Mister Middle Class Teaser Launch Event
తొంభై దశకంలో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ల మజాను మళ్లీ గుర్తు చేసేలా రూపొందుతున్న చిత్రం “మిస్టర్ మిడిల్ క్లాస్”. హీరో శ్రీకాంత్, హీరోయిన్ లయ ప్రధాన పాత్రల్లో, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వినోదభరిత చిత్రాల దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. జీకే అండ్ సిఎన్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను బుధవారం విడుదల చేశారు . మధ్యతరగతి జీవితంలోని చిన్న చిన్న కష్టాలు, ఆశలు, దేవుడిపై నమ్మకం, కుటుంబ బంధాలను చూపిస్తూ సాగిన టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇవన్నీ కామెడీతో కలిపి చెప్పే ప్రయత్నం కనిపిస్తోంది. శ్రీకాంత్, లయ జోడీకి తోడు రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పాత్ర, సునీల్, వెన్నెల కిషోర్, అలీ, రఘుబాబు లాంటి నటీనటులతో కంప్లీట్ ఎంటర్టైనర్గా సినిమా రాబోతోందని అర్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరైన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి.. ఇలాంటి మంచి కాంబినేషన్లో వస్తోన్న చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
Mister Middle Class Teaser Launch Event
టీజర్ లాంచ్‌లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘చాలా కాలం తర్వాత మిడిల్ క్లాస్ భావోద్వేగాలతో కూడిన పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాను. కథ విన్న వెంటనే చేయాలని అనిపించింది. నాగేశ్వర్ రెడ్డి గారి కామెడీ ట్రీట్మెంట్పై నాకు పూర్తి నమ్మకం ఉంది. లయతో మళ్లీ కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రలో అద్భుతంగా కనిపిస్తారు. ప్రేక్షకులు నవ్వుతూనే భావోద్వేగానికి గురవుతారు” అని చెప్పారు.
హీరోయిన్ లయ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం పాత రోజుల్ని గుర్తు చేసింది. ఈ యూనిట్‌తో పని చేస్తుంటే ఇంటి వాళ్లతో కలిసి ఉన్నట్టే అనిపించింది. కథ విన్నప్పుడే నవ్వు ఆగలేదు. ప్రేక్షకులు కూడా అలాగే థియేటర్లో ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను” అని అన్నారు.
దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ ఈ సినిమా ప్రతి మధ్యతరగతి మనిషి జీవితానికి దగ్గరగా ఉంటుంది. కేవలం కామెడీ సినిమా కాదు. మనిషి చేసే పనికి వచ్చే ఫలితం గురించి సరదాగా చెప్పే కథ. ప్రతి సన్నివేశం నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది” అని అన్నారు.
సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ ‘‘ ఒక మిడిల్ క్లాస్ మనిషి జీవితంలో అకస్మాత్తుగా దేవుడు ప్రత్యక్షమైతే ఏమవుతుంది? అనే కాన్సెప్ట్ చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ప్రేక్షకులు సినిమా పూర్తయ్యేలోపు తమ ఇంట్లోకూ ఆ ‘అదృష్టపు డబ్బా’ రావాలని కోరుకుంటారు” అని చెప్పారు.
డైలాగ్ రైటర్ రత్నబాబు సహా మూవీ టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.