Rag Mayur Anumana Pakshi Movie Review
చిత్రం: అనుమాన పక్షి
రేటింగ్ : 0.5/5
నటీనటులు : రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, అజయ్, రాశి, ప్రిన్స్ సిసిల్, బ్రహ్మాజీ తదితరులు..
బ్యానర్ : చిలక ప్రొడక్షన్స్
నిర్మాతలు : రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : విమల్ కృష్ణ
సంగీత దర్శకుడు : శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ) : సునీల్ కుమార్ నామా
ఎడిటర్ : ఛోటా కె. ప్రసాద్
విడుదల తేదీ : 25 సెప్టెంబర్ 2026
Rag Mayur Anumana Pakshi Movie Review
కథ విషయానికొస్తే :
సన్నీ (రాగ్ మయూర్)కి ప్రపంచంలో దేనిపైనా నమ్మకం ఉండదు. ప్రతి విషయాన్ని అనుమానించడం అతడి నైజం. ఆ అనుమానాలే చివరికి అతడిని కశ్మీర్‌కి తీసుకెళ్తాయి. అక్కడ ప్రేమ, స్నేహం, మర్డర్ మిస్టరీ, పోలీస్ ట్రాక్, ఆత్మల వ్యవహారం అంటూ కథ చాలా దారుల్లోకి వెళ్తుంది. వర్మ (ప్రిన్స్) అనుమానాస్పదంగా చనిపోవడంతో కథ ఒక్కసారిగా క్రైమ్ థ్రిల్లర్‌గా మారుతుంది. అసలు హత్య ఎలా జరిగింది? సన్నీకి దానితో సంబంధం ఉందా? హీరోయిన్ ఎందుకు మోసం చేసింది? పోలీస్ అలియాస్ వాయిస్ ఆఫ్ వాసు (అజయ్) అక్కడ ఏం చేస్తున్నాడు? అనే ప్రశ్నలు వస్తాయి. అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనే ఆసక్తి కంటే “ఇదంతా ఎందుకు జరుగుతోంది?” అనే ప్రశ్నే ప్రేక్షకుడికి ఎక్కువగా వస్తుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
రాగ్ మయూర్ తన పాత్ర కోసం చాలా ఎనర్జీ పెట్టాడు. అనుమానాలు పడటం, వింతగా ప్రవర్తించడం, రకరకాల హావభావాలు పలికించడం వంటి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు కామెడీగా మారకపోవడంతో కొంతసేపటికి అవే చిరాకు తెప్పిస్తాయి. అజయ్, బ్రహ్మాజీ, రాశి, ప్రిన్స్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ వారి పాత్రలకు సరైన బలం లేదు. ముఖ్యంగా అజయ్ ట్రాక్‌తో కామెడీ పండించాలనుకున్న ప్రయత్నం అంతగా వర్కౌట్ కాలేదు. హీరోయిన్ పాత్ర కూడా కథకు ఎంత అవసరమో అర్థం కాని పరిస్థితి. నటీనటులు తమ వంతు ప్రయత్నం చేసినా, రాతలో బలం లేకపోవడంతో పెద్దగా రిజిస్టర్ అయ్యే పాత్ర ఏదీ కనిపించదు.
టెక్నికల్ టీమ్ గురించి..
సినిమాలో కనిపించే కశ్మీర్ లొకేషన్స్ కొంత విజువల్ రిలీఫ్ ఇస్తాయి. సినిమాటోగ్రఫీ ఓకే అనిపించినా, కొన్ని సన్నివేశాల్లో విజువల్ ట్రీట్ కంటే కథలోని గందరగోళమే ఎక్కువగా కనిపిస్తుంది. శ్రీచరణ్ పాకాల సంగీతంలో గుర్తుండిపోయే పాటలు పెద్దగా కనిపించవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలను ఎలివేట్ చేసే స్థాయిలో అనిపించదు. ఎడిటింగ్ పరంగా సినిమా నిడివి తక్కువగా ఉండటం మాత్రం కొంత ఊరట. కానీ కట్ చేసినా, కలిపినా కథలోని కన్ఫ్యూజన్ మాత్రం పోదు.
సినిమా ఎలా ఉందంటే..
కామెడీ సినిమా తీయాలంటే ప్రేక్షకుడు నవ్వాలి. థ్రిల్లర్ తీయాలంటే ప్రేక్షకుడికి ఉత్కంఠ కలగాలి. లవ్ స్టోరీ అయితే ప్రేమకథ కనెక్ట్ అవ్వాలి. ‘అనుమాన పక్షి’లో ఈ మూడింటినీ కలపాలని ప్రయత్నించారు. కానీ ఏ ఒక్కటి పూర్తిగా వర్కౌట్ కాలేదు. ఫస్ట్ హాఫ్‌లో హీరో అనుమానాలు, అతడి చేష్టలతో నవ్వించాలని చేసిన ప్రయత్నాలు పెద్దగా పేలవు. ఒక దశ తర్వాత అవే సీన్లు రిపీట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇంటర్వెల్ దగ్గర మర్డర్ మిస్టరీతో కథపై ఆసక్తి పెంచే ప్రయత్నం జరుగుతుంది. “ఇక సినిమా ట్రాక్‌లోకి వస్తుందేమో” అనుకుంటే సెకండాఫ్‌లో మరిన్ని పాత్రలు, మరిన్ని ట్రాక్‌లు వచ్చి కథను ఇంకా గందరగోళంగా మార్చేస్తాయి. పోలీస్ పాత్ర, ఆత్మల ఎపిసోడ్, టెర్రరిస్ట్ ట్రాక్, లవ్ స్టోరీ, మర్డర్ మిస్టరీ.. ఇలా ఒక్కో అంశం ఒక్కో సినిమాలో ఉండాల్సినట్టుగా అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపూ హీరోకే అనుమానాలు ఉంటాయని అనుకుంటాం. కానీ చివరికి ప్రేక్షకుడికే సినిమా మీద అనుమానం మొదలవుతుంది. “ఇది కామెడీనా? క్రైమ్ థ్రిల్లరా? లవ్ స్టోరీనా?” అని ప్రేక్షకుడు తేల్చుకునేలోపే సినిమా ముగిసిపోతుంది.
ప్లస్ పాయింట్స్ :
కశ్మీర్ లొకేషన్స్
తక్కువ రన్‌టైమ్
మైనస్ పాయింట్స్ :
కామెడీ పూర్తిగా వర్కౌట్ కాకపోవడం
గందరగోళంగా అనిపించే స్క్రీన్‌ప్లే
సన్నివేశాల మధ్య సరైన కనెక్షన్ లేకపోవడం
బలహీనమైన లవ్ ట్రాక్
ఆకట్టుకోని మర్డర్ మిస్టరీ
అనవసరంగా అనిపించే కొన్ని ఎపిసోడ్స్
పాత్రలకు సరైన ఇంపాక్ట్ లేకపోవడం
సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో ఇంపాక్ట్ లేకపోవడం
ఫైనల్‌గా చెప్పాలంటే..
అనుమానాలతో మొదలైన సినిమా చివరికి ప్రేక్షకుడి ఓపికనే పరీక్షిస్తుంది. ఒక చిన్న, సింపుల్ పాయింట్‌ను కామెడీగా చెప్పే అవకాశం ఉన్నప్పటికీ దానికి లవ్, మర్డర్, పోలీస్, హారర్, టెర్రరిజం అంటూ చాలా పొరలు జోడించడంతో అసలు పాయింటే మిస్ అయింది. నవ్వించని కామెడీ.. ఆకట్టుకోని థ్రిల్.. కనెక్ట్ కాని లవ్ స్టోరీ.. వెరసి ‘అనుమాన పక్షి’ ప్రేక్షకుడికి పెద్ద పరీక్ష. మొత్తానికి సినిమా మాత్రం చూడాలా వద్దా అనే విషయంలో అనుమానమే అవసరం లేదు!