SouravGanguly Dada Biopic First Look
భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దాదా ది సౌరవ్ గంగూలీ స్టోరీ’. తాజాగా గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ.. ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ అభిమానుల్లో సినిమా పట్ల ఆసక్తి మరింత పెరిగింది. అలాగే వచ్చే ఏడాది మే 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
SouravGanguly Dada Biopic First Look
ఈ బయోపిక్‌లో బాలీవుడ్ స్టార్ రాజ్‌కుమార్ రావ్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో 2002లో ఇంగ్లాండ్‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక నాట్‌వెస్ట్ ట్రోఫీ విజయానంతరం లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ జెర్సీ ఊపిన ఐకానిక్ మూమెంట్‌ను సినిమాటిక్‌గా రీక్రియేట్ చేశారు. భారత క్రికెట్ చరిత్రలో ఆ క్షణం ఒక భావోద్వేగ చిహ్నంగా నిలిచిపోయింది. గంగూలీ నాయకత్వంలో టీమ్ ఇండియా కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన యుగానికి అది ప్రతీకగా భావిస్తారు.
SouravGanguly Dada Biopic First Look
సినిమా కేవలం ఒక క్రికెటర్ కథనే కాదు, భారత క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చిన నాయకుడి ప్రయాణాన్ని ఆవిష్కరించనుంది. యువ క్రికెటర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి, భారత జట్టుకు అత్యంత ప్రభావవంతమైన కెప్టెన్లలో ఒకరిగా ఎదిగిన సౌరవ్ గంగూలీ జీవితం ఇందులో ప్రధానంగా చూపించనున్నారు. పట్టుదల, ధైర్యం, పోరాటస్ఫూర్తి, నమ్మకం వంటి లక్షణాలతో గంగూలీ భారత క్రికెట్‌ను ఎలా కొత్త దిశలో నడిపించాడో, ఒక తరం ఆటగాళ్లకు ఎలా ప్రేరణగా నిలిచాడో ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు చూపించనున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి విక్రమాదిత్య మోత్వానె దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ రంజన్, అంకూర్ గార్గ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ-సిరీస్, డీబీఎల్ సమర్పణలో, లవ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. క్రికెట్ అభిమానులతో పాటు సినీప్రియుల్లోనూ మంచి అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం, 2027 మే 14న లాంగ్ హాలిడే వీకెండ్ సందర్భంగా భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది.