Meghamsh Srihari Aasmaan TeaserLaunch event
రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘ఆస్మాన్’. శ్రీమతి కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు.
Meghamsh Srihari Aasmaan TeaserLaunch event
శ్రీహరి జయంతి సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. తాజాగా మేఘాంశ్ శ్రీహరి పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ కార్యక్రమానికి రా కింగ్ మంచు మనోజ్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. “నా తమ్ముడు మేఘాంశ్ ‘ఆస్మాన్’ కోసం రావడం చాలా ఆనందంగా ఉంది. శ్రీహరి అంకుల్ మమ్మల్ని ఎత్తుకుని పెంచారు. నేను కూడా మేఘాంశ్‌ను ఎత్తుకున్నాను. సినిమా ఉన్నంతకాలం రియల్ స్టార్ శ్రీహరి గారు మన మధ్య ఉంటారు. మేఘాంశ్‌ను ఎలా చూడాలని అనుకున్నానో, టీజర్లో అలానే కనిపించాడు. టీజర్ నాకు చాలా నచ్చింది. ప్రశాంత్ గారి బీజీఎం అద్భుతంగా ఉంది. ఈ సినిమాను అరబిక్‌లో కూడా విడుదల చేయడం సంతోషంగా ఉంది. ‘ఆస్మాన్’ గొప్ప హిట్ కావాలని కోరుకుంటున్నాను. మేఘాంశ్‌ను ప్రేక్షకులంతా ఆదరించి మంచి విజయాన్ని అందించాలని ఆశిస్తున్నాను” అన్నారు.
హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. “నా కోసం వచ్చిన మనోజ్ అన్నకి, శివాత్మికకు ప్రత్యేకంగా థాంక్స్. ‘ఆస్మాన్’ను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ సినిమా ఇంతటి స్థాయికి రావడానికి షోయబ్ గారి విజువల్స్ ఎంతో కీలకం. రాయంచ అద్భుతంగా నటించారు. దర్శకుడు రామ్ నందన్ సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. అది నా ప్రామిస్” అన్నారు.
శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ.. “ ‘ఆస్మాన్’ టీజర్ చాలా అద్భుతంగా ఉంది. విజువల్స్, మేఘాంశ్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. రాయంచ చాలా క్యూట్‌గా కనిపిస్తున్నారు. ప్రశాంత్ గారి మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. మేఘాంశ్ మా స్కూల్లో సీనియర్. ‘ఆస్మాన్’తో అతనికి మంచి విజయం దక్కాలని, సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ.. “ ‘ఆస్మాన్’ టీజర్ ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాను. కథలోని చాలా అంశాలను టీజర్లో చూపించాం. మోషన్ పోస్టర్‌తో మొదలైన సస్పెన్స్‌ను టీజర్‌తో మరింత పెంచాం. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలు వెంకటేష్, శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు. మేఘాంశ్‌లో టాలెంట్‌తో పాటు డెడికేషన్ కూడా ఉంది. షోయబ్ గారు అద్భుతమైన విజువల్స్ అందించారు. ప్రశాంత్ గారి సంగీతం సినిమాకు మరో ఆకర్షణగా నిలుస్తుంది. రాయంచ చక్కగా నటించారు. సినిమా విడుదల వరకు ప్రేక్షకులకు ఏదో ఒక మిస్టరీని పరిచయం చేస్తూనే ఉంటాం” అన్నారు.
నిర్మాత వెంకటేష్ కొండారు మాట్లాడుతూ.. “మేం చెప్పాలనుకున్న విషయాలను ‘ఆస్మాన్’ టీజర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. శ్రీహరి గారి కుటుంబంతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన శాంతమ్మ, శశాంక్, మేఘాంశ్ గారికి ధన్యవాదాలు. మా కోసం వచ్చిన మనోజ్ అన్నకి, శివాత్మిక గారికి ప్రత్యేక కృతజ్ఞతలు” అన్నారు.
హీరోయిన్ రాయంచ మాట్లాడుతూ.. “ ‘ఆస్మాన్’ టీజర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన మనోజ్ గారికి, శివాత్మిక గారికి థాంక్స్. ఇలాంటి మంచి సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. షోయబ్ గారు మమ్మల్ని ఎంతో అందంగా తెరపై చూపించారు. ఈ సినిమాతో మేఘాంశ్‌కు మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. ‘ఆస్మాన్’కు మీడియా, ప్రేక్షకుల నుంచి పూర్తి సహకారం లభించాలని ఆశిస్తున్నాను” అన్నారు.
సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి మాట్లాడుతూ.. “ ‘ఆస్మాన్’లో భాగమయ్యే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాకు పనిచేయడాన్ని ఎంతో ఆస్వాదించాను. టీజర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన మనోజ్ గారికి, శివాత్మిక గారికి థాంక్స్. మేఘాంశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు” అన్నారు.
టీజర్‌తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచిన ‘ఆస్మాన్’ టీమ్.. సినిమా విడుదల వరకు కథకు సంబంధించిన మిస్టరీని కొనసాగించనున్నట్లు వెల్లడించింది.