లెజెండరీ సింగర్ ఆశా భోస్లే (92) ఆదివారం ఉదయం కన్నుమూశారు. నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేర్చగా, కొద్దిసేపతి క్రితం తుదిశ్వాస విడిచారు.
ఆశా భోస్లే 1933 సెప్టెంబర్8 న మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా గోవర్‌లో జన్మించారు. తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్, ప్రముఖ శాస్త్రీయ గాయకుడు, నటుడు. తల్లి శేవంతి మంగేష్కర్. భారతరత్న, లతా మంగేష్కర్ సోదరే ఆశా మంగేష్కర్. వీరి తోబుట్టువులు మీనా ఖాదికర్, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్. బాల్యంలోనే తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ భారం పెద్దవారైన లతా, ఆశా మంగేష్కర్‌లపై పడింది. తండ్రి వారసత్వంగా అందించిన సంగీతం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెడుతుందని ఆమె ఏనాడు ఊహించలేదు. ఆశా భోస్లే భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక ధ్రువతార. ఆశా మంగేష్కర్ తన 11వ ఏటనే మారఠీ చిత్రం మజాబాల్‌లో చలా చలా నౌ చలా అంటుూ పాడి సంగీత ప్రియుల్ని విస్మయానికి గురి చేశారు.
తన పాటలతో హిందీ ప్రేక్షకులను అలరించి!
1948లో ‘చునారియా’ చిత్రంలోని “సావన్ ఆయా” పాటతో హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. రాజ్‌కపూర్ ‘బూట్ పాలిష్’ ఓ.పి. నయ్యర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘సి.ఐ.డి’ చిత్రాలు ఆమె కెరీర్‌ను మలుపు తిప్పాయి. ఓ.పి. నయ్యర్, ఎస్.డి. బర్మన్, ఆర్.డి. బర్మన్ , కయ్యామ్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో ఆమె ఎన్నో ఐకానిక్ పాటలను పాడారు. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, బెంగాలీ వంటి అనేక భారతీయ భాషల్లో ఆమె పాటలు పాడారు. తెలుగులో ‘మెరుపు కలలు’ ‘చిన్ని కృష్ణుడు’ చిత్రాలలోని పాటలు ప్రేక్షకులను అలరించాయి. శంకరాభరణంలో మిత్రమా యెదుట నిలువకుమా, బొబ్బిలి పులిలో “ఓ సుబ్బారావు, ఓ అప్పారావు” వంటి సరదా పాటలు పాడారు. చంద్రలేఖలో “మౌనమేలనోయి అనే క్లాసిక్ మెలోడీతో అలరించారు.అంతఃపురంలో శ్రీశైల మల్లయ్య వంటి పాటలు ఆమె గాత్ర వైవిధ్యాన్ని చాటిచెప్పాయి. సినిమా పాటలకే పరిమితం కాకుండా గజల్స్, భజనలు, పాప్ మ్యూజిక్, జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతంలోనూ తనదైన ముద్ర వేశారు.
ప్రపంచంలోనే అత్యధిక రికార్డింగ్‌లు చేసిన గాయని
ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన ఆమె ప్రస్థానంలో వేల సంఖ్యలో పాటలు పాడి, ప్రపంచంలోనే అత్యధిక రికార్డింగ్‌లు చేసిన గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. పదేళ్ల వయసులోనే పాటలు పాడడం ప్రారంభించిన ఆశా భోస్లే 8 దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్‌లో 800లకు పైగా చిత్రాల్లో సుమారు 12 వేలకు పైగా పాటలు పాడారు. గజల్స్, పాప్, ప్రైవేట్ ఆల్బమ్స్.. ఇలా విభిన్న శైలుల్లో తన గాత్ర మాధుర్యాన్ని శ్రోతలకు పంచారు. హిందీలో ‘దమ్ మారో దమ్’, ‘పియా తూ అబ్ తో ఆజా’, లాంటి ఎన్నో మర్చిపోలేని పాటలకు తన గ్రాతంతో ప్రాణం పోశారామె. దశాబ్దాల తరబడి బాలీవుడ్‌లోనే కాదు 20కి పైగా దేశవిదేశీ భాషలలో వివిధ చిత్రాలకు తన గాత్రాన్నందించారు.
ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు
ఆశా భోస్లే ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. ఉమ్రావ్ జాన్’ ‘ఇజాజత్’ చిత్రాలకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. 2000వ సంవత్సరంలో భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత సినిమా పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది. 2011లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. 2002లో బిబిసి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. ‘ఉమ్రావ్ జాన్’ ‘ఇజాజత్’ చిత్రాలకు గాను రెండుసార్లు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. 7 సార్లు ఉత్తమ గాయని అవార్డులను గెలుచుకున్నారు. 2001లో ‘ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డును అందుకున్నారు.
తనకు 16 ఏళ్ల వయసున్నప్పుడే 31 ఏళ్ల గణపత్ రావ్ భోస్లేను ప్రేమ వివాహం చేసుకున్నారు ఆశ. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. వైవాహిక జీవితంలో పలు సవాళ్లు ఎదుర్కొన్న ఆమె.. 1960లో తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. 1980లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌డీ బర్మన్‌ను వివాహమాడారు ఆశ. 1994లో ఆయన చనిపోవడంతో అప్పట్నుంచి తన పిల్లలు, మనవడు-మనవరాలే లోకంగా గడుపుతున్నారు.
ఆమె మరణం పట్ల బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్ ఇతర చిత్ర పరిశ్రమల్లో పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.





