కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మలయాళ సెన్సేషన్ ‘వాలా Ⅱ’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. సావిన్ SA దర్శకత్వంలో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇప్పటికే మలయాళంలో భారీ విజయాన్ని అందుకుని, రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. సాహు గారపాటి తన ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు హీరో తేజ సజ్జా, దర్శకుడు గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
తేజ సజ్జా మాట్లాడుతూ.. ఈ మూవీ ట్రైలర్లో కనిపించిన ఎనర్జీ టీమ్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తారని, ‘వాలా Ⅱ’ కూడా ఇక్కడ పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత సాహు గారపాటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, మంచి మనసున్న వ్యక్తికి సక్సెస్ తప్పక వస్తుందని చెప్పారు. ఏప్రిల్ 24న అందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని ప్రేక్షకులను కోరారు.
మలయాళ ఇండస్ట్రీతో కలసి పనిచేయాలన్న ఆలోచనతో ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు సాహు గారపాటి తెలిపారు. ‘వాలా Ⅱ’ క్లైమాక్స్ ప్రేక్షకులను కదిలించేలా ఉంటుందని, తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.
సినిమాలో బ్రదర్హుడ్, ఫ్రెండ్షిప్ వంటి భావోద్వేగాలు బలంగా ఉన్నాయని గోపీచంద్ మలినేని అన్నారు. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ‘వాలా Ⅱ’ కూడా ఇక్కడ విజయాన్ని సాధిస్తుందని ఆశించారు.
సినిమాలో నటించిన అలన్, హషీర్, అజిన్ తదితరులు తెలుగు ప్రేక్షకుల ఆదరణపై విశ్వాసం వ్యక్తం చేశారు. తమకు తెలుగు సినిమాలంటే ఎంతో ఇష్టమని, ఈ చిత్రం కూడా ఇక్కడ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందని తెలిపారు.
విపిన్ దాస్, సావిన్ SA, సాగర్ కె చంద్ర వంటి దర్శకులు కూడా ఈ సినిమాపై నమ్మకం వ్యక్తం చేశారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారని, ‘వాలా Ⅱ’ కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని చెప్పారు.
మొత్తంగా, మలయాళంలో ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘వాలా Ⅱ’ తెలుగు మార్కెట్లో కూడా అదే స్థాయి విజయాన్ని అందుకోవాలని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. యూత్‌ఫుల్ ఎమోషన్స్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.





