Dhanush–Vadivelu Reunion After 18 Years
కోలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్స్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ మరోసారి తెరపైకి వస్తోంది. హీరో ధనుష్, కమెడియన్ వడివేలు ఏకంగా 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లో అప్పుడే ఆసక్తి మొదలైంది.
Dhanush–Vadivelu Reunion After 18 Years
ధనుష్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘లబ్బర్ పందు’ ఫేమ్ తమిళరాసన్ పచ్చముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం తమిళనాడులోని శివగంగ జిల్లాలో ప్రసిద్ధ మారనాడు కరుప్పణసామి ఆలయంలో సినిమాను ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ధనుష్ 18 అడుగుల భారీ కత్తిని స్వామివారికి కానుకగా సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రీతి ముకుందన్, వడివేలు, ఎస్జే సూర్య, దర్శకుడు తమిళరాసన్ పచ్చముత్తు, సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ తదితరులు పాల్గొన్నారు.
మధురై గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ధనుష్ కెరీర్లో ఇది 56వ చిత్రం కావడం మరో విశేషం.
ఇంతకీ 18 ఏళ్ల గ్యాప్ ఎందుకు?
ధనుష్, వడివేలు గతంలో కలిసి నటించిన సినిమాలకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఆ తర్వాత ఈ ఇద్దరూ ఒకే సినిమాలో కనిపించలేదు. దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి నటిస్తుండటంతో అసలు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందనే ప్రశ్న సహజంగానే అభిమానుల్లో మొదలైంది. దీనిపై వడివేలు స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తమ ఇద్దరి మధ్య ఓ మూడో వ్యక్తి అపార్థాలు, విభేదాలు సృష్టించడంతోనే ఇన్నేళ్ల పాటు కలిసి పనిచేయలేకపోయామని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఇప్పుడు ఆ గ్యాప్‌కు తెరపడటంతో ధనుష్, వడివేలు కాంబినేషన్ మళ్లీ తెరపై సందడి చేయనుంది. యాక్షన్‌తో పాటు వడివేలు కామెడీకి కూడా స్పేస్ ఉంటుందా? 18 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.