Samantha Maa Inti Bangaram Trailer Launch :
అభిమానులంతా గర్వపడేలా ‘మా ఇంటి బంగారం’
ఒక్కొక్కరినీ కొడతాను చూడు..
సమంత గన్ పవర్, గాజుల పవర్ చూడబోతున్నారు
ఒకప్పుడు గ్లామరస్ హీరోయిన్గా యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసిన సమంత.. ఇటీవల ఫిమేల్ లీడ్‌గా, మాస్ యాక్షన్ స్టోరీస్‌లోనూ తనదైన యాక్టింగ్‌తో ఇంప్రెస్ చేస్తున్నారు. తాజాగా ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. జబదర్దస్త, ఓ బేబీ చిత్రాల తర్వాత సమంతతో నందిని రెడ్డి రూపొందిస్తున్న మూడో చిత్రమిది. ఇదొక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కలిసి నిర్మిస్తున్నారు. జూన్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఐమాక్స్ థియేటర్ దగ్గర సమంతకు చెందిన భారీ కటౌట్‌ను లాంచ్ చేసిన టీమ్.. అనంతరం ఐమాక్స్ స్ర్కీన్‌లో ఫ్యాన్స్‌కు ఈ ట్రైలర్‌ను చూపించారు. ఫ్యామిలీతోపాటు యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా సమంత హౌస్ వైఫ్‌గా కనిపిస్తూనే, యాక్షన్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఉంది. ముఖ్యంగా చీరకట్టుకుని ఆమె భారీ ఫైట్స్ చేయడం ఆకట్టుకుంది. ‘ఏది ఏమైనా సరే.. నా ప్రాణం అడ్డుపెట్టయినా.. నా ఫ్యామిలీని కాపాడుతా..’’, ‘‘ఒక్కొక్కరినీ కొడతాను చూడు.. ప్రేమతో అబ్బా..”అని సమంత చెప్పే డైలాగులు సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి.
Samantha Maa Inti Bangaram Trailer Launch :
ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సమంత మాట్లాడుతూ.. ‘‘ ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మా కోసం ఇక్కడికి వచ్చిన ప్రతీ ఒక్క అభిమానికి థాంక్స్. నందినీ గారు, రాజ్ గారు ప్రతీ విషయంలో పర్ ఫెక్ట్‌గా ఉంటారు. ఇంత వరకు నేను వారితో వాదించే విషయం గానీ, అలాంటి ఓ ఘటన గానీ ఎదురు కాలేదు. ‘మా ఇంటి బంగారం’లో ప్రతీ ఎమోషన్ ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది. యాక్షన్, డ్రామా, కామెడీ అన్ని అంశాలుంటాయి. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. అభిమానులంతా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు.
నందినీ రెడ్డి మాట్లాడుతూ .. ‘యాక్టింగ్ పరంగా సమంత దినదినాభివృద్ది చెందుతున్నారు. ఒకప్పటి సమంతకి ఇప్పటి సమంతకు ఎంతో తేడా ఉంది. ఇప్పుడు ఆమె నెక్ట్స్ లెవెల్లో ఉన్నారు. యాక్షన్, కామెడీ, ఎమోషన్ ఇలా ప్రతీ సీన్లో సమంత అదరగొట్టేశారు. నేను కూడా సమంత అభిమానిగానే మానిటర్ ముందు కూర్చుని చూశా. కచ్చితంగా ఈ సినిమా బ్లాస్ట్ అవుతుంది. అందరినీ ఆకట్టుకునేలా ‘మా ఇంటి బంగారం’ ఉంటుంది’’ అని అన్నారు.
రాజ్ నిడిమోరు మాట్లాడుతూ .. ‘‘మా ఇంటి బంగారం’ అనే పేరులోనే ఎంతో ఎఫెక్షన్, లవ్ ఉంటుంది. దాని వెనకాల డార్క్ సైడ్, పొసెసివ్ నెస్ కూడా ఉంటుంది. సమంత, నందినీ రెడ్డి మధ్య ఉండే క్లోజ్‌నెస్ అందరికీ తెలిసిందే. వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే నందినీ రెడ్డిని దర్శకురాలిగా తీసుకున్నాం”అని అన్నారు.
హిమాంక్ దువ్వూరు మాట్లాడుతూ .. ‘‘ ట్రైలర్ చూస్తేనే సమంత యాక్టింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం అవుతుంది. ప్రొడక్షన్లో, యాక్టింగ్‌లో సమంతకు వందకు వంద మార్కులు పడతాయి. ఈ జర్నీలో మేమంతా ఎంతో సరదాగా, ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అందరం కలిసి టీం ఎఫెర్ట్‌తో ‘మా ఇంటి బంగారం’ను రూపొందించాం. నందినీ రెడ్డి గారు, సమంత గారి కాంబినేషన్ అందరికీ నచ్చుతుంది”అని చెప్పారు.
శ్రీముఖి మాట్లాడుతూ .. ‘సమంత గారు హీరోయిన్ అని చెప్పడంతోనే కథ వినకుండానే ఓకే చెప్పాను. సమంత నిజంగానే ఓ బంగారం. ఆమె యాక్షన్ లైవ్‌లో చూడటం ఓ ట్రీట్. ఈ చిత్రంలో ఆమె నవ్విస్తారు, ఏడ్పిస్తారు, ఫైట్స్ చేస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నందినీ రెడ్డి గారికి థాంక్స్. రాజ్ గారితో అసోసియేట్ అవ్వడం ఆనందంగా ఉంది. అభిమానులందరి ప్రేమతో ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
నటుడు శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ .. ‘‘ముందుగా నేను దర్శకుడిగా ఓ సినిమా చేశాను. ‘శుభం’తో నటుడిగా మారాను. ఇప్పట్లో నా ఫోకస్ దర్శకత్వం వైపు అయితే లేదు. పూర్తిగా నటన మీదే ఫోకస్ చేస్తున్నాను. సమంత గారితో నటించడం ఆనందంగా ఉంది. జూన్ 19న గన్ పవర్, గాజుల పవర్ చూడబోతోన్నారు’’ అని అన్నారు.
ఈ సినిమాలో దిగంత్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్ని పోషించారు. శ్రీ ముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.