Producer Adapaka Phani expressed pride that the film Committee Kurrollu won two National Awards.
ఇటీవల ప్రకటించిన 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం పట్ల చిత్ర నిర్మాత ఫణి అడపాక ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రం (Best Telugu Film)తో పాటు ఉత్తమ మేకప్ (Best Makeup) విభాగంలో జాతీయ అవార్డులు అందుకోవడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమని ఆయన అన్నారు.
Producer Adapaka Phani expressed pride that the film Committee Kurrollu won two National Awards.

ఈ సందర్భంగా ఫణి అడపాక మాట్లాడుతూ.. ‘‘నిర్మాతగా నా ప్రయాణం ‘సిద్ధార్థ్ రాయ్’ చిత్రంతో ప్రారంభమైంది. తొలి సినిమాతో అమూల్యమైన అనుభవాన్ని పొందాను. ఆ తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌తో కలిసి ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి హృదయాన్ని తాకే కథ, బలమైన భావోద్వేగాలతో కూడిన చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు అదే చిత్రం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడంతో పాటు ఉత్తమ మేకప్ విభాగంలోనూ జాతీయ అవార్డు అందుకోవడం నా జీవితంలో ఎప్పటికీ మరువలేని ఘట్టం. ఒక నిర్మాతగా ఇంతటి గౌరవం దక్కడం ఎంతో ఆనందాన్ని, అదే సమయంలో మరింత బాధ్యతను కలిగిస్తోంది. ఈ గుర్తింపు ఒక్కరి విజయం కాదు… ‘కమిటీ కుర్రోళ్లు’ కోసం అంకితభావంతో శ్రమించిన ప్రతి ఒక్కరి కృషికి దక్కిన గౌరవం. దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రతి విభాగంలో పనిచేసిన యూనిట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ ప్రయాణంలో అడుగడుగునా తోడుగా నిలిచిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు. అన్నింటికంటే ముఖ్యంగా… విడుదలైన మొదటి రోజు నుంచే ‘కమిటీ కుర్రోళ్లు’ను తమ సొంత సినిమాలా ఆదరించిన ప్రేక్షకుల ప్రేమ, అభిమానమే ఈ విజయానికి అసలైన బలం. ఈ రెండు జాతీయ అవార్డులను ఆ ప్రేక్షకులందరికీ అంకితం చేస్తున్నాను.
ఇక ప్రస్తుతం ఈటీవీ విన్ (ETV Win)తో కలిసి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను రూపొందిస్తున్నాం. థియేటర్లతో పాటు ఓటీటీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కొత్త తరహా కథలు, నాణ్యమైన కంటెంట్‌ను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఈ జాతీయ అవార్డులు మాపై మరింత బాధ్యతను ఉంచాయి. భవిష్యత్తులోనూ మంచి కథలకు ప్రాధాన్యం ఇస్తూ, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, తెలుగు సినిమా గౌరవాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే చిత్రాలు, వెబ్ సిరీస్‌లను రూపొందించేందుకు కట్టుబడి ఉంటాం’’ అని తెలియజేశారు.