‘శుభం’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘దీవాన’. స్నేహ మణిమేగలై హీరోయిన్. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. జూన్ 19న గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా విడుదల కానుంది. గురువారం ట్రైలర్ లాంచ్ఈవెంట్ను నిర్వహించారు. హీరో విశ్వక్ సేన్, నిర్మాత అల్లు అరవింద్ అతిథులుగా హాజరయ్యారు. ట్రైలర్‌ను చూసిన అల్లు అరవింద్, “దీవాన” హృదయాలను తాకే అందమైన ప్రేమకథ అని ప్రశంసించగా, విశ్వక్ సేన్ సినిమా టీమ్‌లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తే కంటెంట్‌పై వారి నమ్మకం అర్థమవుతోందని అన్నారు.
ఈ సందర్భంగా మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ – ‘‘సినిమా బాగున్నప్పుడే టీమ్ మొత్తం కాన్ఫిడెంట్ గా ఉంటారు. అలాంటి కాన్ఫిడెన్స్ దీవాన మూవీ టీమ్ లో కనిపిస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని అన్నారు.
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ -‘‘కొత్త వాళ్లు చాలా మంది వచ్చి కథలు చెబుతుంటారు. అలా శ్రీకాంత్ గంటన్నర కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. ప్రొడ్యూసర్ వాసుకు ఫోన్ చేసి కథ చెప్పినంత బాగా సినిమా తీస్తాడో లేదో ముందు ఒక సీన్ డెమో తీయమను, ఆ సీన్ నాకు చూపించండి అన్నాను. ఒక సీన్ చేసి ఫుటేజ్ నాకు చూపించారు. అన్ని ఎమోషన్స్ ఎలా ఉండాలో అలా రూపొందించాడు. ఇతను దర్శకుడిగా పేరు తెచ్చుకుంటాడు అనే నమ్మకం అప్పుడే నాలో కలిగింది. హీరో హర్షిత్ సహా ప్రతి ఆర్టిస్ట్ దగ్గర మంచి పర్ ఫార్మెన్స్ తీసుకున్నాడు శ్రీకాంత్. హర్షిత్ సినిమాలో పర్ ఫార్మెన్స్ చించి వదిలేశాడు. క్లైమాక్స్ లో మనతో కన్నీళ్లు పెట్టిస్తాడు. హర్షిత్ అంత మంచి యాక్టర్. ఆమిర్ ఖాన్ పెద్ద హైట్ కాదు కానీ నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. హర్షిత్ కూడా అలాగే గుర్తింపు తెచ్చుకోవాలి. హర్షిత్ కు మంచి కెరీర్ ఉంటుంది. హీరోయిన్ స్మేహ సినిమాలో చాలా క్యూట్ గా ఉంది. తెలుగులో ఆమెకు మంచి అవకాశాలు వస్తాయి. దీవాన సున్నితంగా ప్రారంభమై మన హృదయాల్లోకి చొచ్చుకెళ్లే ప్రేమ కథ. డీసెంట్ గా ఉంటుంది” అని అన్నారు.
దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ చిత్రాన్ని వన్‌సైడ్ లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్రెండ్షిప్ అంశాలతో అందరికీ నచ్చేలా రూపొందించామని తెలిపారు. హీరో హర్షిత్ రెడ్డి “దీవాన”ను టైమ్‌లెస్ లవ్ స్టోరీగా అభివర్ణిస్తూ, తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కథతో వస్తున్నామని చెప్పారు.
అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.