నటి సమంత తన కెరీర్లో ఎప్పుడూ కొత్త తరహా కథలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఆమె నటించడమే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ . ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు నందినీరెడ్డి దర్శకత్వం వహించగా, జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఆసక్తిని పెంచగా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్‌ను పొందింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర బృందాన్ని అభినందించారు.
మరోవైపు ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన సమంత, ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి ఖర్చు చేసే ప్రతి రూపాయి, వెచ్చించే ప్రతి నిమిషానికి న్యాయం చేసే వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం చెబుతోంది. ప్రేక్షకులు పెట్టే డబ్బుకు తనదే హామీ అని చెప్పుకొచ్చింది.
ఈ చిత్రంలో సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందించగా, సినిమాటోగ్రఫీని ఓం ప్రకాష్ నిర్వహించారు.