నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రతిష్ఠాత్మక చిత్రం #NBK112 గురువారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలతో అధికారిక శ్రీకారం చుట్టారు.
ఈ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నారా లోకేష్ తొలి క్లాప్ కొట్టగా, కందుల దుర్గేష్ కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాతలు డి. సురేష్ బాబు, వెంకట సతీష్ కిలారు, సాహు గారపాటి తదితరులు కార్యక్రమంలో పాల్గొని చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు.
ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో భాగమయ్యే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిని సృజనాత్మక పరిశ్రమలకు కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అత్యాధునిక ఫినిషింగ్ స్టూడియోలు, సాంకేతిక వసతులు కల్పించడం ద్వారా చలనచిత్ర రంగానికి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ప్రతిష్ఠాత్మక చిత్రాలు అమరావతి నుంచే తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, రచయితగా, దర్శకుడిగా మారకముందే బాలకృష్ణ నటించిన చిత్రాలకు సహాయ రచయితగా, సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం తనకు లభించిందని గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణకు తాను ఎప్పటినుంచో వీరాభిమానినని, ఆయన కోసం ప్రత్యేకంగా కథ రాసి దర్శకత్వం వహించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ చిత్రం బాలకృష్ణ అభిమానులతో పాటు ప్రతి సినీ ప్రేమికుడికి చిరకాలం గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
బాలకృష్ణ మాట్లాడుతూ, కోట్లాది మంది అభిమానుల ప్రేమాభిమానాలు తనకు దక్కడం అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులకు, తొలి షాట్‌కు దర్శకత్వం వహించిన తన కుమార్తె తేజస్వినికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. “ఆంధ్రప్రదేశ్‌లో ఇంత భారీ స్థాయిలో సినిమా ప్రారంభోత్సవం జరిగి దాదాపు రెండు దశాబ్దాలు అవుతోంది. దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలతో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి కావడం ఈ ప్రాజెక్టును మరింత ప్రత్యేకంగా నిలిపింది” అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. విజయవాడ సినీ పరిశ్రమకు కీలక కేంద్రంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘అఖండ’ చిత్రాన్ని రాష్ట్రంలోని అనేక అందమైన ప్రాంతాల్లో చిత్రీకరించామని గుర్తు చేస్తూ, భవిష్యత్తులో అమ్యూజ్మెంట్ పార్కులు, పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు సినిమా రంగం కూడా విస్తరించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన అనంతరం పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లోనూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామని, నిర్మాతలు, దర్శకులు, పరిశ్రమ ప్రతినిధులతో చర్చించి అవసరమైన ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కాకినాడ పోర్టులో జరుగుతున్న తన సినిమా షూటింగ్‌తో పాటు, కొరటాల శివతో చేయనున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు.
బాలకృష్ణ – కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ శక్తివంతమైన స్క్రీన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కమర్షియల్ అంశాలు, బలమైన భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్‌ను సమపాళ్లలో మేళవిస్తూ కొరటాల శివ ఈ కథను రూపొందించినట్లు చిత్రబృందం తెలిపింది.
నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని తెలిపారు.