Prabhas Fauji Gets Official Release Date
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ ఎట్టకేలకు అధికారికంగా వచ్చేసింది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ రిలీజ్ డేట్‌ను టీమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్‌తో మేకర్స్ వెల్లడించారు.
Prabhas Fauji Gets Official Release Date
తాజాగా విడుదల చేసిన పోస్టర్లో ప్రభాస్ యుద్ధభూమిలో రక్తసిక్తమైన లుక్‌లో కనిపిస్తూ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాడు. పోస్టర్‌పై ‘ఒంటరిగా పోరాడే బెటాలియన్’ అనే ట్యాగ్‌లైన్‌తో పాటు “अज्ञातपर्व ENDS… THE REBELLION BEGINS ” (అజ్ఞాత పర్వానికి ముగింపు… ఇక తిరుగుబాటు ప్రారంభం) అంటూ ఆసక్తిని మరింత పెంచే క్యాప్షన్‌ను జోడించారు. దీంతో సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో పోస్టర్ ద్వారానే హింట్ ఇచ్చినట్లైంది.
ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ‘ఫౌజీ’పై పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ నెలకొంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్లింప్స్ విడుదలయ్యే అవకాశముందని కూడా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్ ఇమాన్వీ నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేశభక్తి, ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా హను రాఘవపూడి ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, టీ-సిరీస్ సమర్పణలో భూషణ్ కుమార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… దాదాపు 20 రోజుల క్రితమే PinkvillaTelugu ఈ విడుదల తేదీపై ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని ప్రచురించింది. అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు డిసెంబర్ 3నే ‘ఫౌజీ’ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని వెల్లడించగా, ఇప్పుడు అదే తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించడం విశేషం.