Peddi is the top movie of my career: Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరై వేడుకను విజయవంతం చేశారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Peddi is the top movie of my career: Charan
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘పెద్ది’ తన సినీ ప్రయాణంలో అత్యంత ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని తెలిపారు. ‘‘కొన్ని కథలు నచ్చుతాయి, కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ ‘పెద్ది’ కథ నా మనసుకు చాలా దగ్గరైంది. మా నాన్న చిరంజీవి గారు చెప్పినట్టే ఇలాంటి కథలు పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి. ఈ సినిమా ఒక నటుడిగా నాకు అపారమైన సంతృప్తిని ఇచ్చింది’’ అని అన్నారు. ‘పెద్ది’ ఒక వ్యక్తి ఆత్మగౌరవం, గుర్తింపు కోసం చేసే పోరాటాన్ని చూపించే కథ అని పేర్కొన్న చరణ్, ‘‘ఇది ఎగిసిపడే వ్యక్తి కథ కాదు.. పడిపోయి మళ్లీ లేచి నిలబడే వ్యక్తి కథ. ఈ సినిమా కోసం కష్టపడలేదు.. ఇష్టంతో పనిచేశాను. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ సమయంలో కలిగిన ఉత్సాహం మళ్లీ ‘పెద్ది’తో అనుభవించాను’’ అని చెప్పారు. అభిమానుల ప్రేమే తనకు బలం అని చెప్పిన రామ్ చరణ్, ‘‘అభిమానులు, ప్రేక్షకుల కోసం చేయి విరగ్గొట్టుకోవడమే కాదు.. రక్తం చిందించి కూడా పని చేస్తాను. నేను ఉన్నంత కాలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను’’ అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు.
దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ ‘ఉప్పెన’ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకున్నది ‘పెద్ది’ కోసం మాత్రమేనని వెల్లడించారు. ‘‘ఈ కథను రామ్ చరణ్ గారికి చెప్పిన తర్వాత ఆయన ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు. అంత నమ్మకం ఉంచారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన ఎమోషనల్ డ్రామా ఈ సినిమాలో ఉంటుంది. ఒక ఆటగాడి ఆత్మగౌరవం, గుర్తింపు కోసం చేసే పోరాటమే ‘పెద్ది’ కథ’’ అని వివరించారు. సినిమాను ఇప్పటికే పలుమార్లు చూశానని, ప్రతిసారి భావోద్వేగానికి గురయ్యానని బుచ్చిబాబు తెలిపారు. కుటుంబ సమేతంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇదని ఆయన ప్రేక్షకులను కోరారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ ‘పెద్ది’ ఒక సినిమాకన్నా పెద్ద ఈవెంట్‌లా ఉంటుందని అన్నారు. ‘‘సినిమా చూసిన తర్వాత కూడా పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి. ముఖ్యంగా రామ్ చరణ్ చేసిన ‘పెద్ది’ పాత్ర జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని మేము నమ్ముతున్నాం’’ అన్నారు.
నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ ఈ సినిమా కోసం రామ్ చరణ్ రెండేళ్లకు పైగా ఎంతో అంకితభావంతో పనిచేశారని చెప్పారు. షూటింగ్ సమయంలో పలుమార్లు గాయపడినా వెనక్కి తగ్గకుండా సినిమా కోసం కష్టపడ్డారని వెల్లడించారు. ‘‘ఒక చిన్న ఊరి నుంచి వచ్చిన వ్యక్తి దేశవ్యాప్తంగా ఎలా ఎదిగాడు? తన గుర్తింపు కోసం ఎలా పోరాడాడు? అనేది ‘పెద్ది’లో చూపించాం’’ అన్నారు.
హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడుతూ ‘పెద్ది’ తన కెరీర్లో ప్రత్యేకమైన చిత్రమని పేర్కొన్నారు. ‘‘మన జీవితానికి అర్థం ఏమిటి? మన గుర్తింపు అంటే ఏమిటి? అనే అంశాలను ఈ సినిమా అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ప్రేక్షకులు థియేటర్ల నుంచి ఆనందంగా బయటకు వస్తారని నమ్ముతున్నాను’’ అని చెప్పారు.
జగపతి బాబు మాట్లాడుతూ ‘అప్పలసూరి’ పాత్ర తన కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్‌గా నిలుస్తుందని చెప్పారు. ‘‘పెద్ది’ తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త ఊపునిచ్చే చిత్రం అవుతుంది. రామ్ చరణ్ చేసిన ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు.
డీవోపీ రత్నవేలు, నటుడు దివ్యేందు శర్మ, గేయరచయిత అనంత శ్రీరామ్ తదితరులు కూడా చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
విజయవాడలో జరిగిన ఈ భారీ ప్రీ-రిలీజ్ వేడుకలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని చిన్ని తదితరులు పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానుల భారీ స్పందన మధ్య ముగిసిన ఈ వేడుకతో ‘పెద్ది’పై అంచనాలు మరింత పెరిగాయి.
Peddi is the top movie of my career: Charan
బుచ్చిబాబు దర్శకత్వం, రామ్ చరణ్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం, భారీ నిర్మాణ విలువలతో రూపొందిన ‘పెద్ది’ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.