడం ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన భావోద్వేగాన్ని తీసుకొచ్చింది. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయమైన విషయం. మరి కేకే చివరి ప్రయత్నం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ విషయానికొస్తే..
పార్థ (దీక్షిత్ శెట్టి), జాకీ (శశి ఓదెల) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. జీవితం వాళ్లను అనుకోని దారుల్లో నడిపిస్తుంది. పరిస్థితుల ప్రభావంతో పార్థ గ్యాంగ్‌స్టర్‌గా మారితే… అతనికి అండగా, రక్షణగా జాకీ నిలుస్తాడు. ఈ ఇద్దరి జీవితాల్లోకి హీరోయిన్ క్వీన్ (యుక్తి తరేజా) ప్రవేశిస్తుంది. తనకంటూ ఆత్మగౌరవం ఉన్న ఈ అమ్మాయి కూడా పరిస్థితుల కారణంగా జీవితంతో పోరాడుతూ ఉంటుంది. అయితే క్వీన్ ఎంట్రీ తర్వాత ఇద్దరు స్నేహితుల మధ్య అనుబంధం ఎలా మారింది? స్నేహం ఎందుకు శత్రుత్వంగా మారింది? చివరికి ఎవరి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అన్నదే సినిమా కథ.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
దీక్షిత్ శెట్టి మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అతను పలికించిన భావోద్వేగాలు సినిమాకు ప్రధాన బలం. పాత్రలో పూర్తిగా లీనమై కనిపించాడు. శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల మంచి ఎనర్జీతో కనిపించాడు. యాక్షన్ సన్నివేశాల్లో అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. యుక్తి తరేజా గ్లామర్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ… భావోద్వేగ సన్నివేశాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆమె పాత్రకు మంచి స్కోప్ ఉన్నా… నటన కారణంగా ఆ ఎమోషన్ ప్రేక్షకులకు పూర్తిగా చేరదు. మురళీధర్ గౌడ్ తన పాత్రను సహజంగా చేశారు. సురేఖ వాణి, పృథ్వీరాజ్, జాకీ తదితరుల పాత్రలు పెద్దగా గుర్తుండిపోయేలా ఉండవు.
టెక్నీకల్ టీమ్ గురించి..
దర్శకుడు కేకే కథలో కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఆలోచనను తెరపై బలంగా నిలబెట్టే రైటింగ్ మాత్రం కనిపించదు. ముఖ్యంగా సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే బలహీనపడింది. నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి విజువల్ క్వాలిటీ తీసుకొచ్చింది. పూర్ణచంద్ర తేజస్వీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలను ఎలివేట్ చేసింది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండి ఉంటే సినిమా మరింత క్రిస్ప్‌గా అనిపించేది. నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీపడలేదు. ప్రతి ఫ్రేమ్‌లో ఆ రిచ్‌నెస్ కనిపిస్తుంది.
సినిమా ఎలా ఉందంటే..
‘మనిషి పుట్టుకతో మంచి వాడో… చెడ్డవాడో కాడు. పరిస్థితులే అతన్ని ఆ దిశగా నడిపిస్తాయి’ అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు కథను ప్రారంభించాడు. దావూద్ ఇబ్రహీం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం వంటి వ్యక్తులను ఉదాహరణగా చూపిస్తూ మొదలయ్యే ఈ ఆలోచన ఆసక్తిని కలిగిస్తుంది. ఈ పాయింట్‌కు తగ్గట్టుగానే ప్రధాన పాత్రలను కూడా డిజైన్ చేశాడు దర్శకుడు. పార్థ సమాజం కారణంగా మారిపోయిన వ్యక్తి. జాకీ పరిస్థితుల బానిస. క్వీన్ ప్రేమ, నమ్మకాల వల్ల గాయపడిన యువతి. పాత్రల ఆలోచన బాగున్నా… వాటి మధ్య భావోద్వేగాలను బలంగా చూపించే సన్నివేశాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగినా కథపై ఆసక్తిని కొనసాగిస్తుంది. కానీ సెకండాఫ్‌లో కథ ఒక్కసారిగా దారి తప్పిన భావన కలుగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ వరకు వచ్చే ప్రయాణంలో ఎమోషనల్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. చివర్లో సినిమా హడావుడిగా ముగిసినట్టే అనిపిస్తుంది. మంచి కాన్సెప్ట్‌కు సరైన ముగింపు దొరకలేదనే ఫీలింగ్ ప్రేక్షకుడిలో మిగులుతుంది.
ప్లస్ పాయింట్స్ :
దీక్షిత్ శెట్టి నటన
శశి ఓదెల పెర్ఫార్మెన్స్
ఆసక్తికరమైన బేసిక్ కాన్సెప్ట్
సినిమాటోగ్రఫీ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
యాక్షన్ సన్నివేశాలు
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ :
బలహీనమైన స్క్రీన్‌ప్లే
ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం
సెకండాఫ్ నిరాశపరచడం
క్లైమాక్స్ ప్రభావం లేకపోవడం
యుక్తి తరేజా పాత్ర సరైన స్థాయిలో ఎలివేట్ కాకపోవడం
ఫైనల్‌గా చెప్పాలంటే..
‘KJQ’లో దర్శకుడు కేకే చెప్పాలనుకున్న ఆలోచన గొప్పదే. కానీ ఆ ఆలోచనను ప్రేక్షకుడి హృదయానికి చేరేలా మలచడంలో సినిమా తడబడింది. కొన్ని మంచి నటనలూ, టెక్నికల్ మెరిట్స్ ఉన్నప్పటికీ… బలహీనమైన కథనం కారణంగా ఇది పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోతుంది. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఒకసారి చూడొచ్చు. అయితే థియేటర్ నుంచి బయటకు వచ్చే సరికి “ఇంకాస్త బెటర్‌గా తీసి ఉంటే బాగుండేది” అనే ఫీలింగ్ మాత్రం తప్పకుండా మిగులుతుంది.