Roopayanamaha Movie Review:
చిత్రం : రూపాయనమః
రేటింగ్ : 2.75/5
నటీనటులు : అరవింద్ పండ్రాతే, వేణు పోల్సాని, డి. అనుదీప్, శ్రావణి మల్కాని, క్రాక్ శ్రీమణి, విషన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి తదితరులు..
బ్యానర్ : చిత్ర వేద ప్రొడక్షన్స్
నిర్మాత : పావని సాగి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : అరవింద్ రెడ్డి
సంగీతం : రిషి ఎం
సినిమాటోగ్రఫీ : జింకా వరుణ్ నాయుడు
ఎడిటింగ్ : రవితేజ గిరిజాల
విడుదల తేదీ : అక్టోబర్ 2, 2026
Roopayanamaha Movie Review:
కథ విషయానికొస్తే..
హరి నారాయణ ఓ సాధారణ పల్లెటూరి వ్యక్తి. తల్లి, భార్య, కూతురితో కలిసి ఆర్థిక ఇబ్బందుల మధ్య జీవనం సాగిస్తుంటాడు. అలాంటి సమయంలో అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు ఏకంగా కోటి రూపాయల బహుమతి వస్తుంది. దీంతో తన కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయని హరి, అతని కుటుంబ సభ్యులు ఆనందపడతారు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవదు. కోటి రూపాయలు తెచ్చిపెట్టే ఆ లాటరీ టికెట్ ఇంట్లో కనిపించకుండా పోతుంది. కుటుంబమంతా టికెట్ కోసం వెతుకుతున్న సమయంలో హరికి ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వస్తుంది. టికెట్ తన దగ్గర ఉందని, దాన్ని తిరిగి ఇవ్వాలంటే రూ.10 లక్షలు చెల్లించాలని అతడు డిమాండ్ చేస్తాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు? టికెట్ అతని చేతికి ఎలా వచ్చింది? డబ్బులు లేని హరి ఆ డిమాండ్‌ను ఎలా ఎదుర్కొన్నాడు? చివరికి లాటరీ టికెట్ ఎవరి సొంతమైంది? అనేది తెరపై చూడాల్సిన కథ.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
అరవింద్ పండ్రాతే సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా తన పాత్రలో సహజంగా కనిపించాడు. ముఖ్యంగా లాటరీ టికెట్ పోయిన తర్వాత అతనిలో కనిపించే ఆందోళన, టెన్షన్‌ను చక్కగా చూపించాడు. శ్రావణి మల్కాని తన పాత్ర పరిధిలో బాగానే నటించారు. వేణు పోల్సాని, డి. అనుదీప్ తదితరులు తమ పాత్రలకు తగ్గట్లుగా నటిస్తూ కథనానికి అవసరమైన వినోదాన్ని అందించారు. సహాయ పాత్రల్లో కనిపించిన నటీనటులు కూడా గ్రామీణ వాతావరణానికి తగ్గ సహజత్వాన్ని తీసుకొచ్చారు. పెద్దగా స్టార్ ఇమేజ్ ఉన్న నటులు లేకపోయినా నటన విషయంలో సినిమా నిరాశపరచదు.

టెక్నికల్ టీమ్ గురించి..
దర్శకుడు అరవింద్ రెడ్డి సింపుల్ పాయింట్‌ను గ్రామీణ నేపథ్యంతో సస్పెన్స్, కామెడీ అంశాలతో చెప్పే ప్రయత్నం చేశారు. కథలోని ప్రధాన సమస్యను సెకండాఫ్‌లో ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడి ప్రయత్నం కనిపిస్తుంది. జింకా వరుణ్ నాయుడు సినిమాటోగ్రఫీ పల్లెటూరి వాతావరణాన్ని సహజంగా తెరపైకి తీసుకొచ్చింది. రిషి ఎం అందించిన సంగీతం సన్నివేశాలకు తగ్గట్టుగా సాగింది. ముఖ్యంగా ఉత్కంఠభరితమైన సందర్భాల్లో నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌గా నిలుస్తుంది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ సింపుల్‌గా ఉంది. అయితే ఫస్టాఫ్‌లోని కొన్ని సన్నివేశాలను మరింత కుదించి ఉంటే సినిమా మరింత వేగంగా అనిపించేది.
సినిమా ఎలా ఉందంటే..
‘కోటి రూపాయల లాటరీ టికెట్ పోతే ఏం జరుగుతుంది?’ అనే సింపుల్ పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం ఇది. కథలోని గ్రామీణ నేటివిటీ, కుటుంబ సభ్యుల మధ్య సాగే సంభాషణలు సినిమాకు ప్రత్యేకమైన ఫీల్‌ను తీసుకొస్తాయి. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం, కుటుంబ నేపథ్యాన్ని చూపించడానికి కొంత ఎక్కువ సమయం తీసుకోవడంతో కథనం నెమ్మదిగా అనిపిస్తుంది. లాటరీ టికెట్ మిస్సైన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చే ఫోన్ కాల్‌తో సినిమాలో ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్‌లో సస్పెన్స్, కామెడీ రెండూ కలగలిసి కథను ముందుకు తీసుకెళ్తాయి. హరి ఎదుర్కొనే పరిస్థితులు, ఫోన్లో జరిగే సంభాషణలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగిస్తాయి. క్లైమాక్స్ కూడా కథకు తగిన ముగింపును ఇస్తుంది. అయితే కొన్ని చోట్ల సన్నివేశాలను మరింత బిగుతుగా రాసి ఉంటే థ్రిల్లింగ్ ఎఫెక్ట్ ఇంకాస్త పెరిగేది.
ప్లస్ పాయింట్స్ :
ఆసక్తికరమైన లాటరీ టికెట్ పాయింట్
గ్రామీణ నేపథ్యం, నేటివిటీ
సహజమైన నటన
సెకండాఫ్‌లో వచ్చే సస్పెన్స్ అంశాలు
సందర్భానుసారంగా పండే కామెడీ
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్‌లో నెమ్మదైన కథనం
కొన్ని సన్నివేశాల్లో సాగదీత
ఫైనల్‌గా చెప్పాలంటే..
రూపాయనమః పెద్దగా హంగులు, భారీ బడ్జెట్ అంశాల జోలికి వెళ్లకుండా ఓ చిన్న పాయింట్‌ను గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేసిన సినిమా. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, లాటరీ టికెట్ చుట్టూ మొదలయ్యే సస్పెన్స్‌తో సెకండాఫ్‌లో సినిమా ఊపందుకుంటుంది. సహజమైన గ్రామీణ వాతావరణం, కామెడీతో కూడిన సస్పెన్స్ కథనాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒకసారి ప్రయత్నించదగ్గ ఆప్షన్‌గా నిలుస్తుంది.