Sharwanand Sankranti race with George Krish
‘చార్మింగ్ స్టార్’ శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రం ‘జార్జ్ క్రిష్’ గ్రాండ్‌గా లాంచ్ అయింది. AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్‌తో పాటు విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sharwanand Sankranti race with George Krish
పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాను శ్రీను వైట్ల తనదైన ఎంటర్టైన్మెంట్ టచ్‌తో తెరకెక్కించనున్నారు. ప్రత్యేకమైన డిజైన్‌తో విడుదల చేసిన టైటిల్ పోస్టర్లో పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించే రంగులు, సాంప్రదాయ అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. టైటిల్ డిజైన్‌లో శర్వానంద్ హీరోయిన్ను ఎత్తుకున్నట్టుగా కనిపించే సిల్హౌట్‌ను కూడా ఉంచడంతో సినిమాలో రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కు ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ‘జార్జ్ క్రిష్’ షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టగా, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల తొలి షాట్‌ను తెరకెక్కించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, కెవీ గుహన్ సినిమాటోగ్రాఫర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్‌గా, నందు సవిరిగాన, గోపీ మోహన్ రైటర్స్‌గా వర్క్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. ఈ ఏడాది ‘నారి నారి నడుమ మురారి’ తర్వాత మరోసారి శర్వానంద్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. తన ప్రియమిత్రుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తొలిసారి సినిమా చేస్తున్నందుకు మరింత సంతోషంగా ఉందని తెలిపారు. జనవరి 14న సినిమాను విడుదల చేస్తున్నామని, ఈ కాంబినేషన్ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్రాంతితో శర్వానంద్ సెకండ్ హ్యాట్రిక్‌కు శ్రీకారం చుడతారని, ఈ సినిమా మరోసారి నవ్వులు పంచుతుందని అన్నారు.
దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ.. అనిల్ సుంకరతో కలిసి చేస్తున్న తొలి సినిమా ఇదేనని, నందు సవిరిగాన అందించిన కథ అద్భుతంగా ఉందని తెలిపారు. కథపై పూర్తి నమ్మకంతో ఉన్నామని, శర్వానంద్‌కు కథ చెప్పగానే బాగా నచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి నాన్‌స్టాప్ షూటింగ్ కొనసాగుతుందని, సినిమా కోసం టీమ్ మొత్తం ఎంతో ఉత్సాహంగా ఉందని అన్నారు.
‘జార్జ్ క్రిష్’ ప్రారంభోత్సవం రోజే ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ వివరాలను కూడా మేకర్స్ ప్రకటించడం విశేషం. నిజాం – ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్, విశాఖపట్నం – వాసుదేవ మూవీ క్రియేషన్స్, తూర్పు గోదావరి – వింటేజ్ క్రియేషన్స్, పశ్చిమ గోదావరి – ఆదిత్య ఫిల్మ్స్, కృష్ణా – వ్యోమ్ సినిమాస్, గుంటూరు – ఆర్కే ఎంటర్టైన్మెంట్స్, నెల్లూరు – అభి సినిమాస్, సీడెడ్ – శిల్పకళా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేయనున్నాయి. ఓవర్సీస్ హక్కులను వ్యోమ్ సినిమాస్, సినిమా పారడిసో నిర్వహించనున్నాయి.
శర్వానంద్‌కు ఉన్న సంక్రాంతి సెంటిమెంట్, శ్రీను వైట్లకు ఉన్న కామెడీ ఎంటర్టైన్మెంట్ బ్రాండ్, కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రూపొందుతున్న కథ.. ఈ మూడు అంశాలతో ‘జార్జ్ క్రిష్’పై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. జనవరి 14, 2027న సంక్రాంతి పండుగ సందర్భంగా ‘జార్జ్ క్రిష్’ థియేటర్లలో సందడి చేయనుంది.
ఇప్పటికే ‘నారి నారి నడుమ మురారి’, ‘బైకర్’ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటున్న శర్వానంద్‌కు సంక్రాంతి సెంటిమెంట్ ప్రత్యేకమైనది. ‘శతమానం భవతి’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘నారి నారి నడుమ మురారి’ వంటి సినిమాలతో పండుగ సీజన్లో మంచి విజయాలను సొంతం చేసుకున్న శర్వా.. ఇప్పుడు ‘జార్జ్ క్రిష్’తో మరోసారి సంక్రాంతి బరిలో దిగుతున్నారు.
మరోవైపు వచ్చే సంక్రాంతి బరిలో వెంకటేష్, అనిల్ రావిపూడి, రజినీకాంత్ ధర్మన్, చిరంజీవి, బాబీ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రాలు పొంగల్ బరిలో ఉన్నాయి. వీటితో పోటీగా ఇప్పుడు శర్వానంద్ మూవీ కూడా రానుందని అధికారికంగా ప్రకటించడంతో పొంగల్ బరిలో గెలిచి బాక్సాఫీస్ వద్ద గెలిచేదెవరు అనే ఆసక్తి టాలీవుడ్లో నెలకొంది.