Nara Lokesh Praises Ranabaali Trailer
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘రణబాలి’ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. 18వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యం, బ్రిటిష్ పాలనలో చోటుచేసుకున్న కరువు పరిస్థితులు, అప్పటి ప్రజల జీవన సంఘర్షణలను ప్రతిబింబించేలా ట్రైలర్‌ను రూపొందించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే నారా లోకేష్ కూడా ట్రైలర్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Nara Lokesh Praises Ranabaali Trailer
రౌద్రం నిండిన విజయ్ దేవరకొండ నటన.. భావోద్వేగాలను పలికించే రష్మిక మందన్న పాత్ర.. బ్రిటిష్ కాలం నాటి రాయలసీమ చరిత్రను కళ్లకు కట్టే ప్రయత్నం.. ఇవన్నీ కలగలిపి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ మూవీ ట్రైలర్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు.
‘రణబాలి’ ట్రైలర్ అద్భుతమైన అనుభూతిని కలిగించిందని నారా లోకేష్ పేర్కొన్నారు. 18వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యాన్ని ఎంతో సహజంగా తెరపై ఆవిష్కరించారని, బ్రిటిష్ కాలంలో ఏర్పడిన కరువు పరిస్థితులను హృదయాన్ని తాకేలా చూపించారని ప్రశంసించారు. సీమ కోసం పోరాడే బిడ్డగా విజయ్ దేవరకొండ రౌద్రపూరిత నటన ఆకట్టుకుందని, రష్మిక మందన్న అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారని కొనియాడారు. చరిత్రలో మరుగునపడిన ఓ కీలక అధ్యాయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌తో పాటు చిత్రబృందం మొత్తానికి అభినందనలు తెలిపారు. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రణబాలి’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. లోకేష్ ట్వీట్‌తో మూవీ టీమ్‌లో మరింత ఉత్సాహం నెలకొంది. లోకేష్ అభినందనలకు హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
‘లోకేష్ అన్నా.. ఈ సినిమా నా బాధ్యత’ : విజయ్ దేవరకొండ
నారా లోకేష్ ప్రశంసలపై విజయ్ దేవరకొండ భావోద్వేగంగా స్పందించారు. “లోకేష్ అన్నా.. సీమ నేల నాకు ఎంతో ఇచ్చింది. ఈ సినిమా చేయడం నా బాధ్యత. మీ సందేశం మా అందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది. మన నేల, మన ప్రజల పట్ల గర్వాన్ని కలిగించే గొప్ప సినిమాటిక్ అనుభూతి మీ ముందుకు రాబోతోంది” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ చూపించిన అభిమానానికి ధన్యవాదాలు చెబుతూ తన గౌరవం, ప్రేమను వ్యక్తం చేశారు. విజయ్ స్పందన చూస్తుంటే ‘రణబాలి’ సినిమా ఆయనకు కేవలం మరో చిత్రం మాత్రమే కాదని, రాయలసీమతో తనకున్న అనుబంధాన్ని చాటిచెప్పే ప్రత్యేకమైన ప్రయత్నమని అర్థమవుతోంది.
జయమ్మ పాత్ర ఎంతో ప్రత్యేకం.. రష్మిక ఆనందం
విజయ్ దేవరకొండకు జోడీగా జయమ్మ పాత్రలో నటిస్తున్న రష్మిక మందన్న కూడా నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘రణబాలి’ చరిత్రలోని ఓ ముఖ్యమైన అధ్యాయాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ప్రత్యేకమైన కథ అని పేర్కొన్నారు. జయమ్మ పాత్రలో నటించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని, ఈ సినిమా తమందరికీ ఎంతో ముఖ్యమైందని రష్మిక వెల్లడించారు. ఇంతటి హృదయంతో, ప్రేమతో ఈ చిత్రాన్ని రూపొందించిన మొత్తం టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులు థియేటర్లలో ఈ కథను చూసి అనుభూతి చెందడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.
విజయదశమికి ‘రణబాలి’ సందడి
చారిత్రక నేపథ్యం, భావోద్వేగాలు, పోరాట స్ఫూర్తి కలగలిపిన కథతో రూపొందిన ‘రణబాలి’పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. తాజాగా నారా లోకేష్ ప్రశంసలు, అందుకు విజయ్ దేవరకొండ, రష్మిక స్పందనలు ఈ సినిమాపై చర్చను మరింత పెంచాయి. అక్టోబర్ 16న విజయదశమి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.