Music Director Ajay Arasada Special Interview
‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి ప్రాజెక్టులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు అజయ్ అరసాడ. వైజాగ్ నుంచి వచ్చిన ఆయన.. టీసీఎస్‌లో ఏడేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత సంగీతంపై ఉన్న ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు వరుస అవకాశాలతో మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీగా ఉన్నారు. తన కెరీర్, ఏఐ, మ్యూజిక్, క్రెడిట్స్‌తో పాటు పవన్ కళ్యాణ్‌తో జరిగిన ఆసక్తికరమైన భేటీ గురించి అజయ్ అరసాడ పలు విషయాలు పంచుకున్నారు.
Music Director Ajay Arasada Special Interview
ఉద్యోగం నుంచి సినిమా సంగీతం వైపు..
మాది వైజాగ్. మా కుటుంబంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉన్నాయి. టీసీఎస్‌లో దాదాపు ఏడేళ్లు ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూనే రెండు సినిమాలకు పని చేశాను. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ నాకు పెద్ద స్ఫూర్తి. మా అమ్మ, నా భార్య ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇండస్ట్రీలోకి రాగలిగాను. వైజాగ్‌లో శ్రీ చరణ్ నాకు మంచి స్నేహితుడు. ‘గూఢచారి’ సినిమాకు ఆయన నన్ను కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా తీసుకున్నారు. అక్కడి నుంచి నా జర్నీ మరో దశలోకి వెళ్లింది.
చిన్న సినిమాలే.. కానీ ఛాలెంజ్ లేదు
చిన్న సినిమాలకు పని చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. నేను పనిచేసిన ప్రొడక్షన్స్ కూడా మంచి సంస్థలే. పేమెంట్స్ విషయంలో కూడా ఎప్పుడూ ఇబ్బంది రాలేదు. అందుకే చిన్న సినిమాలు చేస్తున్నాననే ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు. నాకు వచ్చిన కథకు మంచి సంగీతం ఇవ్వడమే ముఖ్యంగా భావిస్తాను.

కథకు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడమే లక్ష్యం
నన్ను ఒకే జానర్‌కు పరిమితం చేసుకోవాలని అనుకోవడం లేదు. అన్ని రకాల కథలు, జానర్లలో పని చేయాలని ఉంది. నా దగ్గరకు మాస్ కథ వస్తే మాస్కు తగ్గ మ్యూజిక్ ఇస్తాను. కథ డిమాండ్ చేస్తే కొత్తగా ప్రయోగాలు చేస్తాను. తమిళ్ నుంచి వస్తే కొత్తగా, మలయాళం నుంచి వస్తే ఫ్రెష్‌గా ఇస్తాడనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. కానీ నిజానికి కథకు న్యాయం చేయడమే నా లక్ష్యం.
బడ్జెట్‌ను బట్టి నా పాట మారదు
ఒక్కో సింగర్ ఒక్కో విధంగా ఛార్జ్ చేస్తారు. కానీ నా పాటకు ఎవరు సరిపోతారనిపిస్తే వారితోనే పాడిస్తాను. ఎందుకంటే చివరికి అది నా పాట. చాలా కాలం గుర్తుండిపోయే పాట ఇవ్వాలన్నదే నా ప్రయత్నం.
కెరీర్ ప్రారంభంలో అనురాగ్ కులకర్ణితో పాట పాడిస్తానని చెప్పినప్పుడు ఓ నిర్మాత వద్దన్నారు. ఇప్పుడు అదే నిర్మాత అనురాగ్‌తో పాట పాడించుకునే స్థాయిలో లేరు అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు.
ఓటీటీలో ‘వికటకవి’ సౌండ్ తగ్గిపోయింది
థియేటర్ కోసం మ్యూజిక్, స్కోర్‌ను చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తాం. కానీ అదే కంటెంట్ ఓటీటీలోకి వచ్చినప్పుడు మేము థియేటర్ కోసం చేసిన కష్టం పూర్తిగా వినిపించదు. ‘వికటకవి’ని థియేటర్లో చూస్తే సౌండింగ్ పరంగా మరో లెవెల్లో ఉంటుంది. ఓటీటీలోకి వచ్చేసరికి నేను చేసిన పనిలో దాదాపు యాభై శాతం మాత్రమే అనిపిస్తుంది.
ఏఐతో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వలేరు
ప్రస్తుతం ఏఐ గురించి చాలా చర్చ జరుగుతోంది. కానీ మ్యూజిక్‌పై ఏఐ ప్రభావం అంతగా లేదని నా అభిప్రాయం. ఎన్ని ప్రాంప్ట్స్ ఇచ్చినా ఏఐలో వచ్చే ట్రాక్స్‌లో ఒకే రకమైన ఫీల్ కనిపిస్తుంది. కొంతమంది నిర్మాతలు ఏఐతో తయారు చేసిన ట్రాక్స్ పంపించి, అలాగే కావాలని అడుగుతుంటారు. అలాంటప్పుడు ‘మీరే చేసుకోండి’ అనిపిస్తుంది అంటూ నవ్వారు. ఏఐని ఉపయోగించి టెక్నీషియన్ తన పనిని సులభతరం చేసుకోవచ్చు. కానీ ఏఐని ఉపయోగించి ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారని మాత్రం అనుకోకూడదు.
పవన్ కళ్యాణ్ స్వయంగా పిలిచి అరగంట మాట్లాడారు
ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కలిసిన అనుభవం గురించి అజయ్ అరసాడ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “నేను జనసేన కార్యక్రమాలకు మ్యూజిక్ ఇస్తుంటాను. ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ కలిసిన సమయంలో కూడా ఒక స్కోర్ చేశాను. నా వర్క్ చూసి పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిపించారు. నాతో పర్సనల్‌గా మాట్లాడారు. రాజకీయ కార్యక్రమాల కోసమైనా, పీకే క్రియేటివ్స్ బ్యానర్లో చేసే ప్రాజెక్ట్స్ కోసమైనా కలిసి పనిచేద్దామని చెప్పారు” అని తెలిపారు. పవన్ కళ్యాణ్ తనను ఎందుకు పిలిచారని మొదట ఆశ్చర్యపోయానని అజయ్ చెప్పారు. “నాతో ఆయన పర్సనల్‌గా ఎందుకు మాట్లాడతారు అనుకున్నాను. మళ్లీ ఫోన్ చేసి మీటింగ్ గురించి చెప్పారు. ఐదారు నిమిషాలు మాట్లాడి, ఫొటో దిగేసి వచ్చేస్తానని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్లేసరికి ఆయన ఒక్కరే ఉన్నారు. దాదాపు అరగంట నాతో మాట్లాడారు. చాలా విషయాలు చర్చించుకున్నాం. భవిష్యత్తులో కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్స్ గురించి కూడా చెప్పారు” అని వెల్లడించారు.
తన దగ్గర ఉన్న ఓ బోస్ స్పీకర్‌ను పవన్ కళ్యాణ్ సరదాగా అడిగిన విషయాన్ని కూడా అజయ్ గుర్తు చేసుకున్నారు. “నా దగ్గర కాఫీ మగ్ షేప్‌లో ఉండే బోస్ స్పీకర్ ఉంటుంది. దాన్ని చూసి ఇదేంటి అని అడిగారు. దాన్ని పట్టుకుని సరదాగా చూశారు. కాఫీ కప్పులా ఉందే అంటూ కామెడీ చేశారు. కాఫీ పట్టుకొచ్చావా అని జోక్స్ వేశారు. నాతో పవన్ కళ్యాణ్ గారు ఇలా సరదాగా మాట్లాడుతున్నారేంటి అని లోలోపల చాలా సంబరపడ్డాను” అని నవ్వుతూ చెప్పారు.
జనసేనకు సంగీతం.. వెనుక ఉన్నది స్నేహితుడి పరిచయం
జనసేన కార్యక్రమాలకు మ్యూజిక్ చేసే అవకాశం తన స్నేహితుడి ద్వారా వచ్చిందని అజయ్ తెలిపారు. వెంకట్ చిక్కాల అనే తన మిత్రుడు అక్కడ ఎడిటర్‌గా పనిచేస్తున్నారని, ఆయన ద్వారా అవకాశం లభించిందన్నారు. అలాగే బన్నీ వాస్ తనతో చాలా వర్క్ చేయించారని, అక్కడి నుంచే ‘ఆయ్’ సినిమా అవకాశం వచ్చిందని చెప్పారు.
సెల్ఫ్ ప్రమోషన్ నాకు రాదు
తాను బయట ఎక్కువగా కనిపించకపోవడానికి కారణం కూడా అజయ్ వివరించారు. “నా పని గురించి నేనే బయటకు వచ్చి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేను ఇంట్రోవర్ట్. ఎక్కువగా మాట్లాడను. ఈవెంట్లలో కూడా పెద్దగా కనిపించను. సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడం నాకు తెలియదు” అని అన్నారు.
‘ఆయ్’ విషయంలో నా క్రెడిట్ మిస్ అయింది
మ్యూజిక్ క్రెడిట్స్ విషయంలో ఎదురైన అనుభవాన్ని కూడా అజయ్ పంచుకున్నారు. “‘ఆయ్’ విషయంలో నాకు అలాంటి పరిస్థితి వచ్చింది. రామ్ మిర్యాల గారు రెండు పాటలు ఇచ్చారు. మిగతా మ్యూజిక్ అంతా నేను చేశాను. కానీ మీడియాలో మాత్రం ఆయన పేరు మాత్రమే కనిపించింది. అది తప్పుగా వెళ్లింది. అందుకే ప్రతి ఈవెంట్లో బన్నీ వాస్ గారు నా పేరు చెబుతూ ఉండేవారు. మీడియాలో వచ్చిన తప్పును ఆయన కరెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇటీవల ‘సేవ్ ది టైగర్స్’ విషయంలో కూడా నా పేరు కాకుండా వేరే పేరు కనిపించింది. నేను మాత్రం నా టీమ్‌లో పనిచేసే ప్రతి ఒక్కరికీ క్రెడిట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను” అని తెలిపారు.
10 ఏళ్ల తర్వాత వచ్చిన కాన్ఫిడెన్స్
పదేళ్ల సినీ ప్రయాణంపై తనకు పూర్తి సంతృప్తి ఉందని అజయ్ చెప్పారు. “పేరుకి పదేళ్లు అయినా మధ్యలో కరోనా వల్ల చాలా సమయం పోయింది. ఈ జర్నీలో నా మీద నాకు నమ్మకం పెరిగింది. ఎలాంటి సినిమాకైనా మ్యూజిక్ ఇవ్వగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. పెద్ద కమర్షియల్ సినిమాకు కూడా అద్భుతమైన సంగీతం అందించగలను. ఈ పదేళ్లలో నేను సంపాదించుకున్న గొప్ప విషయం ఈ నమ్మకమే. ఇప్పుడు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను” అని అజయ్ అరసాడ చెప్పుకొచ్చారు.