SV Krishna Reddy 75th birthday celebrations
హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి ప్రస్తుతం తన 43వ చిత్రం ‘వేదవ్యాస్’ను తెరకెక్కిస్తున్నారు. నిర్మాత కె. అచ్చిరెడ్డి సమర్పణలో సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్‌పై కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంతో పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయం అవుతున్నారు. అలాగే కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.
SV Krishna Reddy 75th birthday celebrations
ప్రస్తుతం ‘వేదవ్యాస్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూన్ 1న హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలతో పాటు ‘వేదవ్యాస్’ చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా 38 చిత్రాలకు సంగీత దర్శకుడిగా సేవలందించిన ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు పత్రాన్ని అందజేశారు. కార్యక్రమానికి టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ, ఎస్వీ కృష్ణారెడ్డి గొప్ప దర్శకుడే కాకుండా మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. ఆయన చిత్రాలు వినోదంతో పాటు సమాజానికి సందేశాన్ని అందించాయని పేర్కొన్నారు. “నేను సినిమా పరిశ్రమలోకి రావడానికి ఎస్వీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారే కారణం. మన వేదాల గొప్పదనం, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ అంశాలను తెలియజేసేలా ‘వేదవ్యాస్’ కథను రూపొందించారు. సమాజానికి ఉపయోగపడే కథ కావడంతో వెంటనే సినిమా నిర్మించేందుకు అంగీకరించాను. షూటింగ్ పూర్తయింది. సినిమా అద్భుతంగా వచ్చింది. ఎస్వీ గారు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ, “ఎస్వీ కృష్ణారెడ్డి గారు నూరేళ్లు సంతోషంగా జీవించాలి. వంద చిత్రాలకు దర్శకత్వం వహించాలి. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి స్నేహం చిరకాలం కొనసాగాలి. మన సంస్కృతి, వేదాల గొప్పదనాన్ని చాటే ‘వేదవ్యాస్’ చిత్రం విజయవంతం కావాలి” అని అన్నారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, “ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి వంటి వ్యక్తుల వల్లే తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి పేరు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ఆయన ప్రత్యేకమైన ముద్ర వేశారు. పరిశ్రమకు ఒక దిక్సూచిలా నిలుస్తూ మరిన్ని మంచి సినిమాలు రూపొందించాలి” అన్నారు.
దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, “విజయా సంస్థలో నాగిరెడ్డి-చక్రపాణి అనుబంధాన్ని చూసిన వ్యక్తిగా, కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డి స్నేహం చూస్తుంటే అదే గుర్తుకొస్తుంది. కుటుంబ ప్రేక్షకులకు గుర్తుండిపోయే ఎన్నో చిత్రాలు అందించిన ఎస్వీ గారు మరోసారి ‘వేదవ్యాస్’తో సంస్కృతి, సంప్రదాయాల గొప్పదనాన్ని చాటే ప్రయత్నం చేస్తున్నారు” అన్నారు.
నిర్మాతలు దామోదర ప్రసాద్, అశోక్ కుమార్ కూడా ఎస్వీ కృష్ణారెడ్డి ప్రతిభను ప్రశంసిస్తూ ‘వేదవ్యాస్’ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. నటి లయ మాట్లాడుతూ, “ఇళయరాజా సంగీతానికి ఎలా అభిమానులు ఉంటారో, ఎస్వీ కృష్ణారెడ్డి పాటలకు కూడా ప్రత్యేక అభిమాన వర్గం ఉంది. ఆయన దర్శకత్వంలో పనిచేయడం నాకు మంచి అనుభవం” అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, “ఎస్వీ గారి దర్శకత్వంలో ఎక్కువ సినిమాల్లో నటించే అదృష్టం నాకు దక్కింది. ఆయన 75వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ‘వేదవ్యాస్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు. జేడీ చక్రవర్తి మాట్లాడుతూ, “ఎస్వీ గారు గొప్ప కథకుడు. కథ చెప్పే విధానం ఎంతో అందంగా ఉంటుంది” అని అన్నారు.
నటుడు అలీ మాట్లాడుతూ, “జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరో వరకు అందరినీ సమానంగా గౌరవించే వ్యక్తి ఎస్వీ కృష్ణారెడ్డి. 42 చిత్రాల్లో 38 సినిమాలకు సంగీతం అందించడం సాధారణ విషయం కాదు. ఆయనతో మా అనుబంధం 35 ఏళ్లది” అన్నారు. శివాజీరాజా మాట్లాడుతూ, “ఆయన దర్శకత్వంలో దాదాపు 20 చిత్రాల్లో నటించాను. డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా కుటుంబమంతా చూసే చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఎస్వీ గారు” అని కొనియాడారు.
‘వేదవ్యాస్’ హీరో పిడుగు విశ్వనాథ్ మాట్లాడుతూ, “ఎస్వీ కృష్ణారెడ్డి వంటి లెజెండరీ దర్శకుడి చేతుల మీదుగా హీరోగా పరిచయం కావడం నా అదృష్టం” అన్నారు.
SV Krishna Reddy 75th birthday celebrations
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, “నా పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది సినీ ప్రముఖులు రావడం ఎంతో ఆనందంగా ఉంది. నా సంగీత ప్రస్థానానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి గుర్తింపు లభించడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. ‘వేదవ్యాస్’ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.
నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ, “‘వేదవ్యాస్’ మా అందరికీ కమ్‌బ్యాక్ మూవీ అవుతుంది. గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ కథపై ఎంతో శ్రద్ధతో పని చేశాం. పరుచూరి గోపాలకృష్ణ, సత్యానంద్ సహా పలువురు ప్రముఖులు తమ సూచనలు, ప్రోత్సాహాన్ని అందించారు. ప్రేక్షకులు ఎస్వీ కృష్ణారెడ్డి గారి ఆలోచనా శక్తిని మరోసారి ఈ సినిమా ద్వారా చూడబోతున్నారు” అని తెలిపారు.
SV Krishna Reddy 75th birthday celebrations
పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు హాజరైన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ఘనంగా సాగింది. ‘వేదవ్యాస్’ చిత్ర మేకింగ్ వీడియోకు కూడా విశేష స్పందన లభించింది.