ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్ వి ఎల్ క్రియేషన్స్, మధుపాల మహా మూవీస్ పతాకాలపై రూపొందుతున్న చిత్రం ‘టార్టాయిస్’. ఇందులో రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రిత్విక్ కుమార్ కథ, మాటలు, దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలుగా విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు మరియు మధుపాల సురేష్ వ్యవహరిస్తున్నారు. సోమవారం హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో డార్క్ థ్రిల్లర్ మూడ్, అరణ్య నేపథ్యం, చేతిలో ఆయుధంతో కనిపిస్తున్న రాజ్ తరుణ్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు మాట్లాడుతూ, “మా హీరో రాజ్ తరుణ్ కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రస్తుతం మా చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు” అని తెలిపారు.
వారు ఇంకా మాట్లాడుతూ, “టార్టాయిస్ ఒక కొత్త తరహా థ్రిల్లర్ చిత్రం. చాలా డిఫరెంట్ కథ, కొత్త స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. ఇది రాజ్ తరుణ్ కెరీర్‌లో 25వ చిత్రం మాత్రమే కాకుండా, ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే చిత్రంగా ఉంటుంది. అలాగే శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, అమృత చౌదరి పాత్రలు కూడా చాలా బలంగా ఉంటాయి” అన్నారు.
“హీరోకు నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. నిద్రలో నడుచుకుంటూ వెళ్లి కొన్ని హత్యలు చేస్తాడు. ఆ తర్వాత ఏమి జరుగుతుంది?” అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, షూటింగ్ పూర్తైందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు.





