Padma Shri Murali Mohan Felicitated by NAREDCO
పద్మశ్రీ మురళీమోహన్‌కు నరెడ్కో ఘన సన్మానం..
హైదరాబాద్ దేశంలోనే నెం.1 సిటీగా ఎదగాలి: మురళీమోహన్
నటుడిగా, నిర్మాతగా, ప్రజా నాయకుడిగా సుదీర్ఘ ప్రస్థానం కొనసాగిస్తున్న పద్మశ్రీ మురళీమోహన్‌కు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మురళీమోహన్ను సత్కరించారు.
Padma Shri Murali Mohan Felicitated by NAREDCO
ఈ సందర్భంగా నరెడ్కో ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొప్పుల మాట్లాడుతూ.. ఏపీ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్‌ను మురళీమోహన్ స్థాపించి క్రమశిక్షణతో కూడిన సంస్థగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. ఆయన చూపిన మార్గదర్శకత్వాన్ని ఇప్పటికీ అనుసరిస్తున్నామని తెలిపారు. 2006లో నరెడ్కోలో చేరిన తాను 2009 నుంచి వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నానని, మురళీమోహన్ సూచించిన విధానాలతోనే సంస్థ ముందుకు సాగుతోందని చెప్పారు. కోవిడ్ సమయంలోనూ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించామని పేర్కొన్నారు. పద్మశ్రీ పురస్కారం అందుకున్న మురళీమోహన్ను సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. బిల్డర్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తమ భుజాలపై మోస్తున్నారని ప్రశంసించారు. మురళీమోహన్ సమయపాలన, కమిట్మెంట్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వయసు పెరుగుతున్నా ఆయన ఉత్సాహం, ఆరోగ్యం చూస్తే ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’ అనిపిస్తోందన్నారు.
ప్రముఖ బిల్డర్ డీఎస్ రావు మాట్లాడుతూ.. మురళీమోహన్‌కు పద్మశ్రీ కేవలం సినిమాల్లో చేసిన సేవలకు మాత్రమే కాకుండా ఆర్ట్, సోషల్ వర్క్‌కు కూడా గుర్తింపుగా వచ్చిందన్నారు. ఎంతోమంది విద్యార్థులకు ఆయన ఆర్థికంగా, ఇతర విధాలుగా అండగా నిలిచారని చెప్పారు. ఆయన సాయం పొందిన ఓ విద్యార్థి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా మురళీమోహన్‌కు రాసిన భావోద్వేగ లేఖ తనను ఎంతో కదిలించిందని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. నరెడ్కో 1995లో ప్రారంభమై ప్రస్తుతం సుమారు 350 మంది బిల్డర్లతో గొప్ప సంస్థగా ఎదిగిందన్నారు. నిర్మాణ రంగంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అభివృద్ధిలో భాగస్వామిగా నిలుస్తోందని చెప్పారు. ఏటా ప్రాపర్టీ షోతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోందని ప్రశంసించారు.
మురళీమోహన్ సినిమా, రాజకీయ, వ్యాపార రంగాల్లో విజయానికి మారుపేరుగా నిలిచారని స్పీకర్ కొనియాడారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణతో ప్రతి రంగంలో విజయాన్ని సాధించారని అన్నారు. వ్యక్తిగతంగా ఎంతో మంచి మనసున్న వ్యక్తి అయిన మురళీమోహన్‌కు పద్మశ్రీ రావడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. కృష్ణ, మురళీమోహన్ నటనకు తాను అభిమానినని, ఆయనను ఈ వేదికపై కలవడం ఆనందంగా ఉందన్నారు.
పద్మశ్రీ మురళీమోహన్ మాట్లాడుతూ.. పద్మశ్రీ వచ్చిన తర్వాత ఎన్నో సత్కారాలు జరిగినప్పటికీ నరెడ్కో నిర్వహించిన ఈ కార్యక్రమం తనకు ఎంతో ప్రత్యేకమని అన్నారు. ఇక్కడ ఉన్నవారంతా తన కుటుంబ సభ్యులేనని తెలిపారు.
తాను రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి నటుడు శోభన్ బాబు ఇచ్చిన సలహా కారణమని మురళీమోహన్ గుర్తుచేసుకున్నారు. తన తమ్ముడు కిషోర్ ప్రతి సందర్భంలోనూ తనకు అండగా నిలిచారని చెప్పారు. తాను రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన సమయంలో ఈ రంగం చాలా ఇబ్బందుల్లో, అస్తవ్యస్తంగా ఉండేదని, ఒకే భూమిని పలుమార్లు విక్రయించే పరిస్థితులు ఉండేవని తెలిపారు.
అలాంటి పరిస్థితులకు ముగింపు పలికి, ప్రజలకు నమ్మకమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో నరెడ్కోను ఏర్పాటు చేశామని మురళీమోహన్ చెప్పారు. తమ వద్దకు వచ్చే కస్టమర్‌ను దేవుడిగా భావించి సేవ చేయాలనే ఆలోచనతో సంస్థను ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. అదే స్ఫూర్తితో నరెడ్కో ఇప్పటికీ కొనసాగడం సంతోషంగా ఉందన్నారు.
భవిష్యత్తులో నరెడ్కో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించిన మురళీమోహన్.. రాబోయే రోజుల్లో హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్ సిటీగా మారుతుందని అన్నారు. అదే సమయంలో కొత్త రాజధానిగా అమరావతి కూడా హైదరాబాద్‌తో పోటీపడే స్థాయిలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని తెలిపారు.