sing-geetham-movie-review
రివ్యూ : సింగ్ గీతం
మాస్ కోసమో, క్లాస్ కోసమో కాదు.. రేపటి కోసం ‘‘సింగీతం’’
నటీనటులు : అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి, తులసీ, బెనర్జీ, శివన్నారాయణ, మహేష్ ఆచంట, అగు స్టాన్లీ, రచ్చ రవి, రాహుల్ రవీంద్ర, నివేదా పేతురాజ్, విజయ్ దేరవకొండ (క్యామియో) తదితరులు..
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సింగీతం శ్రీనివాసరావు
రచయితలు : గౌతమి చల్లగుల్ల, శశాంక్ చింతలపూడి, నంది కిషోర్ ఇమాని
సమర్పణ : సి.అశ్వినీదత్
బ్యానర్ : వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా
నిర్మాత : నాగ్ అశ్విన్
సినిమాటోగ్రఫీ : అనుకూర్ సి
మ్యూజిక్ : దేవిశ్రీప్రసాద్
విడుదల తేదీ : 12-/06/2026
నిడివి : 137 నిమిషాలు (2 గంటల 17 నిమిషాలు)
రాబోయే ఓటీటీ ప్లాట్‌ఫామ్ : నెట్‌ఫ్లిక్స్
రేటింగ్ : 3/5 ⭐⭐⭐☆☆
sing-geetham-movie-review
సినిమా అనేది కథ చెప్పే మాధ్యమం. కానీ ఆ కథని ఎలా చెబుతామన్నదే దర్శకుడి ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను తన కెరీర్ మొత్తం కొత్త కొత్త ప్రయోగాలతో నిరూపించిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. తెలుగు ప్రేక్షకులకు టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్‌ను దశాబ్దాల క్రితమే పరిచయం చేసిన ‘ఆదిత్య 369’, మాటలేమీ లేకుండా నవ్వులు పూయించిన ‘పుష్పక విమానం’, టెక్నాలజీ లేని సమయాల్లోనే కమల్ హాసన్‌ను డిఫరెంట్‌గా చూపించి అద్భుతాలు సృష్టించిన ‘విచిత్ర సోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజు’ వంటి చిత్రాలు ఆయన క్రియేటివిటీకి నిదర్శనాలు. ట్రెండ్‌ను అనుసరించడం కాదు, ట్రెండ్‌కు దారి చూపించడం సింగీతం శైలి. అలాంటి దర్శకుడు 94 ఏళ్ల వయసులోనూ కొత్త ఆలోచనతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషమే. కథలు, భావోద్వేగాలు, సంభాషణలు సినిమాల్లో సహజం. కానీ డైలాగ్స్‌నే పాటగా, పాటనే డైలాగ్‌గా మార్చి ఓ కథ చెప్పాలనుకోవడం మాత్రం సింగీతం మార్క్ ప్రయోగం. అదే ‘సింగ్ గీతం’. ప్రతి మాటలో ఓ స్వరం, ప్రతి స్వరంలో ఓ భావాన్ని నింపుతూ రూపొందిన ఈ చిత్రం కేవలం సినిమా కాదు, ఓ సంగీత ప్రయోగం కూడా. మరి తన వయసును మరిచిపోయి మరోసారి కొత్త దారిలో అడుగుపెట్టిన సింగీతం మ్యాజిక్ ఈ తరం ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుంది? పాటలతో నడిచే ఈ మాటల ప్రయాణం ఎంత ఆసక్తికరంగా సాగింది? తెలుసుకోవాలంటే ‘సింగ్ గీతం’లోకి అడుగుపెట్టాల్సిందే.
కథ విషయానికొస్తే..
బంగారం మనిషికి సంపదను ఇస్తుంది. కానీ అదే బంగారం మీద అత్యాశ పెరిగితే ప్రకృతిని, సంబంధాలను, చివరికి మనిషి మనుగడనే మింగేస్తుంది. ‘సింగ్ గీతం’ కథ కూడా అలాంటి అత్యాశ చుట్టూనే తిరుగుతుంది.
కుబేరపురం అనే గ్రామం ఒకప్పుడు పచ్చదనానికి ప్రతీక. కానీ నేల కింద దాగి ఉన్న బంగారం కోసం చెట్లను నరికి, ప్రకృతిని పణంగా పెట్టి సంపద వెంబడి పరుగులు తీస్తుంది ఆ ఊరు. ఆ పరుగు చివరికి ఒకే ఒక్క చెట్టును మిగులుస్తుంది. దాన్ని తన తల్లిగా భావిస్తూ జీవించే గౌరి ఆ చెట్టును కాపాడేందుకు ప్రయత్నించినా, డబ్బు మత్తులో ఉన్న గ్రామస్తులు వినిపించుకోరు. చివరికి ఆ చెట్టు కూడా నేలకూలిపోతుంది. ప్రకృతిపై జరిగిన ఈ దాడికి ప్రతిఫలంగా ఆ ఊరిపై ఒక విచిత్రమైన శాపం పడుతుంది. ఇక నుంచి వాళ్లు మాటలతో కాదు, పాటలతోనే తమ భావాలను వ్యక్తపరుస్తుంటారు. అంతేకాదు… మనసులో దాచుకున్న నిజాలు కూడా అనుకోకుండా పాటల రూపంలో బయటపడిపోతుంటాయి. అప్పుడు బయటపడే రహస్యాలు, బట్టబయలయ్యే స్వార్థాలు, డబ్బు కోసం మనుషులు కోల్పోయిన విలువలు కథకు ప్రధాన బలంగా మారతాయి. ఈ నేపథ్యంలో తన గతంతో పోరాడుతున్న ప్రతాప్, సంపదే జీవితమని నమ్మే రేణు, ప్రకృతినే ప్రాణంగా భావించే గౌరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి? కుబేరుడి శాపం నుంచి ఆ గ్రామం ఎలా బయటపడింది? బంగారం కోసం మొదలైన ఈ ప్రయాణం చివరకు మనుషులకు ఏ పాఠం నేర్పింది? అనేదే ‘సింగ్ గీతం’ కథ.
ఎవరెలా చేశారంటే ..
ఆయాన్, అహిల్య, షాలిని ముగ్గురికీ ఇది పెద్ద స్థాయిలో తమను తాము నిరూపించుకునే అవకాశం. ఆ అవకాశాన్ని వారు చక్కగా వినియోగించుకున్నారు. కథలో ప్రధానంగా నిలిచే ప్రతాప్ పాత్రలో ఆయాన్ మంచి ఎనర్జీ చూపించాడు. పాత్రలో ఉండే అత్యాశ, అమాయకత్వం, తర్వాత వచ్చే మార్పును సహజంగా పలికించాడు. ముఖ్యంగా పాటల ద్వారా భావాలను వ్యక్తపరచాల్సిన సన్నివేశాల్లో అతని ఈజ్ ఆకట్టుకుంటుంది. హీరోగా మాత్రమే కాకుండా పెర్ఫార్మర్గా కూడా తనలో మంచి అవకాశాలు ఉన్నాయని సూచించాడు. గౌరి పాత్రలో అహిల్య ఈ సినిమాకి సోల్‌గా నిలుస్తుంది. చెట్లను ప్రేమించే అమాయక యువతిగా ఆమె చూపించిన సహజత్వం కథతో ప్రేక్షకుడిని కనెక్ట్ చేస్తుంది. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ, పాటల రూపంలో తన భావాలను వ్యక్తపరిచే సందర్భాల్లోనూ మంచి పరిణతి కనిపించింది. సెల్ఫిష్ మైనింగ్ వ్యాపారవేత్త రేణు పాత్రలో షాలిని మంచి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అగు స్టాన్లీ లుక్ పరంగా భయపెట్టేలా కనిపించినా, అతని కామిక్ టైమింగ్ ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇక సీనియర్ నటి తులసికి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. శివన్నారాయణ తన సహజ నటనతో కొన్ని సన్నివేశాలకు బలం చేకూర్చగా, మహేష్ ఆచంట, బెనర్జీ, రచ్చ రవి తదితరులు తమ తమ పాత్రల పరిధిలో న్యాయం చేశారు. అతిథి పాత్రల్లో కనిపించిన నివేదా పేతురాజ్, రాహుల్ రవీంద్రన్ తమ పరిమిత నిడివిలోనే ఆకట్టుకుంటారు. ముఖ్యంగా నివేదా పాత్ర కథకు అవసరమైన బలం తీసుకొచ్చింది. ఒక చిన్న సన్నివేశంలో మెరిసిన అనుదీప్ తనదైన శైలిలో చిరునవ్వులు పంచుతాడు. చివరిలో విజయ్ దేరవకొండ క్యామియో సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది.
ఈ చిత్రంలో నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే… కేవలం నటించడమే కాదు, పాటలతో కూడా ప్రేక్షకులను మెప్పించాల్సిన సవాలు వీరి ముందుంది. ఎందుకంటే కథ మొత్తం పాటల రూపంలోనే సాగుతుంది. అలాంటి ప్రయోగాత్మక కథలో ప్రతి ఒక్కరూ తమ పాత్రల భావాలను పాటల ద్వారా వ్యక్తపరుస్తూ దర్శకుడి ఆలోచనకు తగిన న్యాయం చేశారు.
టెక్నికల్ విషయానికొస్తే..
94 ఏళ్ల వయసులోనూ కొత్త ఆలోచనలతో ప్రేక్షకుల ముందుకు రావడం సింగీతం శ్రీనివాసరావుకే సాధ్యం. నాలుగు దశాబ్దాల క్రితం పుట్టిన ఓ ఆలోచనను నేటి తరానికి అర్థమయ్యేలా, ఆసక్తికరంగా మలచడం అంత సులువు కాదు. ముఖ్యంగా డైలాగ్స్ ను పాటలుగా నడిపించడం అనే కాన్సెప్ట్ వినడానికి ఎంత ఆసక్తికరంగా అనిపిస్తుందో, తెరపై దాన్ని నిలబెట్టడం అంతకంటే కష్టమైన పని. కానీ దర్శకుడిగా సింగీతం తన అనుభవంతో ఆ ఛాలెంజ్‌ను చాలా వరకు విజయవంతంగా అధిగమించారు. కథలోని ఫాంటసీ ఎలిమెంట్, సోషల్ మెసేజ్, ఎంటర్టైన్మెంట్ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ తీయడం ఆయనకే సాధ్యం. ఇక ఈ సినిమాకు అసలైన ప్రాణం సంగీతమే. ఎందుకంటే ఇక్కడ పాటలు కేవలం వినిపించవు, కథను కూడా ముందుకు నడిపిస్తాయి. అలాంటి అరుదైన అవకాశాన్ని దేవిశ్రీ ప్రసాద్ పూర్తిగా వినియోగించుకున్నాడు. పాత్రలు మాట్లాడే ప్రతి సందర్భాన్ని సంగీతాత్మకంగా మలుస్తూనే, ఎక్కడా ఒకే తరహా ఫీల్ రాకుండా జాగ్రత్త పడ్డాడు. కొన్ని సందర్భాల్లో మాటలను పాటల రూపంలో వినడం కొంచెం రిపీట్‌గా అనిపించినా, వెంటనే తన ట్యూన్స్‌తో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకుడిని మళ్లీ కథలోకి తీసుకొస్తాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు, ఫాంటసీ మూమెంట్స్‌కు ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలం. సినిమాటోగ్రఫీ కూడా కథ మూడ్‌కు తగ్గట్టుగానే సాగింది. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన గ్రామం, తర్వాత బంగారం కోసం ఎడారిలా మారిపోయిన వాతావరణం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విజువల్‌గా బాగా చూపించారు. ఫాంటసీ ప్రపంచానికి సంబంధించిన కొన్ని ఫ్రేమ్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కుబేరుడి శాపం తర్వాత వచ్చే సన్నివేశాల్లో విజువల్ ట్రీట్ కనిపిస్తుంది. నిర్మాణ విలువల విషయంలో వైజయంతీ మూవీస్, నాగ్ అశ్విన్ రాజీ పడలేదనే విషయం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. కథపై, దర్శకుడిపై ఉన్న గౌరవంతో ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో నమ్మకంతో నిర్మించినట్టు అనిపిస్తుంది.
sing-geetham-movie-review
సినిమా ఎలా ఉందంటే..
ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో కొత్త ఆలోచనలు, కొత్త కథనాలు అరుదైపోతున్నాయి. అలాంటి సమయంలో ‘సింగ్ గీతం’ మాత్రం పూర్తిగా భిన్నమైన అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తుంది. పాటలతోనే కథను నడిపించడం అనే కాన్సెప్ట్ మొదట వినగానే కాస్త విచిత్రంగా అనిపించినా, సినిమా మొదలైన కొద్దిసేపటికే ప్రేక్షకుడు ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతాడు. ముఖ్యంగా సింగీతం శ్రీనివాసరావు వంటి దర్శకుడి అనుభవం, ఊహాశక్తి ఈ కథలో ప్రతి చోటా కనిపిస్తాయి. సినిమాలో ఉన్న ప్రధాన బలం దాని కాన్సెప్ట్. ప్రకృతి వినాశనం, డబ్బు మీద అత్యాశ, మనుషుల మధ్య సంబంధాలు వంటి అంశాలను ఫాంటసీ టచ్‌తో చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. కథలో వచ్చే పాటలు కూడా కేవలం అలంకారంగా కాకుండా కథను ముందుకు తీసుకెళ్లే సాధనాలుగా మారాయి. అందువల్ల ఇది సాధారణ మ్యూజికల్ సినిమా కంటే భిన్నంగా అనిపిస్తుంది. అయితే ఈ ప్రయోగం అందరికీ ఒకే స్థాయిలో కనెక్ట్ అవుతుందా అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే కథలో దాదాపు ప్రతి ఎమోషన్ పాటల రూపంలోనే వ్యక్తమవుతుండటంతో కొన్ని చోట్ల రిపీట్ అవుతుందనే భావన కలుగుతుంది. ముఖ్యంగా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఆశించే ప్రేక్షకులకు కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా అనిపించే అవకాశం ఉంది. అలాగే కొన్ని సెట్స్ సహజంగా కాకుండా కృత్రిమంగా కనిపించడం కూడా అక్కడక్కడా సినిమాను వాస్తవికత నుంచి దూరం చేస్తుంది. అయినా ఈ చిన్న చిన్న లోపాలను పక్కన పెడితే, ‘సింగ్ గీతం’ తన లక్ష్యాన్ని చాలా వరకు చేరుకుంటుంది. ఇది మాస్ కోసమో, క్లాస్ కోసమో తీసిన సినిమా కాదు, రేపటి కోసం అనేలా ఒక ఆలోచనను కొత్త రూపంలో చెప్పాలనే ప్రయత్నం. అలాంటి ప్రయత్నాలకు ప్రేక్షకులు ఎంత మద్దతు ఇస్తారన్నది పక్కన పెడితే, దర్శకుడిగా 94 ఏళ్ల వయసులోనూ సింగీతం చూపించిన సృజనాత్మకతకు మాత్రం ఖచ్చితంగా అభినందనలు దక్కాలి. రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలకు భిన్నంగా ఏదైనా చూడాలనుకునే ప్రేక్షకులకు ‘సింగ్ గీతం’ ఒక మంచి, వినూత్న అనుభవంగా నిలుస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
సింగీతం శ్రీనివాసరావు వినూత్న ఆలోచన, ప్రయోగాత్మక కథనం
మాటల స్థానంలో పాటలతో కథను నడిపించిన కాన్సెప్ట్
ప్రకృతి పరిరక్షణ, అత్యాశపై ఇచ్చిన సందేశం
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా నెమ్మదించిన స్క్రీన్‌ప్లే
పాటల ఆధారంగా కథనం సాగడం కొంచెం బోరింగ్ అనిపించడం
ఫైనల్‌గా : ‘‘సింగ్ గీతం” అనేది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. సింగీతం మార్క్ ఊహాశక్తి, దేవిశ్రీ సంగీతం, కొత్త తరహా కథనంతో రూపొందిన ఓ అరుదైన ప్రయోగం. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ పాటల ప్రయాణం తప్పకుండా నచ్చుతుంది.